నేనూ - దొంగాడూ - 3

Listen Audio File :

Mallik Audio Telugu Short Stories: Latest Collection of  Telugu Short Stories Comedy Three in One by Teluguone

 

నేనూ - దొంగాడూ - 3

 

- మల్లిక్

 

చంచల్రావు రాంలు వైపు చూశాడు. భయంతో వాడు బిక్కచచ్చి పోయాడు.
"ఊహు ... వేడిని మనం తన్నేం అనుకో ... బండబారిపోతాడు. పోలీసులకి అప్పజెప్పితే వాళ్ళు తననే తన్నులకీ, జైలు జీవితంవల్ల మరీ బండబారిపోతాడు. వీదసలె కొత్తగా ఈ వృత్తి మొదలు పెట్టినట్టున్నాడు. వీడి మనసుకు శిక్ష విధించాలి. వీదిలో మానసికంగా మార్పు రావాలి. అప్పుడే వీడు మళ్ళీ దొంగతనం చెయ్యడు ... కానీ అందుకు మనమేం చెయ్యాలో ఆలోచించాలి ...''
చంచల్రావు ఆలోచిస్తూ బుర్ర గోక్కున్నాడు.
గుంపులోంచి మరో నలుగురు అతనిమీదపడి, అతని బుర్రని బరబరా గోకడం మొదలుపెట్టారు.
"ఏంటయ్యా ఇది?'' వాళ్ళని కసురుకున్నాడు చంచల్రావు.
"మీకు త్వరగా అయిడియా తట్టాలని ...'' అన్నారు వాళ్ళు ఏక కంఠంతో.
నేను కెవ్వున అరిచాను.
అందరూ కంగారుపడి నన్ను పట్టుకున్నారు.
"ఏమైంది, ఏమైంది?''
"నాకు బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది'
"ఏమిటది?'' చంచల్రావు ముందుకొచ్చి అడిగాడు.
"దగ్గరకు రా''
చంచల్రావు చెవిలో చెప్పాను.
చంచల్రావు విరుచుకు పడిపోయాడు.
"ఏమైంది, ఏమైంది?''
అందరూ చంచల్రావు చుట్టూ గుమిగూడారు.
"ఏం లేదు ... ఈ వేళ నాకు అయిడియాలు తడ్తున్నాయని ఆశ్చర్యంతో మూర్చపోతున్నాడు'' అన్నాను.
వాడి ముఖం మీద నీళ్ళు చల్లి లేపాము.
లేస్తూనే సంతోషంగా నన్ను కౌగిలించుకున్నాడు చంచల్రావు. "ఒరేయ్ బుచ్చిబాబూ! ఈవేళ నీకేమైందిరా?''
"అయితే నా ఆలోచన నీకు నచ్చిందా?''
"బ్రహ్మాండం ...'' అన్నాడు.
రాంలు బిక్కుబిక్కుమంటూ మా వైపు చూశాడు.
"ఏంటి, ఏంటది?'' అన్నారు జనం.
"మీరే చూస్తారుగా?'' అన్నాడు చంచల్రావు నవ్వుతూ.
"అలాగయితే వీళ్ళనెవరినైనా అడుగుదామా?'' అన్నాను.
"వద్దులే ... ఎవర్నో ఎందుకు? మా ఇంట్లోదే తీసుకువద్దాం'' అన్నాడు చంచల్రావు.
జనాన్ని వాడికి కాపలాపెట్టి ఆటోలో చంచల్రావు ఇంటికి వెళ్ళి మాక్కావలసింది ఓ అట్టపెట్టెలో సర్ది, అదే ఆటోలో నా గదికి వచ్చేశాం.
జనం ఆత్రంగా మావంక చూస్తున్నారు.
అట్టపెట్టె విప్పి వైర్లు బయటికి తీశాం.
దాన్ని చూస్తూనే జనం హాహాకారాలు చేశారు.
"భలే! భలే ... మంచి పనిచేశారు ... '' అన్నాడు అనుభవజ్ఞుడైన ఒక వృద్ధుడు.
రాంలు దానివంక, ఒకసారి జనం అందరివంక విచిత్రంగా చూశాడు. వాడికేమీ అర్థం కాలేదు.
"దీన్ని నువ్వెప్పుడైనా చూశావా?'' చంచల్రావు రాంలునీ అడిగాడు.
వాడు అమాయకంగా తల అడ్డంగా ఊపాడు.
"ఇప్పుడు రుచి చూద్దువుగాని ...''
"దెబ్బకి దొంగతనం మానేయాలి'' జనంలోంచి ఎవరో కోపంగా అన్నారు.
రాంలునీ కుర్చీకేసి కట్టేసి టకటకా వైర్లన్నీ అమర్చేశాం.
అప్పుడు సరిగ్గా రాత్రి ఏడు గంటలైంది.
"రెడీ ... వన్ ... టూ ... త్రీ ...'' అన్నాడు చంచల్రావు.
నేను స్విచ్ ఆన్ చేశాను.
క్షణాల మీద రాంలు ముఖంలో మార్పు వచ్చింది. అందరూ ఆతృతగా అతన్ని పరిశీలించసాగారు.