హలో... రాంగ్ నెంబర్.! - 1

హలో... రాంగ్ నెంబర్.! - 1

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

Read and enjoy latest telugu comedy serial Hello Wrong Number Telugu Serial

 

ఆరోజు అన్ని ప్రముఖ దినపత్రికలలో పావుపేజీ ప్రకటన వచ్చింది.
హేపీ జర్నీ
ఆరేళ్ళక్రితం ఏట్ యువర్ సర్వీస్ పేరుతో సికింద్రాబాద్ లో ఓ చిన్న ఆఫీసు ప్రారంభించి, జంట నగరాలకు వచ్చిన వారికి ఎన్నో సర్వీసులు అందజేసి అచిరకాలంలోనే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, బెంగుళూరు, చెన్నయ్, ముంబయ్ లో బ్రాంచీలు ఏర్పాటు చేసి, ఇప్పుడు దుబాయ్ లో కొత్తగా బ్రాంచీని ప్రారంభించడానికి ఈరోజే దుబాయ్ వెళ్తోన్న మా చైర్మన్ శ్రీకర్ గారికి శుభప్రయాణం, హేపీజర్నీ.
                                                                                ఇట్లు
                                                                       మిత్రలు, సిబ్బంది
                                                               (ఎట్ యువర్ సర్వీస్)
                                              *              *             *        
సికింద్రాబాద్.
మారేడుపల్లి.
రోడ్ నెంబర్ సెవెన్ లో వున్న నాలుగో బిల్డింగ్ లో వుంది ఎట్ యువర్ సర్వీస్ ఆఫీసు.
స్టాఫ్ అంతా గుమిగూడారు. బాస్ ఆఫీసులో లేకపోవడంతో వాళ్ళకు ఎక్కడ లేని స్వేచ్చా వచ్చింది.
మిగతా ఆఫీసుల్లాకాక, రాత్రి ఎనిమిది వరకూ ఉంటుంది. ఆ తర్వాత ఓ రిసెప్షనిస్టు నైట్ డ్యూటీలోకి వచేస్తుంది. ఎమర్జన్సీ టీమ్ ఉంటుంది. అర్థరాత్రి అయినా సరే ఎట్ యువర్ సర్వీస్ కు ఫోన్ చేసి, మాకు మీ హెల్ప్ కావాలి' అంటే ఎమర్జన్సీ టీమ్ వెంటనే రంగంలోకి దిగుతుంది.
హైదరాబాద్ లో దిగిన వ్యక్తికి ఎలాంటి సర్వీస్ కావాలన్నా అందజేయడమే ఎట్ యువర్ సర్వీస్ ధ్వేయం. అడ్రస్ తెలియకపోయినా, ప్రభుత్వ ఆఫీసుల్లో పనిపడినా, జంట నగరాల్లోని విహారస్థలాలను సందర్శించాలన్నా, ఒక రోజంతా, 'కారు'లో సిటీ అందాలు చూడాలన్నా, ఎ టు జె డ్ సర్వీసులు అందజేస్తుంది.
రీజనబుల్ ఛార్జెస్ తో ఎన్నో సర్వీసులు అందజేస్తుంది. అందుకే ఆరేళ్ళలో మంచి పేరును సంపాదించుకుంది. ఓ చిన్న క్యాబిన్ లో ప్రారంభమైన ఆఫీసు పెద్ద బిల్డింగ్ సిఫ్టయింది. బోల్డు బ్రాంచీలు ఏర్పడ్డాయి. దీనిక్కారణం ఆ సంస్థ చైర్మన్ శ్రీకర్ బ్రెయిన్ పవర్. వృత్తి పట్ల అతనికుండే సిన్సియారిటీ...డెడికేషన్.
ఇదంతా అతనిలో ఒక కోణం. మరో సైడ్ యాంగిల్ శ్రీకర్ వేరు. అదే ఇప్పుడు ఆఫీసులో చర్చనీయాంశం.
                                          *                       *                        *
"బాసు ఈపాటికి ఏర్ పోర్ట్ కు వెళ్ళి వుంటాడు కదా.." అసిస్టెంట్ మేనేజర్ అన్నాడు.
"శ్రీకృష్ణపరమాత్ముడు కదా....ఏర్ పోర్ట్ లో అందమైన అమ్మాయిలను అన్వేషిస్తూ వుంటాడు."
