సిల్లీ ఫెలో - 32

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 32

- మల్లిక్

 

కాస్సేపు ఆ కబుర్లూ ఈ కబుర్లూ మాట్లాడుకున్నాక బుచ్చిబాబు అన్నాడు. "సర్లేగానీ.. ఎలాగూ ఇండియాకి వచ్చావు కదా.. ఇక్కడ ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకుని మీ అమెరికాకు తీసుకెళ్ళరాద్రుటా సుందర్?"

ఆ మాట వినగానే సుందర్ పకపకా అమెరికాలో స్టయిల్లో నవ్వాడు.

"పెళ్ళి? యూ మీన్ మ్యారేజ్!? హో హో హో... వాటే జోక్?"

"పెళ్ళంటే జోకంటావ్ సిల్లీగా...ఏరా... నువ్వు మగాడివి కావా?"

"అషలైన షెంట్ పర్షంట్ మగవారే పెండ్లిషేషుకోరు. నా షంగతి తర్వాత ముందు నీ షంగతి చెప్పుము" అన్నాడు సుందర్ బుచ్చిబాబు వీపుమీద గుద్దుతూ.

బుచ్చిబాబు బాధగా మూలిగి "ఇదిగో నువ్విలా గుద్దావంటే నిన్ను ఏదో ఓ హోటల్లో దించేసి నేను మా ఇంటికి పోతానంతే" అన్నాడు సీరియస్ గా.

"ఓక్కే.. ఓక్కే... షెప్పుడు షెప్పుడు!" బుచ్చిబాబు భుజం తట్టాడు సుందర్.

బుచ్చిబాబు సిగ్గుతో మెలికలు తిరుగుతూ నా పెళ్ళి ఫిక్స్ అయిందిరా సుందర్.. ఈ నెలలోనే ఇరవయ్యో తారీఖున" అన్నాడు.

ఆ మాట వింటూనే సుందర్ బాధగా బుర్రకాయని అడ్డంగా ఉపాడు.

"ఓ వెరీ వెరీ బ్యాడ్ న్యూస్" అన్నాడు.

బుచ్చిబాబు అయోమయంగా మొహం పెట్టాడు. "అదేంట్రా.... ఎవరయినా పెళ్ళి చేస్కుంటుంటే కంగ్రాట్స్ అని అంటారుగానీ నువ్వేమో బ్యాడ్ న్యూస్ అంటావేంటి?

"అటుల షెప్పినవాడు ఒట్టి సన్నాసి ... పెండ్లి అనగా ఫ్రీడంను కోలుపోవుట... ఎల్లప్పుడూ దెబ్బలాడుకొనుట... యూనో?" అన్నాడు సుందర్ పోనీటెయిల్ ని ఊగిస్తూ.

"కానీ మాది పెద్దలు కుదిర్చిన వివాహం కాదు. ప్రేమ వివాహం! మేమెందుకు దెబ్బలాడుకుంటాం?" పాయింటు లాగుతూ అన్నాడు బుచ్చిబాబు.

"హాహాహా...లవ్! అనగా ట్రాష్.... ఎచ్చటను ఫ్యూర్ లవ్ లేదు. అమెరికాలో లవ్ షేస్కుని మ్యారేజ్ చేస్కుందురు. మళ్ళీ ఇద్దరూ విడిపోయి వేరే వాళ్ళను ఇద్దరూ మళ్ళీ లవ్ మ్యారేజ్ షేస్కుందుకురు. మళ్ళీ విడిపోయి మళ్ళీ ఇంకొకరిని లవ్ మ్యారేజు షేస్కుందురు. అన్నియు లవ్ మ్యారేజీలే. మరి ఏల విడిపోదురు?"

"అది అమెరికాలో.. ఇండియా అలాక్కాదు. జీవితాంతం కలసి వుంటారు."

"ప్రేమలేకుండా కలసి వుండుట ఎందులకు? తన్నుకుంటూ, తిట్టుకుంటూ జీవితాంతము కలసి వుండుట కన్నా వేరే వివాహము షేస్కుని షుఖముగా నుండవచ్చునుకదా?"

"అలా చేస్తే జనము మొహాన ఉమ్మేస్తారు. ఈ సంఘము ఊర్కుంటుందా?" ఆవేశముగా అడిగాడు బుచ్చిబాబు.

సుందర్ గొల్లున నవ్వాడు.

"అయినచో ఎవరూ ఉమ్మివేయిని ఎడల సంఘము ఏమియూ అనని యెడల మీరూనూ విడిపోయి వేరే పెండ్లి షేసుకొందురు... అవునా? మనసులో వున్నది ఒకటి, బయట షేయునది ఒకటి... షేమ్!"

