చిరుతిండి ఎంతో మధురం

చిరుతిండి అంటే మెగాస్టార్ 'చిరు' తినే తిండి అనుకోకండే. చిరుత ప్రాయంలో తినే తిండి అనుకుంటే అందరికీ సౌకర్యంగా ఉంటుంది. మన చిన్నప్పటి స్నేహితులు ఎలా గుర్తుండిపోతారో, చిన్నప్పుడు మనం తిన్న చిరు తిండ్లు కూడా అలానే గుర్తుండి పోతాయన్నది నిజం. పెద్దవుతున్న కొద్దీ, మన రేంజ్ పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త రుచులు, అభిరుచులూ పుట్టుకొస్తుంటాయి. కానీ ఎలిమెంటరీ స్కూల్లో తిన్న పదార్ధాలు ఇప్పుడు దొరక్క పోవచ్చుగానీ వాటిని తలచుకుంటే చాలు. నోరూరక తప్పదు.

నా ప్రాథమిక విద్య సీతారామయ్య బళ్ళో - బాపట్లలో మా ఇంటి ప్రక్కనే.బై బయట ఓ ముసలమ్మబఠానీలు, ఉప్పు సెనగలు బుట్టలో పెట్టుకుని అమ్ముతుండేది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు అప్పటి నుంచే ఆమెకు అప్పు పెడ్తుండే వాడిని. ఇవికాక రోజూ మధ్యాహ్నం యుఎస్ ఎయిడ్ ప్రోగ్రాం కింద అమెరికా నుంచి వచ్చిన పాలపొడి పెట్టేవాళ్ళు. కరెక్టుగా అయితే పాలు తయారుచేసి ఇవ్వాలి. కానీ మా సీతారామయ్య గారికి అంత తీరిక, ఓపిక లేదు. కాబట్టి పాలపిండి పెట్టేసే వాడు.

కానీ పాలకంటే పాలపిండే దివ్యంగా వుండేది. తియ్యగా నోట్లో అతుక్కుంటూ. ఆరోజుల్లో ఇంకా గుర్తున్నవి - పార్లేవాళ్ళ పైసా బిస్కట్లు. చాలా బాగుండేవి. ఆ తర్వాత హైస్కూల్. కొట్టి వెరైటీలు. తాటిచాప చాలా ఫేమస్ పండిన తాటికాయని పాకంచేసి, చాపమీద పరిచి, ముక్కలుగా అమ్మేవాళ్ళు. పది పైసలకి, అర చేయంత ముక్క వచ్చేది. దాన్ని జాగర్తగా, కొంచెం కొంచెం కొరుక్కుంటూ, సాయంత్రం దాకా లాగే వాళ్లం. జీళ్ళు కూడా పాపులర్, బెల్లం జీడి బడుగువర్గాలకి, కొంచెం డబ్బున్న సాములకి పంచదార జీళ్ళు.

ఇవి కాక తేగలు బ్రహ్మాండంగా దొరికేవి. ఈ హైస్కూల్ లో నాతోపాటు మా బాబాయి కూడా చదివే వాడు. బాస్ సీనియర్ కదా. చిన్నా చితకా తినే చెత్త తిండి తినేవాడు కాదు. వీరయ్య బండి అని ఉండేది. దాంట్లో, బంగాళాదుంప బజ్జీలు, పొట్టకోసి, ఉల్లిపాయ మసాలా దట్టించి, నిమ్మరసం పిండి ఇచ్చేవాడు. ఒక్కసారి మొదలెడ్తే కనీసం పదన్నా తినాల్సిందే. అబ్బ! తలచుకుంటేనే నోరూరుతోంది. కానీ ఈ సదరు బజ్జీలు, మా బాబాయి అప్పుడప్పుడు దయ తలచి ధర్మం చేస్తేనే దొరికేవి.

ఆ రోజుల్లో ఈ సదరు వీరయ్య దగ్గర మా బాబాయి అయిదు వందల దాకా అప్పు చేశాడంటే ఆ బజ్జీల మహిమ అర్ధమయిందా!? ఎండాకాలంలో సోడా తాగడం చాలా ఫ్యాషన్. ప్రతి దాంట్లోనూ క్లాస్ డిఫరెన్స్ ఉండేది. నాలాంటోళ్లకు మామూలు సోడా, బాబాయికి నుమ్మకాయ సోడా. అలానే కడు పేదలకు ఐదు పైసలకు ఐస్ ఫ్రూట్ దొరికేది. ఇది ఘనీభావిందిన తీపి ఐస్ ముక్క మాత్రమే. కాకపొతే రంగురంగుల్లో ఉండేవి. ఇక్కడ అప్పర్ క్లాస్ బూర్జువాలకి, పదిపైసలకి సేమ్యా ఐస్ ఫ్రూట్ అభ్యమయ్యేది.