"బోర్డింగ్ పాస్ యిచ్చేది మేలా? ఫిమేలా?" ఓ చిన్న డౌట్ తో అడిగాడు సెక్షన్ ఇన్ ఛార్జి.
"ఫ్లయిట్ లో అమ్మాయిలతో పరిచయాలు పెంచుకోవడంలో బాస్ నెంబర్ వన్...బాస్ పక్కనే కూచునేది ఎవరో..." మరొకరి కామెంట్.
"బాస్ తో నేనైనా వెళ్ళాను కాదు..." గొణుక్కుంది రిసేప్సనిస్టు.
"మైకేల్ మదన కామరాజు అని కమలహాసన్ నాలుగు పాత్రలు వేసాడు. బాస్ అయితే ఏకంగా పది పాత్రలు పోషిస్తాడు" మేనేజర్ ఉవాచ.
"చూస్తూ వుండండి...వచ్చేప్పుడు ఎయిర్ హోస్టెస్ ని మన ఆఫీసుకు తీసుకు వస్తాడు."
"నైట్ జర్నీ అంటే బాస్ కి ఇష్టం. కదా! అందుకే ఇమిరేట్స్ లో కాకుండా ఇండియన్ ఎయిర్ లైన్స్ లో టికెట్ బుక్ చేయించమన్నాడు..." కమలాకర్ చెప్పాడు. అలా ఓ అరగంటపాటు తమ బాసు లీలల గురించి చరించుకుంటూ వుండిపోయారు. సరిగ్గా అదే సమయంలో ఇండియన్ ఏర్ లైన్స్ వారి విమానంలో, దుబాయ్ కి వెళ్ళే ఫ్లయిట్ లో బిజినెస్ క్లాస్ లో విండో పక్క సీటులో కూచున్నాడు శ్రీకర్.
                                                *                 *               *
ఫ్లయిట్ టేకాఫ్ కు సిద్ధంగా వుందన్న అనౌన్స్ మెంట్ వచ్చింది. దానికితోడు అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణీకులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అనౌన్స్ మెంట్.
ఫ్లయిట్ టేకాఫ్ అవుతోంది. అతనికెప్పుడూ సేఫ్టీ బెల్ట్ బిగించుకునే అలవాటులేదు, ఎయిర్ హోస్టెస్ చిరనవ్వుతో పక్కనే నిలబడి చెప్పినప్పుడు తప్ప. హైదరాబాద్ నుంచి మూడున్నర గంటల్లో దుబాయ్ కి తీసుకువెళ్ళే ఫ్లయిట్...కాంట్ డౌన్ మొదలుపెట్టి ఆకాశంలో రాచఠీవితో దూసుకువెళ్తోంది.
బిసినెస్ క్లాస్ లో కూచున్న శ్రీకర్ దగ్గరకి ఎయిర్ హోస్టెస్ ట్రేతో వచ్చింది. టిష్యూ పేపర్స్ అందించింది.
శ్రీకర్ చిర్నవ్వుతో అందుకున్నాడు.
ఆ తర్వాత చాక్ లెట్స్ వున్న ట్రేతో వచ్చింది. ఆ తర్వాత డిన్నర్ ప్యాక్ లున్న ట్రాలీతో వచ్చి వెజ్జా? నాన్ వెజ్జా? అని అడిగి ఎవరికేది కావాలో అది ఇస్తోంది.
కావాలన్న వాళ్ళకి లిక్కర్ సర్వ్ చేస్తోంది. శ్రీకర్ కి ముందు రోలో కూర్చున్న లేడీ అడిగి మరీ ఇంకో బీరు టిన్ తీసుకుంది.
శ్రీకర్ మరో పెగ్ విస్కీ తీసుకున్నాడు. గ్లాసులోకి వంపుతున్న ఎయిర్ హోస్టెస్ వైపు చూసాడు. చాలా స్మార్ట్ గా వుంది. ఒకసారి తన పెదవులు తడుపుకున్నాడు శ్రీకర్. అతని వాలకం చూసి "ఎనీ ప్రాబ్లెం సార్...మే ఐ హెల్ప్ యు..." అని అడిగింది ఆమె.
