అనుకున్నామని జరగవు అన్నీ...

డాక్టరు వృత్తిలో చాల పరిచయాలు ఏర్పడతాయి. వీరిలో ఎక్కువ మంది ట్రీట్ మెంట్ అయిపోగానే, జ్ఞాపకాల మరుగున పడిపోతారు. రైలులో పరిచయమయ్యి , స్టేషన్ రాగానే దిగిపోయే ప్రయాణీకుల చందం. రెండో తరహా వాళ్లు కొద్ది మంది వుంటారు. వాళ్ల వాళ్ల అసాధారణ రుగ్మతల వల్లో, చాలా కాలం గుర్తుందిపోతారు. మూడో కోవకు చెందిన వాళ్లు మరి కొద్ది మంది వుంటారు. వీళ్లు, పేషెంట్లుగా పరిచయమయ్యి , వాళ్ల ప్రేమానురాగాలను పంచిపెట్టి, ఆత్మీయులుగా మారిపోయి, కుటుంబ సభ్యుల్లాగా మిగిలిపోతారు.

సురేష్, సుజాత ఈకోవకి చెందినవారే. ఇంగ్లాండ్ నుంచి వచ్చి, ప్రాక్టీసు మొదలు పెట్టిన రోజులు. సుజాత నడుం నొప్పితో వచ్చింది. ఎన్ని నెలలు మందులు వాడినా తగ్గలేదు. చివరకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. సురేష్, సుజాతకి ఫ్రెండ్ గా పరిచయం. సుజాతకి తోడు వచ్చేవాడు ఆన్నివేళలా! సురేష్ కి అదే రోజుల్లో అమెరికాలో ఓ ఆయిల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇద్దరూ ఎంతో సంస్కారవంతులు. వాళ్లతో పరిచయం దినదినాభివృద్ధి చెంది, పేషెంటు, డాక్టరు సంబంధం నుంచి మంచి స్నేహితులమనే అనుబంధానికి ఎదిగిపోయిది.

ఆ రోజు ఉదయం ఓపిలో వున్నాను. సురేష్ నుంచి ఫోన్, ఓ చెడ్డ న్యూస్ మోసుకోస్తూ. సురేష్, సుజాత సెలవులకని రాజస్తాన్ వెళ్లారట. వాళ్లు ప్రయాణించే కారుకి యాక్సిడెంట్ అయిందట. సుజాతకి స్పైన్ ఫ్రాక్చర్ అయిందట. దగ్గరున్న సిటీలో ట్రీట్ మెంటు తీసుకోమన్నా వినకుండా, సాయంత్రాని కల్లా హైదరాబాద్ చేరుకున్నారు . ఏ యాక్సిడెంట్ లోనయినా, ఏదయితే జరగకూడదని అనుకుంటామో అదే జరిగింది సుజాత విషయంలో. వెన్నెముక ఫ్రాక్చర్ అయి,వెన్నుపూస దెబ్బతిన్నది. ఫలితం నడుం నుంచి కిందకి పెరాలసిస్.

రెండు కాళ్లల్లో కదలిక లేదు. మెడికల్ భాషలో Post Traumatic Paraplegia. “నీ దగ్గరికొచ్చేశాం. మాకేం భయంలేదు. మాకు తెలుసు, నువ్వు సుజాతని మళ్లీ నడిపిస్తావు" అని సురేష్ అంటుంటే - “నిజాన్ని వీళ్ళిద్దరికీ ఎలా చెప్పాలా?” అని మధనపడ్తూ ఆపరేషన్ మొదలుపెట్టాం. విరిగిన వెన్నెముకని, అటూ, ఇటూ రాడ్స్ వేసే, స్పైనల్ స్టెబిలైజేషన్ ఆపరేషన్ ఆరుగంటలు పట్టింది. ఆపరేషన్ చేస్తున్నప్పుడే, నాకున్న కొద్ది ఆశ అంతరించిపోయింది. వెన్నుపూస, పూర్తిగా నలిగిపోయి కనపడింది.

