సిల్లీ ఫెలో - 43

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 43

- మల్లిక్

 

"సీతా... నీకు నేనంత నీచుడిలా కనిపిస్తున్నానా? అయినా నా ఉద్దేశ్యం ఏంటో నీకు తెలుసు. తెలిసీ ఎందుకిలా బాధపడ్తావ్?"

నీ ఉద్దేశ్యం అంత మంచిది కాదు? నీకు మొన్ననే వివరంగా చెప్పాను. అయినా అర్థంకాలేదా?"

"ఏమో? పెళ్ళి చేసుకోకుండా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కలిసి జీవించడం ఈ సంఘం ఒప్పుకుంటుందంటావా?"

"కొత్త విషయం ఏదైనా ఈ సంఘం ఒప్పుకోదు. అదీ ఇలాంటి విప్లవాత్మకమైన విషయాన్ని అసలు ఒప్పుకోదు. విధవా వివాహాల్ని, ప్రేమ వివాహాల్ని, కులాంతర, మతాంతర వివాహాల్ని కూడా సంఘం మొదట్లో ఒప్పుకోలేదు. మరి ఇప్పుడు? అలానే మన విషయం కూడా. మనం మన భావితరాలవారికి ఆదర్శం కావాలి. అందరూ జీవితాంతం ప్రేమైక జీవనాన్ని గడపాలి" ఆవేశంగా అన్నాడు బుచ్చిబాబు.

సీత నవ్వింది.

"బుచ్చీ! నువ్వు అమాయకుడివో మూర్ఖుడివో నాకు తెలియడం లేదు".

"ఏదైనా అనుకో. కానీ నన్ను కాదనను."

"ఎంతసేపూ నీ ఆలోచన నీదేగానీ నాకు చెడి జరిగినా నీకు ఫరవాలేదు అంతేగా?"

"సీతా! నామీద నీకు అనుమానమా? పెళ్ళి చేసుకోనంత మాత్రాన నిన్ను వదిలేస్తానా? మెడలో తాళి కట్టి పెళ్ళి చేస్కున్న ఎంతమంది భర్తలు తమ భార్యల్ని వదిలివేయుట లేదు?"

"నీ ప్రేమ మీద నాకు నమ్మకం వుంది. బుచ్చిబాబు. కానీ నా సోషల్ స్టాటస్ గురించి ఆలోచించావా? అందరూ నన్ను నీ ఉంపుడుగత్తెనని అనుకోవడం నేను భరించలేను. అయినా నా గురించి అందరూ అలా అనుకోవడం నాకు మాత్రం నచ్చుతుందా?" అడిగింది సీత బుచ్చిబాబు గడ్డం పట్టుకుని.

బుచ్చిబాబు ఆలోచనలో పడ్డాడు.

"నువ్వు ఇన్ని కబర్లు చెప్తున్నావు గానీ మీ అమ్మానాన్నా నువ్విలా పెళ్ళి పెటాకులు లేకుండా నాతో కాపురం చేయడానికి ఇష్టపడ్తారా?" మళ్ళీ అడిగింది సీత.

బుచ్చిబాబు సీత వంక చూసి చిరునవ్వు నవ్వాడు.

"నేను అన్నీ ఆలోచించే నిర్ణయాలు తీసుకున్నా సీతా. మనం ఈ ఊళ్ళోనే వుండం. వేరే ఊరికెళ్ళి అక్కడ కాపురం పెడతాం" తన తెలివితేటలతో మురిసిపోతూ అన్నాడు బుచ్చిబాబు.

సీత ఆలోచనలో పడింది.

"ప్లీజ్ సీతా. కాదనకు. ఒకవేళ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని రుజువైననాడు నేను నలుగురిలో నిన్ను పెళ్ళి చేసుకుంటా. సరేనా? నా మాటని నమ్ముతావుగా?" అన్నాడు బుచ్చిబాబు.

కొన్ని క్షణాలు ఆలోచించిన తరువాత సీత అంది.

"ఏమో బాబు.ఇంక నీ ఇష్టం. నీమీద నాకున్న ప్రేమవల్ల నిన్ను కాదని అనలేకపోతున్నా!"

*             *            *