నువ్వే నా ప్రాబ్లెం...నా పక్కన నువ్వు కూచోవడమే పెద్ద హెల్ప్' అనాలనుకున్నాడు శ్రీకర్ అయినా అన్లేదు. ఇలాంటి విషయాల్లో అతను చాలా కేర్ ఫుల్ గా వుంటాడు. నెలలో కనీసం రెండు సార్లయినా ఫ్లయిట్ లో వెళ్ళే శ్రీకర్ కి అలాంటి బిహేవియర్ తాలూకు పరిణామాలు ఎలా వుంటాయో తెలుసు.
మెక్ రూబ్ అనే అతను కాక్ పిత డోర్ ణి తన్నివెయ్యి డాలర్లు ఫైన్ గా కట్టాడు. ఎయిర్ హోస్టెస్ తో కాస్త చనువుగా వెళ్ళి, నడుం చుట్టూ చేయివేసి మిగతా స్టాఫ్ తో తన్నులు తిన్న శాల్తీల గురించి కూడా తెలుసు. గాలిలో వుండగా అతను సాహసం చేయడు.
                                                 *                    *                     *
కళ్ళు మూసుకున్నాడు శ్రీకర్. రాత్రివేళ కావడం వల్ల ఏమీ కనిపించదు. టేకాఫ్ అప్పుడు, లాండింగ్ అప్పుడు తప్పల్ అతనికి చిత్రంగా అనిపిస్తూ వుంటుంది.
కింద మినుకు మినికుమంటున్న లైట్లు, పైన ఆకాశంలో మెరిసే నక్షత్రాలు. మధ్యలో విమానంలో తాను. శూన్యంలో విమానం వెళ్ళడం అతనికి మందులో థ్రిల్లింగ్ గా అనిపించేది.
తన పక్కన వున్న శాల్తీ వంక చూసాడు. యాభయ్యేళ్ళుంటాయతనికి. గుర్రుపెడుతున్నాడు. వేస్ట్ ఫెలో అనుకున్నాడు అతన్ని చూసి !
శ్రీకర్ ఉదయం నుంచి ఎందరో దేవుళ్ళకు మొకుకున్నాడు. తన పక్కనే అందమైన అమ్మాయి వుండేలా చూడమని - దేవుడికి కరుణ లేదు. తనలాంటి మగభక్తుల పట్ల వివక్ష చూపిస్తున్నాడు అనుకున్నాడు మనసులో.
ఓసారి కళ్ళు తెరిచి ఫ్లయిట్ లో వున్న ప్రయాణీకుల వంక చూసాడు. అంతా యావరేజ్ గా కనిపించారు.
మరోసారి అయిదున్నర అడుగులకు పై మాట గానే వున్న ఏర్ హోస్టెస్ వంక చూసి కళ్ళు మూసుకున్నాడు. ఆవిడ కళ్ళ ముందు కనిపించినట్టయింది.
                                              *                        *                     *
దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.
టెర్మినల్ 1.
శ్రీకర్ తన వాచ్ లో పదకొండుని తొమ్మిదిన్నరగా మార్చాడు దుబాయ్ టైమ్ ప్రకారం.
ఫ్లయిట్ దిగుతూ ఏర్ హోస్టెస్ దగ్గరకి వచ్చాడు.
"సర్...మీరేదో చెప్పాలని అనుకుంటున్నారు. ఎనీ ప్రాబ్లెం...మే ఐ హెల్ప్ యు." ప్రొఫెషనల్ స్మయిల్ తో అడిగింది ఏర్ హోస్టెస్.
"మీ డ్యూటీ అయిపోయిందా?" అడిగాడు శ్రీకర్.
"యస్సర్" అంది.
ఒక్కక్షణం ఆగిచుట్టూ చూసి అన్నాడు.
"డెడ్ బాడీని సహితం బెడ్ మీదికి రప్పించే స్టన్నింగ్ స్ట్రక్చర్ మీది"
"సారీ సర్...అయామ్ హెల్ప్ లెస్..ఇదే మాట రెండు గంటల ముందు చెప్పివుంటే బావుండేది. మీ వెనక కూచున్న జంటిల్మెన్ రెండు గంటలు క్రితం ఇదే మీనింగ్ వచ్చేలా మరో మాట చెప్పాడు." చెప్పింది సేమ్ స్మయిల్ తో.
                                                  *                        *                   *
లగేజ్ కలెక్ట్ చేసుకుని టెర్మినల్ బయటకు రాగానే అతని కళ్ళు తనను రిసీవ్ చేసుకునే వ్యక్తి కోసం వెతికాయి.
