సిల్లీ ఫెలో - 44

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 44

- మల్లిక్

 

"సార్! మెల్లగా పిలిచాడు బుచ్చిబాబు.

ఏకాంబరం ఫైళ్ళలోంచి తలెత్తి చూసాడు. ఏంటి అన్నట్లు కళ్ళు ఎగరేసాడు.

"చిన్న రిక్వెస్టు సార్"

"నాన్సకుండా త్వరగా చెప్పు. నీలాగా మరో నలుగురు లస్కుటపాకీలు వచ్చి నానుస్తూ మాట్లాడితే మొత్తం ఫైళ్ళన్నీ పెండింగ్ లో పడిపోతాయ్"

"అబ్బే ... నేను ఎక్కువగా నాన్సను సార్! మరేమో నాకు విజయవాడ అయిన ట్రాన్స్ ఫర్ కాన్సిల్ అయింది కద్సార్.

ఊ.. ఇప్పుడు ప్రమోషన్ కావాలా?" వ్యంగ్యంగా అడిగాడు ఏకాంబరం.

"అబ్బే.. అంత పెద్ద కోరికలేం లేవు సార్. నా ట్రాన్స్ ఫర్ ఆర్డర్ ను కాన్సిల్ చేసిన ఆర్డర్ ని కాన్సిల్ చేయాలి సార్... అంటే నేను విజయవాడ వెళ్ళిపోతా సార్"

"వ్వాట్!? ట్రాన్స్ ఫర్ కాన్సిల్ చేయించుకోవడమూ, తిరిగి వెళ్ళిపోతానని అనడమూ.. అంతా నీ ఇష్టమేనా? నీ కళ్ళకి మేమంతా కిల్లారికిత్తిగాళ్ళాలా కనిపిస్తున్నామా? అయినా ట్రాన్సు ఫర్ వద్దని నువ్వేగా కాన్సిల్ చేయించుకున్నావ్? మళ్ళీ వెళతానంటావేం?"

"కొద్దిగా పర్సనల్ ప్రాబ్లెమ్స్ ఉన్నాయి సార్! అందుకే విజయవాడ వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను సార్"

"పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటున్నావ్, కనిపించిన లింగులిటుకు గాళ్ళందరి దగ్గరా అప్పులు చేసి ఇక్కడి నుండి జండా ఎత్తేస్తున్నావా ఏంటి?" కళ్ళు ఎగరేస్తూ అడిగాడు ఏకాంబరం.

అతని ప్రశ్నకు బుచ్చిబాబు కంగారు పడిపోయాడు.

"ఛీఛీఛీ..... ధూధూధూ.... అబ్బే... నేనలాంటివాడిని కాదుసార్. ఛీ..... యాక్...."

"ఇంక చాల్లే ఆపు. మొత్తం నీ ఉమ్ము తుంపర్లతో నేను తడిచిపోయేలా వున్నాను. అయినా నా చేతిలో ఏముందని ట్రాన్సుఫర్ ఆర్డర్ ని కాన్సిల్ చేసిన ఆర్డర్ ని కాన్సిల్ చేస్తాను? హెడ్డాఫీసులో వాళ్ళు కదా చేస్తారు?"

"కానీ మీరు బుచ్చిబాబు నాకు అవసరం లేదు. అతన్ని విజయవాడకే పోస్టు చేయండి అని హెడ్డాఫీసు వాళ్ళకి లెటర్ రాస్తే పని జరిగిపోతుంది సార్" ప్రాధేయపూర్వకంగా అడిగాడు బుచ్చిబాబు.

"అప్పుడుగానీ హెడ్డాఫీసులో డస్కుఢమాల్ గాళ్ళు నన్ను సెంట్ పర్సెంట్ కిల్లారికిత్తిగాడినని అనుకోరు. చాల్లేవయ్యా భలే సలహాఇచ్చావ్. హెడ్డాఫీసు ఇచ్చే ఆర్డర్సుని కాదనడానికి నేనెంత! నీ ప్రయత్నాలేవో నువ్వే చేస్కో ఫో!" అంటూ ఫైళ్ళలో తలదూర్చేసాడు ఏకాంబరం.

బుచ్చిబాబు నిరాశగా క్యాబిన్ లోంచి బయటకు వచ్చాడు.

అతని ప్లాన్ ప్రకారం మళ్ళీ విజయవాడకి ట్రాన్స్ ఫర్ చేయించుకోవాలి. సీత చేత ఒక సంవత్సరం పాటు లాంగ్ లీవ్ పెట్టించాలి! అలా ఇద్దరూ కలసి విజయవాడ వెళ్ళి తెలీని మనుష్యుల మధ్య కాపురం పెట్టాలి. అప్పుడే వీలుంటే సీతకు కూడా విజయవాడలోనే ఏదో ఒక ఒక ఉద్యోగం చూడాలి. లేదా తను ఇష్టపడితే ఇంట్లోనే వుంటుంది.

ఈ విషయంలో బుచ్చిబాబు సీతని వొప్పించాడు.

కానీ తను విజయవాడకి వెళ్ళడంలో ఏకాంబరం సహకరించడం లేదే? ఎలా?

బుచ్చిబాబు మనసులో తళుక్కున ఆలోచన మెరిసింది.

మినిస్టర్ మిన్నారావు!

యస్! తన ట్రాన్స్ ఫర్ ఆపుజేయించిన మినిస్టర్ మిన్నారావే తిరిగి తనని ట్రాన్సుఫర్ చేయించాలి.

బుచ్చిబాబు హుషారుగా విజిలేసాడు.