మొగుడికొచ్చిన ఉత్తరం

మొగుడికొచ్చిన ఉత్తరం

విద్యావతి

ఆ రోజు భార్యాభర్తలిద్దరూ కాస్త ప్రశాంతంగా కూచుని కబుర్లు చెప్పుకుంటున్నారు. తన

మనస్సులో ఎన్నాళ్ళనుండో మెదులుతున్న సందేహాన్ని బయట పెట్టడానికి అదే మంచి

సమయం అనుకుంది భార్య.

“ ఎంత భార్యభర్తలయినా ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకుంటుందనుకోండి.ఆ విషయం

తెలిసినా,ఏమిటో ఒక్కోసారి,మనసు ఊరుకోదు.అడిగేయాలనిపిస్తుంది " అని ఉపోద్ఘాతం

మొదలు పెట్టింది భార్య.

భర్త అది విని చిరునవ్వు నవ్వాడు.

“ ఈ డొంకతిరుగుడేందుకు ? మనసులో ఏమైనా ఉంటే కక్కెయ్యి " అనుమానంగా

అన్నాడు భర్త.

“ అఫ్ కోర్స్.ఇది మీ పర్సనల్ విషయం అనుకోండి. మీకు ఎక్కడెక్కడి నుండి ఉత్తరాలు

వస్తున్నాయో నేను పట్టి పట్టి చూడకూడదు. అయినా మొన్న శుక్రవారం నాడు వచ్చిన

ఉత్తరం ఎందుకో గాని నాకు బాగా గుర్తుండి పోయింది. ఆ కవరు మీద అడ్రస్సు చూస్తే ఓ

అమ్మాయి రాసినట్టుంది.కవరుకి సెంటు పులిమారు.ఆ కవరు ఓపెన్ చేసినప్పుడు మీ

మొహం ఎలా ఉంటుందాని నేను జాగ్రత్తగా గమనించాను. ఆ ఉత్తరం చూస్తూనే మీరు

పాలిపోయారు. మీ నుదుట మీద చెమట పట్టింది.చేతులు వణికాయి...నిజంగా చెప్పండి.

అది ఎక్కణ్ణుంచి వచ్చింది ? దాంట్లో ఏముంది ? ” భర్త పెదాలు తడుముకున్నాడు.

“ అదా !అది చూడగానే నేను కంగారు పడ్డమాట వాస్తవమే.అప్పటికప్పుడు నీతో

మాట్లాడితే గొడవవుతుందేమో అని కాస్త నిధానంగా నీతో డిస్కస్ చేద్దాం అని అగాను.

దాని గురించి ప్రస్తావన వస్తే పోట్లాడడం తప్పదని తెలిసి వాయిదా వేసుకుంటూ

వస్తున్నా...” అని భర్త ఏదో చెప్పబోతుండగానే, భార్య శాంత స్వరూపం విడిచిపెట్టి

విరుచుకుపడింది.

“ ఎవత్తదీ ? ఎన్నాళ్ళుగా సాగుతోంది వ్యవహారం ? ” అని.

“ అదే నేను అడుగుదామనుకుంటున్నాను. నువ్వా మంగారామ్స్ షాపులో

ఎన్నాళ్ళనుండి చీరలు కొంటున్నావేమిటి ? పన్నెండు వేల రూపాయలు బాకీ

పడ్డావని,వెంటనే చెల్లించమని రాశారా ఉత్తరంలో " అని.