'అను'బంధం

ఇటీవల జరిగిన ఓ కాన్ఫ్ రెన్స్ కి పూనా వెళ్లాను. అక్కడి పొలిమేరల్లో వున్న 'అవుంద్' అనే ప్రాంతంలో ఓ హోటల్ లో దిగాను. రిసెప్షన్ లో నా విజిటింగ్ కార్డ్ చూసి, ఒకామె నా పైపు కన్నార్పకుండా చూస్తోంది. 'ఇంకా అమ్మాయిలు అలా కన్నార్పకుండా చూసేంత అందంగా వున్నాన్నా?' అని అనుకుంటూ తెగ సిగ్గు పడిపోతున్న సమయంలో ఆమె 'మీరు 20 ఏళ్ల క్రితం సంచేటి హాస్పిటల్ లో పనిచేశారు కదూ, నా పేరు అను కేల్కర్. రమేష్ అని ఓ స్పైనల్ కార్డ్ విరిగిన పేషంట్ కి ట్రీట్ చేశారు. గుర్తుందా?' అని అడిగింది.

ఒక్క నిమిషం గతాన్ని చిలికితే గుర్తొచ్చింది. అవును, రమేష్ ని ఎలా మరిచి పోగలను? ఇరవై ఏళ్ల కిందటి మాట (గుమ్మడి గారిలా కళ్లజోడు తీసి గతంలోకి వెళ్లిపోతున్నానని అనుకోకండి). పూణేలో సంచేటీ హాస్పిటల్ లో క్యాజువాలిటీ డాక్టరుగా చేరిన కొత్త రోజులు. అదో ఎండాకాలం సాయంత్రం. ఓ పాతికేళ్ల కుర్రాడిని (రమేష్) స్ట్రెచర్ మీద తీసుకొచ్చారు. పక్కనే కళ్లనిండా నీళ్లతో ఇద్దరుస్త్రీలు అను,లలితమ్మ. జరిగిన విషయమేమిటంటే - రమేష్ ఓ సాఫ్ట్ వేర్ కంపనీలో ఇంజనీర్. అను హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేస్తోంది బొంబాయిలో.

వాళ్లిద్దరూ గత ఐదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. వాళ్ల ప్రేమకి పెద్దల అంగీకారం అప్పుడే దొరికింది. ఆ రోజే ఎంగేజ్ మెంట్ అయింది. ఆ సందర్భంగా వాళ్లిద్దరూ ఆ సాయంత్రం 'అవుంద్' లో కొండమీద వున్న గుడికి వెళ్లారు దేవుడి ఆశీస్సుల కోసం. అక్కడ కొంతమంది రౌడీలు ఆ అమ్మాయిని గొడవ చేయబోతే రమేష్ అడ్డుపడ్డాడు. ఆ గొడవలో రమేష్ ని కొండమీద నుంచి తోసేశారు. అతను కింద లోయలో పడిపోయాడు. నడుంకి దెబ్బ తగిలింది. ఈ విషయాలన్నీ చక్కటి ఇంగ్లీష్ లో అను చెప్పగా కేస్ హిస్టరీ రాసుకున్నాను. తర్వాత బాస్ వచ్చి పరీక్ష చేసి, ఎక్స్ రె తీసి, రమేష్ ఎత్తు నుంచి పడ్డం వల్ల వెన్నుపూస దెబ్బతిందనీ, తద్వారా రెండు కాళ్లు పారలైజ్ అయ్యాయని, వెంటనే ఆపరేషన్ చేయాలనీ నిర్ధారించారు. ఆ రాత్రే ఆపరేషన్ చేసి, స్పైనల్ రాడ్ వేశారు.

ఆపరేషన్ నేను భాగస్వామిని కాకపోయినా, నాకెందుకో ఇంటికి వెళ్లాలనిపించలేదు. వాళ్లిద్దర్నీ ఓదారుస్తూ, ధైర్యం చెప్తూ అక్కడే ఉండిపోయాను. 'కాళ్లు వస్తాయా' అన్న ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. తర్వాత రోజుల్లో తెలిసింది. స్పైనల్ కార్డ్ బాగా దెబ్బతింటే కోలుకుని, మళ్లీ కాళ్లలో పట్టు రావడానికి అవకాశాలు బాగా తక్కువని. అదే జరిగింది రమేష్ విషయంలో. కాళ్లు రాలేదు సరికదా.. DIC అనే కాంప్లికేషన్ మహమ్మారి అంటుకొంది.

మామూలుగా, మనందరికీ ఎ కారణం వల్లనయినా రక్తస్రావం అయితే, రెండు నిముషాల్లో రక్తం గడ్డకట్టి, మరింత రక్తం పోకుండా ఆగిపోతుంది. మన రక్తనాళాల్లో క్లాటింగ్ ఫేక్టర్స్ అనే కొన్ని ప్రోటీన్ల వల్ల ఇది వీలు అవుతుంది. ఒక్కోసారి, వెన్నుపూస దెబ్బవల్ల, పీడా ఆపరేషన్ వల్ల ఈ రక్తం గడ్డ కట్టడం ఆగదు. దాన్నే DIC (Disseminated Intramuscular Coagulopathy) అంటారు. ఈ కాంప్లికేషన్ వచ్చినప్పుడు, వదిలేసిన ట్యాప్లోంచి నీళ్లు పోతున్నట్లు రక్తం కారిపోతూనే వుంటుంది. గడ్డ కట్టదు. కాబట్టి రక్తం లీరర్ల కొద్దీ పోయి ప్రాణానికే ప్రమాదం వస్తుంది. కొత్త రక్తం ఎక్కించడమే దానికి ట్రీట్ మెంట్.

