TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
హలో... రాంగ్ నెంబర్.! - 6
ముచ్చర్ల రజనీ శకుంతల
లూసీ శ్రీకర్ వైపే చూస్తూండిపోయింది.
"ప్లీజ్ లూసీ..." ఆమెకు దగ్గరగా జరుగబోయెడు...లూసీ అప్రయత్నంగా కళ్ళు మూసుకుంది.
"ముద్దు తాలూకూ అనుభవాన్నిఅనుభూతించడానికే అమ్మాయిలూ కళ్ళు మూసుకుంటారట...ఎక్కడో చదివాను..." అన్నాడు ఆమె మీదికి వంగుతూ శ్రీకర్.
ఒక్క క్షణం ఎవరో ఛర్నాకోలాతో కొట్టినట్టు ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. శ్రీకర్ పెదవులు ఆమె పెదవులను సమీపిస్తున్నాయి. ఓరకంటితో చూసింది.
ఒక్కక్షణం ఉలికిపాటు...చిన్న గగుర్నాటు...వెన్నులో నుంచి వణుకు మొదలైన ఫీలింగ్. దూరంగా ఓ వ్యక్తి...తననే గమనిస్తూ...ఫెల్ట్ హాట్...కోటు...అతను వి...న్సెం..ట్..రై...ట్...హ్యాండ్. ఒక్కసారిగా శ్రీకర్ ని వెనక్కి తోసింది. శ్రీకర్ ఇసుకలో వెనక్కి పడిపోయాడు. అహం దెబ్బతిన్న ఫీలింగ్ అతనిలో ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేకపోయాడు. లూసీ వెంటనే లేచింది. శ్రీకర్ ఓసారి చుట్టూ చూసాడు. ఎవరూ తనను గమనించడం లేదు. చిన్న రిలీఫ్.
* * *
వచ్చేప్పుడు దారిలో శ్రీకర్ ఏమీ మాట్లాడలేదు. లూసీ కూడా కామ్ గానే వుండిపోయింది. అప్పుడప్పుడు శ్రీకర్ లూసీ వంకే చూస్తున్నాడు. హోటల్ కు చేరుకునే సరికి బాగా అలసిపోయారు.
"గుడ్ నైట్ సర్" చెప్పింది లూసీ.
"గుడ్ నైట్...." ముక్తసరిగా అన్నాడు శ్రీకర్.
* * *
మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ బిజీగా వుండిపోయాడు. ఎట్ యువర్ సర్వీసు ఆఫీసు ఓ చిన్న ప్లాట్ లో ప్రారంభమైంది. దాని బాధ్యత మొత్తం విన్సెంట్ కు అప్పగించాడు. అనుకున్న దానికన్నా, ఎక్కువ రెస్పాన్సే వచ్చేలా అనిపించింది. షాపింగ్ చేసి నైట్ ఫ్లయిట్ కు ఇండియా వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు శ్రీకర్. ఇంత పని ఒత్తిడిలోనూ అతను లూసీ గురించి ఆలోచించడం మానలేదు. చిత్రంగా అతనికి లూసీ మీద కోపం రావడం లేదు. ఉదయం నుంచీ ఓపెనింగ్ హడావిడిలో లూసీ బొంగరంలా తిరుగుతుంటే అతనికి ముచ్చటేసింది. ముఖ్యంగా ఆమెలో కనిపించే డెడికేషన్ అతనికి బాగా నచ్చింది. వృత్తిపరమైన డెడికేషన్ అతనికి ఇష్టమైన విషయం.
"లూసీ...నేను మరో రెండు మూడు గంటలు మించి దుబాయ్ లో వుండను. షాపింగ్ చేయడానికి హెల్ప్ చేయాలి. ఒక విధంగా ఎట్ యువర్ సర్వీస్ ఫస్ట్ కష్టమర్ ని నేనే అనుకో" నవ్వుతూ చెప్పాడు శ్రీకర్ ఎడారిలో జరిగిన సంఘటన మన స్పూర్తిగా మరిచిపోయి.
"అయినా మొన్న అన్నీ కొన్నారు కదా సార్! ఈరోజు వైల్ట్ హడీ చూడరాదూ..."
"మరోసారి వచ్చినప్పుడు చూస్తాలే. ఇప్పుడు టైం లేదు. మళ్ళీ ఓ రౌండ్ వేస్తే...కొత్త కొత్త ఐటమ్స్ దొరుకుతాయి కదా...కరెన్సీ కూడా చాలా ఉండిపోయింది.
