సిల్లీ ఫెలో - 30

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 30

- మల్లిక్

 

"ఏంటండీ మీరు మంచీ మర్యాద లేకుండా? మీరెవరో కూడా నాకు తెలియదు సిల్లీగా!" అన్నాడు చికాకుగా మొహంపెట్టి.

అతను బుచ్చిబాబు వంక ఆశ్చర్యంగా చూశాడు.

"ఓ! అయితే నువ్వు నన్ను నిజంగా గుర్తుపట్టలేదు. వెరీ స్ట్రేంజ్. నేను బుష్షిబాబు... షుండర్... షుండర్! నీ యొక్క స్నేహిటుడు" అన్నాడు.

బుచ్చిబాబు అదిరిపడ్డాడు.

సుందరా?

ఒక నిముషంపాటు చాలా పరిశీలనగా మొహంలో మొహంపెట్టి చూసిన తరువాత అతనిలో సుందర్ పోలికలు కనిపించాయి బుచ్చిబాబుకి.

"ఒరేయ్ సుందర్" బుచ్చిబాబు ఆనందంగా అరుస్తూ సుందర్ ని కౌగలించుకున్నాడు.

సుందర్ కూడా "ఒరేయ్ బుష్షీ" అని రెండు చేతులతో బుచ్చిబాబుని చుట్టేస్తూ వీపులో ఓ గుద్దు గుద్దాడు.

బుచ్చిబాబు బాధగా మూలిగి అతన్ని వదిలేసాడు.

"నీకు ఇదివరకటి కన్నా కాస్త యాక్టివ్ నెస్ పెరిగింది సిల్లీగా!" చెయ్యి వెనక్కి పెట్టి వీపు తడుముకుంటూ అన్నాడు బుచ్చిబాబు.

"ఓ.. య్యా! నేను కొంచెం యాక్టివ్" అన్నాడు సుందర్ భుజాలెగరేస్తూ.

బుచ్చిబాబు అతనికి కాస్త దూరంగా జరిగాడు.

"నీ భాషా, రూపం అన్నీ మారిపోయాయే?"

"య్యా.... షానా రోజులు అమెరికాలో వున్నాను కదా?"

పుట్టినప్పటి నుండి ఇరవై ఏళ్లకు పైగా ఇండియాలో, అదీ ఆంధ్ర రాష్ట్రంలో వుంటే ఏమీలేదు గానీ మూడు సంవత్సరాలు అమెరికాలో వుంటే ఇంతగా మారిపోవాలా? అని

మనసులో అనుకున్నాడు బుచ్చిబాబు.

"నేను ఇచట రెండు రోజులు నీతో స్పెండ్ షేషీ పోదామని వష్టినాన్. హైదరాబాదులో ఏదయినా మంషి హోటల్ కి టీస్కెళ్ళి నన్నుదింపు" అన్నాడు సుందర్ కుడిచేయి

వెనక్కిపేటి పోనీటెయిల్ ని ఎగరేస్తూ.

"భలేవాడివే.... నేనిక్కడ వుండగా నిన్ను హోటల్ ఎలా దిగనిస్తాను? మా ఇంటికేపోదాం పదా"

"అమెరికాలో అయిన ఎవరికీ ఇబ్బంది కలిగించరాదు. అటుల ఇబ్బంది కలుగజేసిన యెడల షూట్ చేయుదురు.

"కానీ నువ్వు మాఇంటికి రావడం వల్ల మాకు ఆనందమే గానీ యిబ్బంది లేదు. అందుచేత మేము నిన్ను షూట్ చెయ్యము. ఒకవేళ నిన్ను షూట్ చెయ్యాలన్నా

మాదగ్గర రివాల్వర్ లేదు" అన్నాడు బుచ్చిబాబు.

"హ్హహ్హహ్హ.... గుడ్ జోక్" అంటూ పిడికిలి బిగించి బుచ్చిబాబు వెన్నులో ఓ గుద్దు గుద్దబోయాడు సుందర్.

కానీ బుచ్చిబాబు అతి చాకచక్యంగా తప్పించుకుని "హమ్మ... ఆశా" అన్నాడు.

సుందర్ ఫకాల్మని నవ్వేశాడు.

బుచ్చిబాబు క్రిందవున్న సుందర్ సూట్ కేసుని అందుకుని అక్కడే వున్నా ఓ టాక్సీ వాడికి తన ఇంటి ఏరియా చెప్పి "వస్తావా?" అని అడిగాడు.

"రాను" అన్నాడు వాడు.

"అదే అమెరికాలో ఇటుల సమాధానం షెప్పిన యెడల షూట్ చేయుదురు" ప్రక్కనున్న వేరే టాక్సీవాడి దగ్గరికి వెళుతూ అన్నాడు సుందర్.

"అలా... ఇక్కడకూడా వుంటే బాగుణ్ణు" అన్నాడు బుచ్చిబాబు.

రెండో టాక్సీవాడు వస్తానని అన్నాడు గానీ రెండొందలు అడిగాడు.