దూరంగా 'వెల్ కమ్ టు శ్రీకర్' అని రాసి వున్న బోర్డు పట్టుకుని వైట్ కలర్ టీషర్ట్ జీన్స్ ప్యాంట్ లో ఓ అందమైన అమ్మాయి కనిపించింది.
వెంటనే ఆమె దగ్గరకి వెళ్లి చెప్పాడు.
"అయామ్ శ్రీకర్.
"అయామ్ లూసీ సర్. ఈ దుబాయ్ లో మీకు అసిస్టెంట్ గా వుండమని నన్ను నియమించారు విన్సెంట్. మీ దుబాయ్ ట్రిప్ హేపీగా గడుస్తుంది. వెల్ కమ్ టు దుబాయ్ సర్" అంది స్వచ్ఛమైన తెలుగులో.
"మీకు తెలుగు వచ్చా...?"
"అయిదేళ్ళు ఇండియాలో వున్నాను. ఆంధ్రప్రదేశ్ లో మూడేళ్ళు వున్నాను. తెలుగు, హిందీ కూడా వచ్చు" అంది లూసీ.
"వెరీగుడ్..." అంటూ ఆమె వైపు పరిశీలనగా చూసాడు.
తనకన్నా హైట్....బాబ్డ్ హేర్...జీన్స్...ఒక్కసారి చూసాక ఆ అమ్మాయి నుంచి దృష్టి మరల్చుకోవడం అసాధ్యం. పైగా ఆమె ఒంటి నుంచి మంచి పరిమళం.
"మీరు ఏ పెర్ ఫ్యూమ్ వాడతారు?" అడిగాడు కారులో కూచున్నాక శ్రీకర్.
ఒక్క క్షణం తటపటాయించి చెప్పింది
"ఎక్సియా"
"వెళ్లేలోగా రెండు డజన్లు కొనాలి....గుర్తు చేయండి" అన్నాడు శ్రీకర్.
"యూ మీన ట్వంటీ ఫోర్ ...ఎందుకు సార్...అవి చాలా కాస్ట్ లీ...గిఫ్ట్ కోసమైతే తక్కువ ధరలో దొరుకుతాయి."
"చాలా కాస్ట్ లీ వాళ్ళకే ఇవ్వడానికి" అని ఆగి చెప్పాడు "అమ్మాయిల కోసం"
లూసీ నవ్వింది..అందంగా....టెంప్టింగ్ గా.
"సరిగ్గా సరిపోయింది సార్..." అంది.
"ఏమిటి?"
"ఎక్సియా పెర్ ఫ్యూమ్"
"అంటే..."
"ఎక్సియా....అంటే 'నన్ను ప్రేమించు' అని అర్థం. మీరు అమ్మాయిలకు ఇవ్వడంతో పెర్ ఫ్యూమ్ మీనింగ్ సరిగ్గా సరిపోయింది. అన్నాను." అంది అతని గురించి అంతకు ముందే తెలిసి వుండడం వల్ల.
"లూసీ...మీకో విషయం చెప్పనా?" అన్నాడు డ్రైవర్ వంక చూసి.
"చెప్పండి. అతనికి తెలుగురాదు. అర్థం కాదు కూడా. మీకు ఇలాంటి ఇబ్బంది వుండకూడదనే అతడ్ని డ్రైవర్ గా పెట్టాను."
ఆమె ముందు చూపికి అభినందన పూర్వకంగా చూసాడు. అతని పక్కనే కూచోవడం వల్ల, అప్పుడప్పుడు కారు కుదుపులకు (అ) ప్రయత్నంగా ఆమె శరీరం తగులుతోంది.
"చెప్పండి సార్...ఏదో విషయం చెబుతానన్నారు?"
ఆమె గులాబీల్లాంటి పెదవుల వంక చూస్తూ చెప్పాడు.
"డెడ్ బాడీని సహితం బెడ్ మీదికి రప్పించే స్టన్నింగ్ స్ట్రక్చర్ మీది"
ఆమె ఒక్క క్షణం మౌనంగా వుండి అంది, పెదవుల మీద చెక్కు చెదరని చిర్నవ్వుతో.
"జేమ్స్ కూడా రాత్రిళ్ళు ఇలానే అంటూంటాడు."
(వాట్ నెక్స్ ట్?)

(ఇంకావుంది. )