బుచ్చిబాబు ఖంగుతిని నీళ్ళు నమిలాడు.

"అంటే నా ఉద్దేశ్యం అది కాదనుకో...." అన్నాడు నసుగుతూ.

"ఏదికాదు? అమెరికాలో ఇటుల మనసులో ఒకటి బయటికి ఒకటి మాట్లాడిన ఎడల షూట్ షేయుదురు. నిజము షెప్పుడు.. గుండుమీద షెయ్యి వేసుకుని షెప్పుము..."

"గుండు కాదు.. గుండె" సరిదిద్దాడు బుచ్చిబాబు.

"అదే.. అదే... దానిమీద షెయ్యి వేస్కొని షెప్పుము. ఇండియానందు ఎంత మంది భార్యాభర్తలు సంపూర్ణ ఇష్టముతో కాపురము షేయుదురు? కొందరు వంష గౌరవము కొరకు కాపురము షేయుదురు.కొందరు పిల్లల కొరకు కాపురము షేయుదురు. మరికొందరు పరువు మర్యాదల కొరకు కాపురము షేయుదురు. అంతేయేగానీ మొగుడు కొరకు పెండ్లాము, పెండ్లాము కొరకు మొగుడు కాపురము షేయునా?" ఆవేశముతో ఊగిపోతూ ప్రశ్నించాడు సుందర్.

అతని వాదనకి బుచ్చిబాబు మెత్తబడిపోయాడు.

"నువ్వు అన్నదాంట్లో కాస్త నిజాము లేకపోదనుకో" అన్నాడు.

"కొంషెము కాదు... సెంట్ పర్సంట్ నిజము కలదు"

"కానీ మేము ఆ టైపులోకి రాము!"

"పెండ్లి షేసుకునుటకు ముందు అందరు అట్లనే అనుకొందురు. నువ్వు కూడా అంతే. మేము దెబ్బలాడుకొనెదము. తన్నుకొనెదము అని వివాహమునకు ముందు అనుకుని ఎవరూ వివాహము షేసుకొనరు కదా?"

"నాకిన్ని నీతులు సిల్లీగా చెప్తున్నావు కదా? మరి నువ్వు పెళ్ళి చేస్కోవా?" అడిగాడు బుచ్చిబాబు! ఇప్పుడు దొరికావు.. ఏం చేస్తావో చెప్పు అన్నట్లుగా చూస్తూ.

"నెవర్... నేను పెండ్లి ఎన్నటికీ షేసుకొనను!" పోనీటెయిల్ ఊగిస్తూ అన్నాడు సుందర్.

"అయితే జీవితాంతము ఇలా ఒంటరిగానే వుండిపోతావా?"

"అటుల నేను అనలేదు" నవ్వాడు సుందర్.

"మరి?" బుచ్చిబాబుకి అర్థము కానట్టు చూశాడు.

"నేనూ నా ఫ్రెండ్ జూలీ కలసి జీవిస్తున్నాము! మా ఇద్దరికీ ఆలోచనల యందు తేడాలు వచ్చిన మేము విడిపోదుము, సో.... విడిపోవు వరకు ఆనందముగా, సుఖముగా కాపురము షేసుకుందుము. మేము స్నేహితులము కనుక ఒకరిని ఒకరు గౌరవించుకొనెదము. పెండ్లి షేసుకుని మొగుడూ పెండ్లాములయిన ఒకరిమీద ఒకరికి గౌరవము ఉండదు. తిట్టుకుని, కొట్టుకుని కలసి ఉందురు. అందువలన అమెరికానందు షాలా మంది ఆడా, మగా స్నేహితులు కలసి ఉందురు. అది షాలా మంచి పద్ధతి. నువ్వు కూడా అటులనే షేయుము!"

బుచ్చిబాబు మౌనంగా కూర్చున్నాడు. అతని మెదడుతో ఆలోచనలు తిరుగుతున్నాయి.

పెళ్ళి అయిన తర్వాత సీతకీ, తనకీ మధ్య ప్రేమ, ఆకర్షణా తగ్గిపోతాయా? ఇద్దరూ దెబ్బలాడుకుంటారా?"

"మనమింక ఇంటికి పోవుదుము. రేపు నీ షీటని నాకు పరిచయము షేయుము!" అంటూ బెంచిమీద నుండి లేచి నిలబడ్డాడు సుందర్. బుచ్చిబాబు కూడా లేచి నిలబడ్డాడు.