హలో... రాంగ్ నెంబర్.! - 3

Read and enjoy latest telugu comedy serial Hello Wrong Number Telugu Serial

 

హలో... రాంగ్ నెంబర్.! - 3

 

ముచ్చర్ల రజనీ శకుంత

 

ఎందుకో ఆ సాయంత్రం  ఆమె చాలా అందంగా కనిపించింది. సాధారణంగా చాలా పొడవుగా వున్న వాళ్ళు మిడ్డీ వేసుకుంటే బావున్నట్టు అనిపించదు. కానీ లూసీ చాలా అందంగా కనిపించింది.
"లూసీ...యూ ఆర్ టూ స్మార్ట్." అన్నాడు ఆమె పక్కనే వెహికల్ లో కూచుంటూ.
"థాంక్యూ సర్.." అంది లూసీ. ఆమె ఒంటి నుంచి పరిమళం వస్తోంది. అసలు ఆమె పక్కన కూచుంటేనే అతనికి టెంప్టింగ్ గా వుంటుంది. అందులో ఈ పెర్ ఫ్యూమ్ స్మైల్.
"చాలా మంచి పెర్ ఫ్యూమ్..." అన్నాడు ఆమె మెత్తటి భుజానికి భుజం తగిలిస్తూ.
నవ్వి వూర్కుంది లూసీ."
"ఎక్సియా మాత్రం కాదు" చెప్పింది నవ్వుతూ లూసీ.
*           *                *
నాలుగింటికి బుక్ చేసిన కారు రెడీగా వుంది.
డ్రైవర్ వచ్చి పిలవడంతో ఇద్దరూ బయల్దేరారు.
విశాలమైన రోడ్డు మీద వేన్ లో వెళ్తోంటే అతనికి గాలిలో తేలుతున్నట్టు వుంది. రోడ్డుకి ఇరుపక్కలా షాపింగ్ మాల్స్. ఎత్తయిన బిల్డింగులూ....దుబాయ్ నగర అందం చెప్పవససినది కాదు. ఏరియాన్ని బట్టి స్పీడ్ లిమిట్ మారుస్తూ వెళ్తున్నాడు డ్రైవర్. దుబాయ్ సిటీ మొత్తం వన్ వే కావడం విశేషం. ఒకే సారి నాలుగైదు వెహికల్స్ పక్కపక్కనే వెళ్తున్నాయి. రోడ్డుపైన చేత్త అనే పదార్ధం కనిపించలేదు.
"లూసీ....ఇక్కడ రోడ్లు ఎంత నీట్ గా వున్నాయి పైగా ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అసలే లేదు కదూ..." అన్నాడు శ్రీకర్.
"ఇక్కడి ప్రజల్లో ట్రాఫిక్ సెన్స్ ఎక్కువ. ఇక్కడ లంచాలు వుండవు. అసలు ఎవరూ ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించరు. ఆ అవకాశమే వుండదు. ఓవర్ టేక్ చేయడం...ట్రాఫిక్ సిగ్నల్ ని దాటుకుంటూ వెళ్ళడం అనేవి వుండవు."
"ఎంత చిన్న దేశం...ఎంత అభివృద్ధి." మనసులో అనుకున్నాడు శ్రీకర్.
"సార్ ! బెల్ట్ వేసుకోండి" అంది లూసీ. ఇండికేటర్ నుండి వచ్చిన రెడ్ కలర్ సిగ్నల్ చూసి.
"మరి నువ్వు..." అన్నాడు.
"నేనూ వేసుకోవాల్సిందే" అంటూ హెల్ప్ చేసింది శ్రీకర్ కి.
*               *          *
సరిగ్గా యాభై నిమిషాల్లో అక్కడికి వచ్చారు.
అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఒక్క క్షణం సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు శ్రీకర్.
