సిల్లీ ఫెలో - 19

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 19

- మల్లిక్

 

"అమ్మగారున్నారా?" వుసుగుని అణుచుకుంటూ ప్రశ్నించాడు వెంకట్రావ్.

"ఉన్నారు. అమ్మగారితో ఏం పని?"

"అబ్బా! మేం వీళ్ళకి చుట్టాలం లేవయ్యా బాబూ" వుసుకున్నాడు వెంకట్రావ్.

గూర్ఖా వెంటనే సెల్యూట్ చేసి "లోపలికి పోండ్రి సార్! అన్నాడు.

ఇద్దరూ లోపలికి అడుగులు వేసారు. మినిష్టర్ మిన్నారావ్ కి క్లోజ్ ఫ్రెండ్ అయిన వీరీశం వెంకట్రావ్ తండ్రికి బాగా తెలుసు. వెంకట్రావ్ బుచ్చిబాబు గురించి
తండ్రికి చెప్పి ఆయనతో వీరేశంకి చెప్పిచి వీరేశం నుంచి రికమెండేషన్ లెటర్ తీసుకుని వచ్చాడు వెంకట్రావు. ఆ లెటర్ మినిష్టర్ మిన్నారావుకి చూపించాలని వచ్చారు ఇద్దరూ.

వెంకట్రావు డోర్ బెల్ నొక్కాడు.

నాలుగు క్షణాల తర్వాత తలుపులు తెరుచుకున్నాయి ఓ మధ్య వయస్కురాలైన ఆవిడ ఇద్దర్నీ తేరపార చూసింది.

"ఏటీ?" అడిగిందామె.

"మీ అయ్యగారి కోసం వచ్చాం" చెప్పాడు బుచ్చిబాబు. ఆమె అయోమయంగా బుచ్చిబాబు వంక చూసింది.

వెంకట్రావ్ కంగారుపడిపోయాడు.

"ఓర్నీయబ్బ! ఆమెను పని మనిషినుకుంటున్నావా ఏంటి? ఆవిడే మినిష్టర్ మిన్నారావుగారి భార్య వెంకటలక్ష్మి" బుచ్చిబాబు చెవిలో కోపంగా చెప్పాడు.

"అదేనండీ. మేం మినిష్టర్ మిన్నారావు గారి గురించి వచ్చాం" అన్నాడు వెంకట్రావు.

"వెంకటలక్ష్మి గూర్ఖావంక చూస్తూ అరిచింది.

"ఒరేయ్ గూర్ఖా! ఆయన్లేరని వీళ్లకి చెప్పలేదా?"

"చెప్పినానమ్మా... మీతో మాట్లాడతారేమోనని పంపినా" అన్నాడు గూర్ఖావాడు అక్కడి నుండే.

"ఏటీ?" మళ్ళీ వెంకట్రావు చూస్తూ అడిగింది.

"వీరేశంగారు పంపిస్తే వచ్చాం" చెప్పాడు వెంకట్రావు.

"ఆయనలేరు గదా. కంటింగ్ షాపు ఓపినింగ్స్ సెయ్యడానికెళ్ళారు."

"అదేంట్రా బాబూ...మరీ బార్బర్ షాపు ఓపినింగ్ కూడా వెళతారా మినిస్టర్లు... వెరీ సిల్లీ..." గుసగుసలాడుతూ అన్నాడు బుచ్చిబాబు.

"నువ్వు కాసేపు నోరు మూస్కుంటావా?" బుచ్చిబాబు చేతిలో తిట్టాడు వెంకట్రావు.

"ఏటి... ఊర్కే ఆయన సెవులు తినేత్తన్నావ్?" అంది వెంకటలక్ష్మి.

"మావాడికి చెవులు వినిపించవులెండి. ఏం చెప్పినా వాడికి అలా చెవిలోనే చెప్పాలి!' అన్నాడు వెంకట్రావు పకపకా నవ్వుతూ.

"మంచి బాగోతమే..."

"మరి మినిష్టర్ గారు ఎప్పుడొస్తారండీ?"

"ఓ గంట తరువాత వత్తారు. స్వీట్లూ, పళ్ళూ మోసుకొచ్చుంటే ఇటిచ్చేసి ఆనకరండి"

"చచ్చాం... మనం తేలేదే ఎలా?" అన్నాడు బుచ్చిబాబు వెంకట్రావు చెవిలో.

"తర్వాత వచ్చేటప్పుడు తెద్దాంలే" అన్నాడు వెంకట్రావు బుచ్చిబాబు చెవిలో.

"అతగాడు నీ సెవిలో ఎందుకు మాట్లాడుతున్నాడు?" వెంకటలక్ష్మి ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది.

"హిహిహి.. అంటే వీడికి చెవులు వినబడవు కాబట్టి.... అందరికి వినబడవనుకుంటాడండీ వెర్రిసన్నాసి .... హి" అన్నాడు వెంకట్రావు.

"హత్తెరికి!" అంది ఆమె ఆశ్చర్యంగా మొహంపెట్టి. "సరేగానీ పళ్ళూ, స్వీట్లూ ఇటొచ్చి తర్వాత రండి" అంది.

"అవేం తెలీదు మేడం. తర్వాత తెద్దామని అనుకున్నాం. ... అన్నాడు వెంకట్రావు నీళ్ళు నములుతూ.

"అట్టానా?" అంటూ ఇద్దరి మొహాలమీద ధడేల్ మని తలుపేసేసింది వెంకటలక్ష్మి.

ఇద్దరూ కాళ్ళీడ్చుకుంటూ బయటకొచ్చారు.