సిల్లీ ఫెలో - 26

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 26

- మల్లిక్

 

"వారెవ్వా.... ఎంత మంచి కుషీ బాత్ చెప్పింది అమ్మ నువ్వు" చెవుల్దాకా నవ్వాడు సేఠ్ దగాచంద్.

"నీ భాషని మంటెట్టా" అని మనసులో అనుకున్నాడు బుచ్చిబాబు.

"మనదీ పెండ్లీ హెప్పుడు బహాన్?" అడిగాడు దగాచంద్.

"మనది కాదు మీది అనాలి" పళ్ళు కొరికాడు బుచ్చిబాబు.

"నాదీ తెల్గూ భాషా మంచికాదు సాబ్. గుస్సా చెయ్యొద్దూ సాబ్!" బుచ్చిబాబుతో అని సీతతో "సాబ్ గుస్సావాలా ఆద్మీవుందీ?" నవ్వుతూ అడిగాడు సేఠ్ దగాచంద్.

"కాదు! మరి ఆయనకి కోపం ఎందుకొచ్చిందో?" అంది నవ్వాపుకుంటూ సీత.

"పెండ్లీ హెప్పుడో సెప్పలేదు బెహన్."

"ఈ నెల 20న" చెప్పింది సీత.

"వారెవ్వా... ఇంకా రెండు వారాల్ వుంది. మరి చీరల్ ఎత్తవ్ బహన్?"

"ఈ!" అని అరుస్తూ జుట్టుపీకున్నాడు బుచ్చిబాబు.

"బహుత్ గుస్సావాలా ఆద్మీ!" అన్నాడు దగాచంద్ తెల్లబోయి బుచ్చిబాబు వంక చూస్తూ.

సీత నవ్వింది.

"ఆయనకి కోపం ఏం లేదు సేఠ్. మీ భాష ఆయనకి నచ్చలేదు. అంతే. నేను ఇప్పుడు పెళ్ళి చీరెలు కొనడానికే వచ్చాను."

ఆ మాట వినగానే సేఠ్ చాలా యాక్టివ్ అయిపోయాడు.

"హర్రే కిషన్! అమ్మగారికి మంచి మంచి సిల్కు చీరల్, జరీ చీరల్ చూపించు" అరిచాడు సేఠ్ దగాచంద్.

సేల్స్ కుర్రాళ్ళు సీతముందు వరసగా అన్నిరకాల చీరలూ కుప్పలుకింద వెయ్యడం మొదలుపెట్టారు.

ఆ జరీ చీరలు, పట్టుచీరల రెట్లు విన్న బుచ్చిబాబుకి ముచ్చెమటలు పోశాయి. ఎందుకంటే ప్రస్తుతం ఆ పెళ్ళిచీరల బిల్లు కట్టాల్సింది అతనే. సీతకి అన్నీ ఖరీదయిన చీరలే నచ్చుతున్నాయి. బుచ్చిబాబు ఆమె దృష్టి వాటిమీద నుండి మార్చాలని ప్రయత్నంచేస్తూ "ఈ చీర చూడు ఎంత బాగుందో... ఈచీర డిజైన్ చూడు... జరీ తక్కువున్నా ఎంత గ్రాండ్ గా వుందో...." అంటూ తక్కువ ఖరీదు వున్న చీరల్ని చూపించసాగాడు.

"అబ్బ.. నీకు తెలీదు బుచ్చీ చీరెల సెలక్షన్ గురించి. నాకు తెలిసినంతగా ఎవరికీ తెలీదని మా ఆఫీసులో అందరూ అంటారు" అంది సీత.

బుచ్చిబాబు హవ్వ... హవ్వ..... హవ్వ..." అని నోటిమీద కొట్టుకున్నాడు.

"ఏంటి? నేను కోతలు కోస్తున్నానని అనుకున్నావా?" అంది సీత సీరియస్ గా చూస్తూ. 

"అది కాదు...బుచ్చి ఏంటి? అందరి మధ్యా ఉన్నప్పుడు బుచ్చిబాబు ఆనో లేకపోతే ఒట్టి బాబు అనో పిలవోచ్చుగా?" సీత చెవిలో అన్నాడు బుచ్చిబాబు.

"బుచ్చి అంటేనే ఎంతో ముద్దుగా ఉంటుంది" అని నవ్వింది సీత.

మొత్తానికి షాప్ అంతా తల క్రిందులుచేసి నాలుగు చీరెలు సెలక్టు చేసింది.

వాటికి పన్నెండువేల రూపాయల బిల్లు అయింది. బుచ్చిబాబు చీరల్ని బేరం ఆడడానికి ప్రయత్నించాడు.

"ఏంఠీ సార్... హిట్లా చీరల్ ధరా తగ్గించి బేరం ఆడితే నేను దగాచంద్ కాదు దివాలాచంద్ అయిపోతాన్" అన్నాడు దగాచంద్. అతను చీరల ధరలు తగ్గించడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. ఎందుకోప్పుకుంటాడు సీతకి ఆ చీరలు బాగా నచ్చాయి అని తెలిసిన తరువాత.

ఏంతో కొంత తగ్గించాల్సిందేనని బుచ్చిబాబు చాలా పట్టుదలగా బేరం ఆడాడు.

చివరికి సేఠ్ దగాచంద్ చీర ఒక్కొక్కదానిమీద రెండు రూపాయలు చొప్పున నాలుగు చీరాలకి ఎనిమిది రూపాయలు తగ్గించాడు.

"మొత్తానికి మార్వాడీ అనిపించావ్ రా నాయనా" పళ్ళు నూర్తూ మనసులో అనుకుంటూ బిల్లు పే చేశాడు బుచ్చిబాబు.

"ఇంక పోదామా?" అన్నాడు బుచ్చిబాబు.

"ఎక్కడికీ... భలేవాడివే... ఇంకా షాపింగ్ కాందే?" నవ్వింది సీత.

"ఇంకా కాలేదా?" నా జేబులో డబ్బులు అయిపోయాయి" సనుగూతూ అన్నాడు.

"అబ్బా! ఇప్పుడు చీరల షాపింగ్ కాదులే... చీరాలకి ఫాల్స్, లంగాలూ, మ్యాచింగ్ బ్లావుజూలూ కొనాలి. నీ దగ్గర ఓ మూడొందలు కూడా లేవా? లేకపొతే ఫర్వాలేదులే... నా దగ్గరున్నాయి." అంది సీత.

"ఛీ ఛీ ఛీ... ఛా ఛా ఛా... మరీ సిల్లీగా మాట్లాడకు. ముదొండలు ఎందుకుండవు? నా దగ్గర వున్నయిలే... నీ డబ్బులేం తియ్యకు సిల్లీగా" అన్నాడు బుచ్చిబాబు మొహమాట పడిపోతూ.

"సరే పద!" అంది సీత.

బుచ్సిబాబుకి అప్పటికే బుర్ర హీటెక్కిపోయింది.