సిల్లీ ఫెలో - 17

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,    Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 17

- మల్లిక్

 

బుచ్చిబాబు ఇంటికెళ్ళేసరికి ఇంటిలో తల్లితండ్రులతో సిద్ధాంతి మాట్లాడుతున్నాడు.

"ఫిబ్రవరిలో ఓ మంచి ముహూర్తం వుందిగానీ అప్పుడు శని గురుడుని చూసి కన్నుకొడుతున్నాడు. మార్చిలో అయితే గురుడూ, శుక్రుడూ ఒకర్నొకరు కౌగలించుకుని వున్నారు" చెపుతున్నాడు సిద్ధాంతి.

"ఏంటమ్మా... దేనికి సిద్ధాంతిగారితో మాట్లాడుతున్నారు? సత్య నారాయణ వ్రతం ఏదయినా చేయిస్తున్నారా?" అడిగాడు బుచ్చిబాబు లోపలికి వస్తూ.

"కాదురా.. నీ పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తున్నాం" అంది పార్వతమ్మ.

"అయితే మార్చిలో ఫిక్స్ చేద్దామంటారా సిద్ధాంతిగారూ?' అడిగాడు పర్వతాలరావు.

"అలాగే. ఆ ముహూర్తం మంచిదే" అన్నాడు సిద్ధాంతి.

"కానీ ఫిబ్రవరిలో ఏదో ముహూర్తం ఉందని అన్నారు?" అడిగాడు బుచ్చిబాబు.

"ఆ ముహూర్తంలో శని గురుడుని చూసి కన్నుకొడుతున్నాడని సిద్ధాంతి గారు చెప్పారు కదా" విసుక్కుంటూ అన్నాడు పర్వతాలరావు.

"అయితే ఏమవుతుంది?"

"ఆ ముహూర్తానికి పెళ్ళిచేస్తే శని గురుడిని వదిలేసి నీకు కన్ను కొడతాడు. దాంతో నీ సంసారం గోవిందా బాబూ" చెప్పాడు సిద్ధాంతి.

"ఏరా వెధవాయ్! మార్చిదాకా ఆగలేవా? పెళ్ళికి అంత కంగారుగా వుందా?" అన్నాడు పర్వతాలరావు.

"కుర్రాడు కందండీ... పెళ్ళంటే హుషారుగానే వుంటుంది. సంసారం ఈదేప్పుడు తెలుస్తుంది మజా...." నవ్వుతూ అన్నాడు సిద్ధాంతి.

"ఉండండి. దగ్గరలో ఇంకేదయినా మంచి ముహూర్తం వుందేమో చూస్తాడు అని ఓ అరనిమిషం పాటు పంచాంగం తిరగేసి "దివ్యమయిన ముహూర్తం!" అన్నాడు.

"ఎప్పుడు?" అడిగింది పార్వతమ్మ.

"ఇంకో మూడు వారాల్లోనే. జనవరి ఇరవై తేదీన శుక్రుడిని ఓరగా చూస్తున్నాడు. శుక్రుడు కూడా బుధుడికి శక్తి వంచనలేకుండా కన్ను కొడుతున్నాడు చాలా మంచి ముహూర్తం." 

"అయితే ఆ ముహూర్తం అయితే బాగుంటుందేమో?" సిగ్గుపడుతూ అన్నాడు బుచ్చిబాబు.

"కానీ ఇంత దగ్గరలో వుంటే మనకి పెళ్ళి అరేంజ్ మెంట్లకి టైం వుంటుందా?" సందేహిస్తూ అన్నాడు పర్వతాలరావు.

"అయినా అరేంజ్ మెంట్లు ఏముంటాయ్ నాన్నా? పెళ్ళికూతురు తరపునవాళ్ళెవరూ లేరు. కట్నం అసలేలేదు. పెళ్ళి సింపుల్ గా చేసేసుకుంటాను" అన్నాడు బుచ్చిబాబు.

"సరే.. అలాగే కానిద్దాం అన్నాడు పర్వతాలరావు.

"శుభం! అయితే జనవరి ఇరవై తేదికి ముహూర్తం కేకెయ్యాలనిపించింది. కానీ తండ్రెక్కడ ఆ వెధవ ఈ వెధవా అంటూ అడ్డమైన వెధవ తిట్లు తిట్టి కేకలేస్తాడేమోనని భయపడి ఊర్కున్నాడు.

తన సంతోషాన్ని సీతతో వెంటనే పాలుపంచుకోవాలనిపించింది బుచ్చిబాబుకి. వేడివేడి కాఫీ తాగి బయటకెళ్ళి పబ్లిక్ ఫోన్ నుండి సీత వుండే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కి ఫోన్ చేసి పెళ్ళి జనవరి ఇరవైన జరగబోతున్నట్లు చెప్పాడు. ఆ వార్త విని సీత కూడా ఎంతో సంతోషించింది. సీతకి శుభవార్త చెప్పేశాక తన చిన్ననాటి స్నేహితుడు కిరణ్ తో తన ఆనందాన్ని పంచుకోవాలనుకున్నాడు బుచ్చిబాబు. అక్కడికి రెండు ఫర్లాంగుల దూరంలోనే కిరణ్ ఇల్లు వుంది. బుచ్చిబాబు కిరానా ఇంటివైపు ఉత్సాహంగా అడుగులు వేసాడు.

కిరణ్ ఇంటిని సమీపించి డోర్ బెల్ నొక్కుదామని అనుకున్న బుచ్చిబాబు ఆగిపోయాడు.

కారణం....

లోపలినుండి పెద్దగా అరుస్తూ ఇద్దరూ పోట్లాడుకుంటున్నారు ఒక ఆడ - ఒక మగా!

మగ గొంతు కరణ్ ది. ఆడ గొంతు అతని భార్యది. ఇద్దరూ హోరాహోరీ దెబ్బలాడుకుంటున్నారు.

"నోర్మూయ్! ఇంకా ఎక్కువగా మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను" అంది కిరణ్ గొంతు.   

"రాలగొడ్తతావా? ఏదీ రాలగొట్టు చూద్దాం. నేను కూడా చెయ్యి చేస్కోగలను" ఇది ఆవిడగొంతు.

"ఓహో. మొగుడంటే నీకంతే గౌరవం వుందన్నమాట?"

"పెళ్ళాంకి మొగుడంటే గౌరవం వుండాలిగానీ మొగుడికి పెళ్ళాం అంటే గౌరవం ఉండక్కర్లేదు. మొగుడు పెళ్ళాంని నానా మాటలు అనొచ్చు.. అంతేనా నువ్వనేది!"....

"ఛీఛీ..... నీతో మాట్లాడితే పేడమీద రాయివేసినట్టే..."

"నోరు మూస్తావా లేదా దొంగలం...."

బుచ్చిబాబు డోర్ బెల్ మీద నుండి చెయ్యి తీసి వెనక్కి తిరిగి ఇంటిదారి పట్టాడు. అతని మెదడు మొద్దుబారిపోయింది.

కిరణ్ సంసార జీవితం ఇంత ఘోరంగా వుందా? ఎందుకని?

కిరణ్, ఆ అమ్మాయి ఇద్దరూ ఒకరినొకరు ఎంతగానో ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. మరి వాళ్ళ సంసారం ఏంటి ఇలా ఉంది? 

రేపు తనూ, సీత కూడా ఇంతేనా?

బుచ్చిబాబు భారంగా నిట్టూర్చాడు.