అసలే సాయంత్ర సమయం. చీకటి ఆక్రమించుకుంటోన్న వేళ. రోడ్డు మార్గం చివరికి వచ్చారు సరిగ్గా అక్కడ్నుంచి ఎ..డా...రి..
కనుచూపు మేరంతా ఎడారి.
సినిమాల్లో మాత్రమే చూసిన ఎడారి.
ఎత్తు పల్లాలతో అమ్మాయి ఒంపుసొంపుల్లా ...కనిపిస్తోంది.
"ఇక్కడ్నుంచి ఎడారి ప్రారంభమవుతుంది. ఇక్కడ వెహికల్ లోని గాలిని తీసేస్తారు."
"ఎందుకు?"
"ఎడారిలో వెహికల్ నడవాలంటే టైరులో గాలి వుండకూడదు. బాగా తగ్గిస్తారు."
డ్రైవర్ గాలి తీస్తోంటే ఇద్దరూ కిందికి దిగారు. అప్పటికే మరికొన్ని వెహికల్స్ అక్కడికి వచ్చి వున్నాయి. టూరిస్టులందరూ సంభ్రమంగా చూస్తున్నారు.
ఎందుకో ఆ వాతావరణం....
ఆ ప్రదేశం....
లూసీతో కలిసి జర్నీ.....గమ్మత్తుగా అనిపించాయి.
"లూసీ! కోక్ తాగుదామా!" అన్నాడు ఎదురుగా వున్న షాపును చూస్తూ.
"వద్దు సార్ ! ఈ ఎత్తుపల్లాలకి వామ్టింగ్ అవుతుంది. తాగకపోవడమే మంచిది" అంది లూసీ.
తన గురించి కేర్ తీసుకునే లూసీ అంటే అతనికి తెలియకుండానే ఆప్యాయత పెరిగింది.
ఒక్క క్షణం అతనికి ప్రియంవద గుర్తొచ్చింది.
*                  *                *
ఎడారి గుండా వెళ్తోంది వెహికల్.
చేయి తిరిగిన ఆర్టు డైరెక్టర్ అహోరాత్రులు కష్టపడి తీర్చిదిద్ది వేసిన సెట్ లా వుంది.
ఇంచుమించు గాల్లో తేలుతున్నట్లుంది. లూసీ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు.
ఇదంతా అలవాటే లూసీకి. దుబాయ్ వచ్చిన చాలా మంది అందుకే ఎక్కువ డబ్బు ఖర్చయినా సరే ఆ థ్రిల్ కోసం, ఆనందం  కోసం తప్పక డిసర్ట్ సఫారీ కి వస్తారు.
కారు పల్టీలు కొడ్తూ వెళ్తున్నట్టు వుంది.
"ఈ డ్రైవర్ల కి భయం వెయ్యదా?" అడిగాడు శ్రీకర్.
"వాళ్ళకి మూడు నెలలు ట్రైనింగ్ వుంటుంది సార్. వాళ్ళంతా ఎడారిలో డ్రైవ్ చేయడంలో ఎక్స్పర్ట్స్ ..."
"నన్నిలాగే పడెయ్యడు కదా...."
కొద్దిదూరం వెళ్ళాక ఒంటెలు కనపడ్డాయి.
"లూసీ...మనం కొద్ది దూరం ఒంటె మీద వెళ్దామా?" అడిగాడు శ్రీకర్.
"వైనాట్....ష్యూర్...." అంది.
వెంటనే డ్రైవర్ కు అరబ్బీ భాషలో ఏదో చెప్పింది.
అతను వెహికల్ ణి స్లో చేస్తున్నాడు.
"అతన్తో ఏం చెప్పావు?" అడిగాడు శ్రీకర్.
"వెహికల్ ని స్లో చేసి, నెక్స్ట్ పాయింట్ దగ్గర ఆపమన్నాను."
"ఎందుకు?"
"అక్కడ ఒంటెలు అద్దెకిస్తారు అక్కడ్నుంచి మనం నెక్స్ట్ పాయింట్ వరకూ ఒంటెమీద వెళ్ళొచ్చు. ఈలోగా నెక్స్ట్ పాయింట్ కు డ్రైవర్ చేరుకుంటాడు."
"థాంక్యూ....చెప్పగానే ఏ పనైనా చేసే అమ్మాయిలంటే నాకిష్టం."
లూసీ నవ్వింది ఎప్పటిలానే అందంగా.

(ఇంకావుంది.)