సిల్లీ ఫెలో - 23

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 23

- మల్లిక్

 

"వాడి పేరూ, అడ్రసూ, మిగతా వివరాలు ఇదిగో ఈ కాగితంలో రాసున్నాయి." అంటూ మినిస్టర్ మిన్నారావ్ వెంకట్రావ్ చేతికి ఓ కాగితం అందించబోయాడు. కానీ వెంకట్రావ్ ఆ కాగితాన్ని అందుకోలేదు.

"వీడి కంటికి మనం ప్రొఫెషనల్ కిల్లర్స్ లాగా కనిపిస్తున్నామా?" అని అనుకుని తమని తాము ఓసారి చూసుకుని తర్వాత ఇద్దరూ ఒకరి నొకరు పట్టుకుని ఘోల్లుమన్నారు.

"ఏందయ్యా ఇదీ... మీలాంటి కరుడుకట్టిన నేరగాళ్లకు ఇంతజాలి వుండకూడదు. కసుక్కున తెగ నరికెయ్యడమే. ఆ నాయాలు నా రాజకీయ ప్రత్యర్థి ... నన్నెంతగా ఎదిపిస్తున్నాడో తెలుసా?" అన్నాడు మిన్నారావు.

"అది కాదు సార్... మేము మీరనుకుంటున్న మనుషులం కాదు. మేం వేరే పనిమీద వచ్చాం సార్!" అన్నాడు వెంకట్రావు బిక్కమొహం వేసి.

ఆ దెబ్బకి మిన్నారావ్ కంగారుపడిపోయి క్రిందపడిన ఫోటోని తీస్కుని వివరాల కాగితంతోబాటు జేబులో పెట్టుకున్నాడు.

"ఆ విషయం ముందుగా చెప్పొద్దయ్యా... తేరితో! ఇంతకీ మీరెందుకొచ్చారు?" విసుక్కుంటూ అన్నాడు మినిస్టర్ మిన్నారావ్.

వెంకట్రావ్ చేతిలోని పళ్ళూ, స్వీట్లూ టీపాయ్ మీద పెట్టి జేబులోంచి వీరేశం ఇచిన లెటర్ తీసి మిన్నారావ్ కి ఇచ్చాడు. మినిస్టర్ మిన్నారావ్ ఆ నాలుగులైన్ల ఉత్తరాన్ని కూడబలుక్కుని పదినిమిషాలు చదివి "అయిహ్తే నువ్వేనా బుచ్చిబాబువి?" అని అడిగాడు వెంకట్రావుని.

"కాదండీ! ఇతను!!" అంటూ బుచ్చిబాబుని చూపించాడు వెంకట్రావు.

బుచ్చిబాబు వెంటనే దీనంగా మొహం పెట్టేడు. "సార్... ఆ హెడ్డాఫీసోళ్ళు ఇప్పుడే నన్ను అనవసరంగా, ట్రాన్స్ ఫర్ చేసారు సార్. నా ఆరోగ్యం అసలే బాగోదు సార్. దానికి తోడు విజయవాడ నీళ్ళు కూడా నాకు పడవు సార్.. మీరే నన్ను రక్షించాలి సార్!" అన్నాడు గద్గత స్వరంతో.

"సర్లేవయ్యా.. ట్రాన్స్ ఫర్ అయిన ప్రతి ఒక్కరు చెప్పేమాటలే నువ్వూ చెప్తూనావ్. ఆ ఫీలింగ్స్ మార్చు. ఏదో ఒకటిచేసి నీ ట్రాన్స్ ఫర్ కాన్సిల్ చేయిద్దాంలే అన్నాడు మిన్నారావు.

"థాంక్యూ సార్!" అన్నాడు బుచ్చిబాబు ఆనందంగా.

ఈలోగా టీపాయ్ మీదున్న ఫోన్ మోగింది. మినిస్టర్ మిన్నారావు ఫోన్ ఎత్తి "హలో..." అన్నాఉ.

ఓ అరనిముషంపాటు అవతలి వారు చెప్పింది ఓహో!... అట్టానా! అంటూ విన్నాడు.

అయితే మీ మటన్ షాప్ ఓపెనింగ్ చెయ్యాలంటావ్. సర్లేవయ్యా... అట్లాగే కానీయ్. ఎప్పుడు? ఎల్లుండి పొద్దున్నా... సరేసరి.... ఇందాక నాచేత ఛాంఛాం హేర్ కటింగ్ సెలూన్ ఓపెనింగ్ చేయించారయ్యా. నాతోనే ఎవడికో క్రాఫ్ చేయించి ప్రారంభించారు. బంగారు కత్తెరతో క్రాఫింగ్ చేశా...ఆకత్తెర నాకే ఇచ్చేశారు. చాలా గ్రాండ్ గా చేశారనుకో. మీరు కూడా ఆ లెవల్ లో ఓపెనింగ్ చెయ్యాలా ఏంటి... నాచేత కైమా కొట్టించి ఓపెనింగ్ చేయిస్తారా? అవ్వాల్ రైట్. అట్టాగే కానీ కైమా కొట్టడానికి బంగారు కత్తి తెప్పించండి. ఏంటీ.. ఆ స్థోమతే వుంటే మాంసం షాపు కాకుండా బంగారు షాపే పెట్టుకుండేవాడివా? పోనీ కనీసం వెండి కత్తయినా తెప్పించండయ్యా బాబూ... అలాగేనా?! సరే... సరే వచ్చేస్తున్నా...." అని ఫోన్ పెట్టేసాడు మినిస్టర్ మిన్నారావు.

"యదవ నా కొడుకులు... నాతో కైమా కొట్టిస్తారంటగానీ బంగారు కత్తి చెప్పించరంట. పీనాసి నాయాళ్ళు..." అని తిట్టి "మీరిక వెళ్ళిరండయ్యా... మీ సంగతి నేను చూస్కుంటాలే అన్నాడు.

ఇద్దరూ మరోసారి థాంక్స్ చెప్పి వెళ్ళబోతుంటే "వెళ్ళిపొమ్మనగానే వెళ్ళిపోవటమే... నేను చెప్పే మరో మాట వినివెళ్ళండి" అన్నాడు.

"ఏంటి సార్?" అడిగాడు బుచ్చిబాబు.

"నీ ట్రాన్స్ ఫర్ ఆపడానికి అయిదువేలూ ఇవ్వాలి! రేపు ఉదయమే పట్టుకొచ్చి ఇచ్చెయ్."

బుచ్చిబాబు తెల్లమొహం వేశాడు.