సిల్లీ ఫెలో - 40

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 40

- మల్లిక్

 

సాయంత్రం.

ఆఫీసు నుండి ఇంటి కెళ్తూనే బుచ్చిబాబు మీద మండిపడ్డాడు పర్వతాలరావు.

సన్నాసి వెధవా, ఏబ్రాసి వెధవా, పింజారీ వెధవా, తింగరి వెధవా, వెధవన్నరవెధవా....

ఏంటి నాన్నా... నేను ఆఫీసు నుండి త్వరగానే వచ్చాగా... ఎందుకలా తిడ్తావ్?" విసుక్కుంటూ అన్నాడు బుచ్చిబాబు.

"అవునండీ పాపం" అంది పార్వతమ్మ.

"అందుకనే తిడ్తున్నా! పెళ్ళిరోజు దగ్గర పడ్తుందా... అసలు వీడేమైనా పట్టించుకుంటున్నాడా? ఇది వరకు ఆఫీసు నుండి ఊరంతా బలాదూర్ తిగిరి ఇంటికి ఆలస్యంగా వచ్చేవాడు. ఇప్పుడు చూసు పెళ్ళి పనులు బోల్డు పెట్టుకుని ఎంచక్కా ఇంటికెలా త్వరగా వచ్చేస్తున్నాడో? ఏరా వెధవాయ్...నువ్వు పెళ్ళి బట్టలు ఎప్పుడు కొంటావ్. టైలర్ కి ఎప్పుడిస్తావ్? ఆ పెళ్ళి శుభలేఖలు ఎప్పుడు అచ్చేయిస్తావ్... అవి అందరికీ ఎప్పుడు పంచుతావ్? ఇంకా బోల్డు పన్లున్నాయి..." చిందులేస్తూ అన్నాడు పర్వతాలరావు.

"నేను పెళ్ళి చేసుకోవడం లేదు నాన్నా" మెల్లగా అన్నాడు బుచ్చిబాబు.

పర్వతాలరావు, పార్వతమ్మ ఇద్దరూ ఉలిక్కిపడి చూసారు అతనివైపు.

"ఏరా జోకులేస్తున్నావా?" అన్నాడు పర్వతాలరావు నాలుగు క్షణాల తరువాత.

"అవే జోకులురా పాపం" అంది పార్వతమ్మ.

"జోకులు కాదమ్మా... నిజంగానే అంటున్నా" నసిగాడు బుచ్చిబాబు.

"ఏం ఎందుకని చేస్కోవు? ఆ అమ్మాయి లక్షణంగా వుంది. పైగా నువ్వే ఏరికోరి చేసుకుంటునన్న అమ్మాయి. చెప్పరా బద్మాషెధవా!" గంతులేసాడు పర్వతాలరావు.

బుచ్చిబాబు గొంతులో పచ్చివెలక్కాయ్ పడింది.

నిజమే... సీత తను ప్రేమించిన అమ్మాయి. ఎందుకు చేస్కోవడంలేదంటే ఏమని చెప్తాడు? సీత నచ్చలేదని చెప్పలేడు. అలాగని అసలు కారణం చెప్తే పీకమీద కాలేసి తొక్కుతాడు పర్వతాలరావు.

"చెప్పరా పనికిమాలిన వెధవా" అరిచాడు పర్వతాలరావు.

"అదీ... మరీ..." నసిగాడు బుచ్చిబాబు.

"ఏంటా నసుగుడు? సడన్ గా కోజ్జాగా మారిపోయావా ఏంటి?" అందుకే పెళ్ళోద్దంటున్నావా?"

"త్వరగా చెప్పరా పాపం! ఆయన్నెందుకిలా అరిపిస్తున్నావు?" అంది పార్వతమ్మ.

"సీత ఎలాంటిదో తలీక ప్రేమించాను నాన్నా. ఆ అమ్మాయి కారెక్టర్ మంచిదికాదని నాకీవాళే తెల్సింది."

చటుక్కున అనేశాడు బుచ్చిబాబు. అలా అంటే తప్ప ఆ పెళ్ళి ఆగదని అతనికి తెలుసు.

"ఆ!"

పర్వతాలరావు, పార్వతమ్మ నోళ్ళు తెరిచారు.