సిల్లీ ఫెలో - 31

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 31

- మల్లిక్

 

"ఓ.. వెర్రి చీప్.. రెండొందలు అనగా ఓన్లీ సిక్స్ డాలర్స్. అమెరికాలో అయితే మేము సిక్స్ డాలర్స్ టిప్ యిచ్చెదము. లేని యెడల డ్రయివర్ మమ్మల్ని షూట్ చేయును"

అన్నాడు సుందర్ భుజాలు ఎగరేస్తూ.

"నీ బొంద. ఇది అమెరికా కాదు ఇండియా. నువ్వు ప్రతిదాని విలువా రూపాయల్ని డాలర్స్ లోకి మార్చుకుని చూస్కుని వెర్రీ చీప్ అంటూ వాళ్ళముందే అఘోరించకు"

అని సుందర్ చెవిలో కేకలేసి టాక్సీని నూటఏభై రూపాయలకి బేరం ఆడాడు బుచ్చిబాబు.

ఇద్దరూ టాక్సీ ఎక్కారు.

"అమెరికాలో ఇటుల బేరములు ఆడిన షూట్ చేయుదురు" అని సుందరం అంటూ ఉండగా టాక్సీ ముందుకు దూకింది.

టాక్సీ బుచ్చిబాబు ఇంటిముందు ఆగింది. టాక్సీని పంపించి బుచ్చిబాబు సందర్ ని యింట్లోకి తీసుకెళ్ళి హాల్లో వున్నా తల్లితండ్రులకు పరిచయం చేసాడు.

"నాన్నా.. నేను చెప్పానే అమెరికాలోని నా చిన్నప్పటి ఫ్రెండ్ సుందరని... ఇతనే"

"ఓ... అలాగా?" అన్నాడు పర్వతాలరావు.

"ఈయనే మా నాన్న పర్వతాలరావుగారు" చెప్పాడు బుచ్చిబాబు.

అతని వాక్యం పూర్తికాకమునుపే సుందర్ పర్వతాలరావుమీదికి లంఘించి ఆయన్ని ఒడిసి పట్టుకుని రెండు బుగ్గలమీదా చుపుక్... చుపుక్ అని ముద్దులు పెట్టేశాడు.

"ఏంటి బాబూ ఈ వెధవపని?" కంగారుగా వెనక్కి జరిగిపోయి బుగ్గలు తుడుచుకుంటూ అన్నాడు పర్వతాలరావు.

"ఇది అక్కడి ఆచారం నాన్నా. మనం నమస్కారం అనుకోమూ? అలాగన్నమాట" అన్నాడు బుచ్చిబాబు.

"మంచి ఆచారమే" అన్నాడు పర్వతాలరావు.

"అమెరికాలో ముద్దలు పెట్టేటపుడు వెనుకకు జరిగిన యెడల షూట్ చేయుదురు" అన్నాడు సుందర్.

"షూట్ చేస్తారు చేస్తారు పింజారీ వెధవల పీకల మీద కాలేసి తొక్కుతా!" అన్నాడు పర్వతాలరావు పళ్ళు కొరుకుతూ.

"అబ్బ.. నిన్ను కాదులే నాన్నా అమెరికాలో విషయం గురించి చెప్తున్నాడు. ఒరేయ్ సుందర్. ఈవిడేమో మా అమ్మగారు పార్వతమ్మ" అని తల్లిని పరిచయం చేసాడు.

సుందర్ మూతి ముందుకు పెట్టి రెండడుగులు ముందుకు వేసాడు. పార్వతమ్మ రెండు చేతులతో చెంపలు మూస్కుని భయం భయంగా అడుగులు వెనక్కి వేసింది.

"ఒరేయ్! మా అమ్మకు మాత్రం నమస్కారం పెట్టు చాలు. మీ అమెరికాలో షూట్ చేస్తారుగానీ ఇక్కడ పరాయి ఆడవాళ్ళని చుపుక్ చుపుక్ అని ముద్దులు పెడితే

మందుపాతరలు పెట్టి పేల్చి చంపుతారు" అన్నాడు బుచ్చిబాబు సుందర్ భుజాలు పట్టి ఆపుతూ.


"ఓ... వెరీ డేంజరస్!" అన్నాడు సుందర్. "అయితే ముద్దులు కాన్సిల్. నమస్కారమమ్మా పార్వతమ్మా" అన్నాడు.

పార్వతమ్మ తేలిగ్గా ఊపిరి పీల్చుకుని బుగ్గలమీద నుండి చేతులు తియ్యకుండానే నమస్కారం బాబూ!" అంది.

"మధ్యాహ్నం భోజనాల దగ్గర....

"ఓ... కూర షాలా కారముగా యున్నది. చారు షాలా పుల్లగా యున్నది. ఇది యేమ్టి? పప్పులో ఉప్పు ఎక్కువగా వున్నదే" అంటూ  ప్రతిదానికీ వంకలు పెట్టుకుంటూ

తినసాగాడు సుందర్.

"ఇండియాలో చాలా వంటలకి వంకలు పెడ్తూ తింటే టెంకి వాయగొడతారు" అంది చివరకి కసిగా.

"టెంకి? అనగానేమి?" అడిగాడు సుందర్.

"దాని గురించి తర్వాత చెప్తానుగానీ ముందు నువ్వు భోంచెయ్యి" అన్నాడు బుచ్చిబాబు.

భోజనాలయ్యాక బుచ్చిబాబూ, సుందర్ ఇద్దరు మంచంమీద పడుకుని తమ చిన్ననాటి కబుర్లూ, కాలేజీ కబుర్లూ సరదాగా చెప్పుకున్నారు.

ఆ తర్వాత కాస్సేపు నిద్రపోయి ట్యాంక్ బండ్ దగ్గర బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టుకి వెళ్ళి ఒక సిమెంటు బెంచిమీద బైఠాయించారు.