సుజాత జీవితంలో ఇక నడవలేదు. ఆపరేషన్ తరువాత ఓ నెలరోజుల పాటు హాస్పిటల్ లో వుంది సుజాత. రోజూ పని అయిపోయాక రూమ్ కి వెళ్లి కూర్చునే వాడిని కొద్దిసేపు, వాళ్లిద్దరికీ ఇంకా ఆశ, ఏదో మిరాకిల్ జరిగి, తనకి కాళ్లు వస్తాయని, 'కొంచెమన్నా ఆశ, అవకాశం వున్నాయి కదా' అనే భావం స్పూరిస్తూ వాళ్లు నా కళ్లలోకి చూసినప్పుడు ఆ చూపులు తప్పించుకోవడానికి చాలా యాతన అనుభవించే వాడిని. ఈ బాధ చాలదన్నట్లు, సురేష్ ఓ రోజు చెప్పిన విషయాలు ఇంకా లోతైన షాక్ కలగచేశాయి.

సురేష్, సుజాత పరిచయం చిన్నప్పటి నుంచట. ఇద్దరూ ఇష్టపడి పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. కానీ, అనుకున్నవన్నీ జరగవుగా. పెద్దవాళ్లకిష్టం లేక, ఇద్దరూ వేర్వేరు పెళ్లిళ్లు చేసుకోవలసి వచ్చింది. ఇది పదిహేనేళ్ల కిందటి మాట. సుజాతకి, ఇద్దరూ కొడుకులు కూడా. పెద్దోడికి 12 ఏళ్లు. నిజ జీవితంలో సంభవించే మలుపులు, ఏ కథకుడు కూడా ఊహించి రాయలేడేమో! సుజాత, సురేష్ లిద్దరి వైవాహిక జీవితాల్లో అపశ్రుతులు దొర్లి, వారి వారి పార్టనర్స్ నుంచి విడిపోవడం కూడా జరిగింది.

ఇన్నాళ్ల తర్వాత సురేష్, సుజాతలు ఒంటరి అయిపోయారు. మళ్లీ ఇద్దరూ కలిపి కొత్త జీవితం మొదలు పెట్టాలనుకున్నారు . గుండె లోతుల్లో కోడగట్టున్న తొలిప్రేమ దీపాల్ని, మళ్లీ ప్రజ్వలింప చేసి, భగవంతుడు పదిహేనేళ్ల తర్వాత ఇచ్చిన ఇంకో అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. మళ్లీ పెద్దోళ్లు అడ్డు పడాలని ప్రయత్నించినా, ఈసారి వీళ్లే గెలిచారు. పెద్దోళ్లు అవుననక తప్పలేదు. ఆ ఆనందాన్ని పండగ చేసుకోవాలనీ, సురేష్, సుజాత పిల్లలతో కలిసి, రాజస్థాన్ వెళ్లారు. రాగానే పెళ్లి అనుకున్నారు. అప్పుడే విధి, ఇంకోసారి ఆదుకుంది వీళ్ళిద్దరితో. నాలుగేళ్లయిపోయింది.

సురేష్, సుజాతను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం అమెరికాలో వుంటున్నారు. సుజాత పిల్లలిద్దరితో కలిసి. సుజాతకి రికవరీ ఏమాత్రం రాలేదు భయపడ్డట్లే. తను వీల్ చైర్ సహాయంతో తన పనులన్నీ తనే చేసుకుంటుంది. సుజాత నడవలేకపోవడం తప్ప వాళ్లు ఓ ఆనందమయ జీవితం గడిపే జంటలాగే వుంటారు. ఇండియా వచ్చినప్పుడల్లా కలుస్తుంటారు. వాళ్లని చూసినప్పుడల్లా నా గుండెలో మిక్స్ డ్ ఫీలింగ్స్ దొర్లుతుంటాయి.

వాళ్లిద్దరూ ఆనందంగా ఒకళ్లకొకరు బ్రతకడం చూస్తే ఆనందం, మరో పక్క బాధ. దేవుడు నిర్దయగా వాళ్లని ఎందుకంతగా శిక్షించడం? ప్రేమ నిండిన జీవితాల్లోని ఆనందం అనుభవించడానికి శారీరక బాధలు అడ్డురావని ఎలుగెత్తి చెప్పిన సురేష్ ని, జీవన గమనానికి కాళ్లతో పని లేదనీ, కావలిసింది ఆత్మస్థైర్యమని అందంగా నిరూపించిన సుజాతని, తలచుకున్నప్పుడల్లా నా చిన్న చిన్న సమస్యలు మరింత చిన్నవిగా అనిపించి, ముందుకి సాగిపోతాను.