"మీ ఇష్టం సార్...అయితే మీరు ఆఫెనవర్ లో ఫ్రెషప్ అవ్వండి. నేను మీ కోసం రిసెప్షన్ లో వెయిట్ చేస్తూంటాను..." చెప్పింది లూసీ.
* * *
శ్రీకర్ లగేజ్ మొత్తం సర్దేసాడు.
బాత్రూంలో దూరి ఫ్రెషప్ అయి కిందికి వచ్చే సరికి కారు దగ్గర లూసీ రెడీగా వుంది. బ్లూ జీన్స్, బ్లాక్ తీ షర్ట్. ఫ్రీగా వదిలేసినా హెయిర్...ఓ క్షణం కన్నార్పకుండా చూసాడు. లూసీ తల దించుకుంది ఇబ్బందిగా.
నాజర్ స్క్వేర్ లోని గిఫ్ట్ లాండ్ షాప్ కి తీసుకువెళ్ళింది. ఆ తర్వాత సిటీ సెంటర్ షాపింగ్ మాల్ కు తీసుకువెళ్ళింది.
నచ్చినవన్నీ కొనసాగాడు శ్రీకర్.
ప్రతీదీ కొనాలనిపించేదే. అన్నీ ఉపయోగమైనవే. రకరకాల ఎలక్ట్రానిక్ ఐటమ్స్. చూసిన కొద్దీ చూడాలనిపించేలా చూసిన ప్రతీదీ కొనాలనిపించేలా.
"మీ మిసెస్ కు మంచి శారీ తీసుకోండి సార్..." లూసీ చెబుతోంటే నడుస్తూ వింటున్నాడు.
"లూసీ...నీకో గమ్మత్తయిన విషయం చెప్పనా...ఈ క్షణం ఇక్కడి కరెన్సీ తప్ప మిగతాది అంతా పనికిరాని చెత్తే కదూ...ఫ్లయిట్ ఎక్కినా మరుక్షణం ఈ దిర్ హమ్స్ కూడా పనికిరావు. అయినా సరే, మనిషి దేశ దేశానికి మారే కరెన్సీ దిర్ హమ్స్ అని తెలియదు" సిన్సియర్ గా చెప్పాడు శ్రీకర్.
"మనకు అవసరం లేని విషయాలను, మనం తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడమే దానిక్కారణం కదా..." చెప్పింది లూసీ.
డిజిటల్ వాయిస్ రికార్డ్ అతన్ని బాగా ఆకర్షించింది. చేతిలో ఇమిడిపోయే సైజులో వుంది. జేబులో పెట్టుకోవచ్చు కూడా. చూడ్డానికి పెద్ద సైజు పెన్నులా వుంది.
"ఇది బావుంది కదూ" అన్నాడు డిజిటల్ వాయిస్ రికార్డర్ ణి లూసీకి చూపిస్తూ.
"తెహల్కా వాళ్లు ఇంతకన్నా లేటెస్ట ఎక్విప్ మెంట్ తో సంచలనం సృష్టించారు. ఇది ఇంటర్వ్యూలకు పనికొస్తుంది. అంతేకాదు రహస్యంగా మాటలను టేప్ చేయొచ్చు కూడా...నాలుగు గంటలపాటు కంటిన్యూగా టేప్ అవుతుంది" చెప్పింది అది ఎలా ఆపరేట్ చేయాలో చూపిస్తూ.
"దీని ఖరీదు ఎంత?" అడిగాడు శ్రీకర్. లూసీ షాపతన్ని అడిగి శ్రీకర్ కు చెప్పింది. రెండు వందల డెబ్బయి అయిదు దిర్ హమ్స్...అంటే ఇండియా కరెన్సీలో దాదాపు మూడున్నర వేలు.
డిజిటల్ వాయిస్ రికార్డర్ ణి ప్యాక్ చేయమని చెప్పాడు. మరికొన్ని ఐటమ్స్ తీసుకున్నాడు.
"మీ మిసెస్ కు శారీ తీసుకుంటారా? మీనా బజార్ ఇక్కడ ఫేమస్. లేటెస్ట్ వెరైటీస్ వుంటాయి..." చెప్పింది లూసీ.
మరోసారి అతనికి ప్రియంవద గుర్తొచ్చింది.
(ఇంకావుంది)
|
|