ఒకటి రెండు బాటిల్స్ కాదు. ఒక్కోసారి 30, 40 బాటిల్స్ ఎక్కిస్తుంటాం. ఈ కొత్త రక్తం నుంచి రక్తం గడ్డ కట్టించే క్లాటింగ్ ఫాక్టర్స్ తగినంత లభిస్తే, ప్రాణం కాపాడే అవకాశముంటుంది. రమేష్ కి రెండో రోజు నుంచే బ్లీడింగ్ మొదలయింది. ఆపరేషన్ చేసిన చోటు నుంచి, ముక్కులోంచి, రక్తం కారుతూనే వుంది. నేను మిగిలిన పనులన్నీ మానేసి, రమేష్ దగ్గరే అంకితం అయిపోయాను. గంట గంటకీ కొత్త బ్లడ్ బాటిల్ కనెక్ట్ చేయడం - రాత్రింబవళ్లు ఇదే పని. రమేష్ కి మధ్య మధ్యలో తెలివి వచ్చేది.

నా వైపు కృతజ్ఞతా పూర్వకంగా చూసి, చేయి నొక్కేవాడు. మూడ్రోజులు గడిచాయి. రమేష్ కి బ్లీడింగ్ ఆగలేదు. అక్కడికి 30 బాటిల్స్ కి పైగా ఎక్కించాం. అను, లలితమ్మగారు నా వైపు ఆశగా చూసేవాళ్లు, బ్లడ్ రిపోర్టులు వచినప్పుడల్లా. మూడో రోజు బాస్ కూడా పెదవి విరిచాడు. 'ఇక బ్లడ్ ఇవ్వడం మానేద్దాం మల్టీ ఆర్గాన్ ఫేల్యూర్ లోకి వెళ్లిపోయాడు' అని చెప్పేసి వెళ్లిపోయాడు. నాకింకా ఆశ. ఏదన్నా మిరాకిల్ జరిగి, రమేష్ బ్రతుకుతాడేమోనని. అనుభవం లేను కుర్రతనంలోనూ, అనుభవాలతో పండిపోయిన ముసలితనంలోనూ మాత్రమే మిరాకిల్స్ జరుగుతాయోమోనని ఎదురు చూస్తాం అనుకుంటా.

రాత్రి పదిగంటల ప్రాంతంలో రమేష్ శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. నేను పక్కనే వున్నాను. అను, లలితమ్మగారితో పాటు నేనూ ఏడ్చాను డాక్టర్ని అని కూడా మరిచిపోయి. ఇన్నేళ్ల అనుభవం తర్వాత కూడా ఇప్పటికీ పేషెంటు చనిపోతే కళ్లు చెమ్మగిల్లుతాయి నాకు. మరి ఈ రకమైన ఎమోషనల్ అటాచ్ మెంట్ మంచిదో, కాదో నాకు ఇప్పటికీ తెలీని విషయం. కొంతమంది డాక్టర్లు, పేషెంట్ తో క్లినికల్ అటాచ్ మెంటు తప్ప ఎమోషన్స్ వుండకూడదని వాదిస్తారు.

మరి నాకయితే అప్పుడు డాక్టరుకి, స్కానింగ్ మెషిన్ కి తేడా ఏముందనిపిస్తుంది? అను లలితమ్మలు నా సేవా నిరతిని మెచ్చుకుంటూ నాకందించిన అభినందనలు, నా కెరీర్ లో వచ్చిన అవార్డ్స్ లో కెల్లా గొప్పవి. ఆ తర్వాత అను అడపా దడపా కనపడేది. అప్పుడప్పుడూ ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడిగేది. నేను ఇంగ్లాండ్ వెళ్లిన తర్వాత అను నా జ్ఞాపకాల మరుగున పడింది. మళ్లీ ఇన్నాళ్లకి... అనూని కలవడం జరిగింది. తను నా కార్డ్ చూసి గుర్తు పట్టడం, నా పేరు ఇంకా ఆమెకి గుర్తుండడం, ఆశ్చర్యం. కాకపొతే మా డాక్టర్ల అదృష్టం అది.పేషెంట్ల గుండెల్లో చిరకాలం మాకు స్థానం వుంటుంది.

అను తన హోటల్ మేనేజ్ మెంట్ లో పెద్ద డిగ్రీలు చేసి, సీనియర్ పొజిషన్ కి చేరుకున్నానని చెప్పింది. చివరలో ఉండబట్టలేక. నేనే అడిగాను. “మరి మీ ఆయన ఏం చేస్తుంటారు" అని. ఆమె చిన్న నవ్వు నవ్వి "డాక్టరు గారూ, మా ఇద్దరికి పెళ్లి అవ్వకపోయినా రమేష్ నా భర్త అనుకున్నాను తన జ్ఞాపకాలు తప్ప నాకింకెవ్వరూ తోడు లేరు..... అక్కర్లేదు" అని వెళ్లిపోయింది.

కాస్సేపు పట్టింది తేరుకోవడానికి, మనుషుల మధ్య ప్రేమలు, ఆప్యాయతలు తగ్గిపోతున్నాయను వాపోయే ఊ రోజుల్లో అను లాంటి వాళ్లు కూడా వున్నారని ఆనందపడ్డాను. వెంటనే నాకు నచ్చిన నారాయణరెడ్డి గారి పాట గుర్తొచ్చింది. 'అనుబంధం... ఆత్మీయత అంతా ఒక బూటకం.. ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే వింత నాటకం.' మరి నారాయణరెడ్డి గార్కి, అను ఎదురయితే ఏమంటారో!!