ఐస్ క్యూబ్ కి చివర్లో సేమ్యా ఉండేది. ఇంకా మదించిన వారికి పాల ఐస్ ఫ్రూట్ విత్ సేమ్యా. ఇరవై పైసలకి దొరికేది. ఈ రోజుల్లోనే పది పైసల షేప్ లో కొబ్బరి బిళ్లలుండేవి. వాటి రుచి వర్ణనాతీతం సుమా! శనివారాలు ఆంజనేయ స్వామి గుళ్ళో దొరికే వడపప్పు, భావనారాయణ స్వామి గుళ్ళో దొరికే పులిహోర మధురాతి మధురం. అందులో ఉచితంగా దొరుకుతున్నాయనేమో మరీ మధురం. బాపట్ల ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళి చూద్దాం. అక్కడేం దొరుకుతాయో తినడానికని, క్యాంటీన్ లో మిరపకాయ బజ్జీలుబ్రహ్మాండంగా ఉండేవి. కొంచెం పైసలు ఎక్కువ దొరికాయనుకోండి. బ్రెడ్ ఆమ్లెట్ అదరహో. కాలేజీ బయట, ముంతకింద పప్పు అమ్మేవాడు హుసేన్.

ఆ రుచి ఏ ఫైవ్ స్టార్ హోటల్ ఫుడ్ కి వస్తుంది చెప్పండి? అగ్రికల్చరల్ కాలేజీ ముందుగా భావనారాయణ టీ స్టాల్ ఉండేది. దాంట్లో మసాల టీ, స్టాల్ బిస్కట్ నంజుకుంటూ తాగుతుంటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉండేవాళ్లం. గుంటూరు మెడికల్ కాలేజీకి వచ్చేసరికి కొంచెం స్టైల్ పెరుగుతుంది కదా సహజంగానే. అందుకనే క్యాంటీన్ లో చాలా స్టయిల్ గా కేక్ లు తినేవాళ్లం. ఎండాకాలంలో తీపి, ఉప్పు కలిపినా నిమ్మరసం చేసేవాడు మా నాయరు. లీటర్లు లీటర్లు తాగేవాళ్లం. ఆ రుచి, ఏ కూల్ డ్రింక్ లోనూ దొరికేది కాదు.

గుంటూరులో ఓవర్ బ్రిడ్జికి ప్రక్కనే నెప్ట్యూన్ స్టూడియో దగ్గర్లో ఓ బండిమీద 'మలాయ్ పూరీ' అని అమ్మేవాడు. పూరీలాంటి దానిమీద చక్కెర పాకం పూసి, చుట్ట చుట్టి ఇస్తాడు. ఈరోజుకీ గుంటూరు వెళ్తే అక్కడికి వెళ్ళి ఆ పూరీ తినందే నా జిహ్వ చాపల్యం ఆరదు. ఆరోజుల్లో గుంటూరు శంకర్ విలాస్, ఓ చారిత్రాత్మక స్థలం. శంకర్ విలాస్ లో వేడి వేడి సాంబారు ఇడ్లీ తిననివాడు దున్నపోతై పుట్టినట్లే వచ్చే జన్మలో. గర్ల్ ఫ్రెండ్ వచ్చినప్పుడు ఈ సాంబారు ఇడ్లీలు మోటుగా ఉండేవి.

అందుకే కొంచెం ఎత్తుకి ఎదిగి మెట్లెక్కిపైనున్న 'ఉదయశంకర్' లో ఫ్రూట్ సలాడ్ తినే వాళ్లం. పక్కనున్న పడుచు (తర్వాత మావిడే అయింది లేండి) ప్రభావమో, మరి ఐస్ క్రీం ప్రభావమో తెలియదు కానీ ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీం చల్ల చల్లగా మధ్యలో వేడి వేడిగా ఉండేది. ఇక ఇంగ్లండ్ వెళ్ళినాక ఈ జీళ్ళు, ముంత కింద పప్పులు దొరికేవి కావు. అప్పుడప్పుడు బర్మింగ్ హాంలో జిలేబీలు దొరికేవి. ఆవురావురుమని ఓ అరడజను పట్టించే వాడిని, అక్కడ ఫ్లోరిడా నుంచి వచ్చే ఫ్రెష్ ట్రోపీకానా ఆరంజ్ జ్యూస్, జర్మనీ నుంచి వచ్చే ముల్లర్ యోగర్ట్ లు మహా పసందుగా ఉండేవి.

ఎక్కడ బాపట్ల ఉప్పు సెనగలు - ఎక్కడ గుంటూరు బజ్జీలు, ఎక్కడ జర్మన్ యోగర్ట్ లు. ఎదగడమంటే ఇదే. నా మట్టుకు నాకు నా టెస్ట్ బడ్స్ అంటే చాలా మమకారం. ఎందుకంటే అవి ఇంతవరకూ మారలేదు. ఇప్పటికీ మలాయ్ పూరీని, ముంతకింద పప్పుని, మల్బరీ కేక్ ని సమంగా చూసుకుంటాయి. సమంగా పంచుకుంటాయి. కొన్ని సెంట్ మెంటు జ్ఞాపకాలు మీతో పంచుకున్నప్పుడు మీలో చాలామందికి కళ్లవెంబడి నీళ్ళు వచ్చాయి కదూ! మరీసారి మీ నోటివెంట నీరు తప్పక వస్తుందని ఆశిస్తూ - సిగ్గులేని తిండిబోతు.