“ఓ బలహీన క్షణాన....”

ఇటీవల, హరిహర కళాభవన్ లో, 'ఫైవ్ పాయింట్ సంథింగ్' అనే ఇంగ్లీష్ ప్లే చూశాను. నాకు సిన్మాలన్నా, నాటికలన్నా ఇష్టం. కాకపొతే మా లేడీస్ (పూనాలో భార్యని ఇలా సంభోదిస్తారు కొంతమంది) సిన్మాలకి అస్సలు రాదు. వచ్చినా మనల్ని ఉద్దరించినట్లు గొప్ప కటింగ్ ఇస్తుంది. నాటికలయితే, నాకంటే ముందు తయారు, కాబట్టి శ్రీమతితో బయటకు వెళ్లాలంటే, నాటిక మంచి అవకాశం. ఢిల్లీ ఐఐటి లో చదివిన భగత్ అనే అతను రాసిన నవలకి నాటికి రూపం ఇది (Five point something నవల ఆధారంగానే 'Three idiots' సిన్మా తీశారు). ఐఐటిలో చేరడానికి ఎంత కష్టపడాలో, ఎన్ని వేల మందితో పోటీపడి, సెలక్ట్ అవ్వాలో మనందరికి తెలిసిన విషయమే.

అలా కస్టపడి ఐఐటిలో చేరిన ముగ్గురి కుర్రాళ్ల కథ ఇది, కాలేజీలో మంచి గ్రేడ్ కోసం పడే ఆరాటం, పోరాటం వెనుక నిరాశా, నిస్ప్రహలు, అద్భుతంగా నాటకీయం చేశారు. ఈ ముగ్గురు ఆ పరుగు పందెంలో వెనకబడి గ్రేడ్ పాయింట్ పదికి ఐదు మాత్రమే సంపాదించగలుగు తారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, ఓ ప్రొఫెసర్ కూతురు పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి ద్వారా ఆమెకు తెలీకుండా, ప్రొఫెసర్ గది తాళం చెవి సంపాదించి, పరీక్ష పేపర్ కొట్టేయబోతారు. పట్టుబడతారు. ఓ సెమిస్టర్ సస్పెండ్ అవుతారు.

చివరకు మళ్లీ బాగా చదివి, వావు తప్పి, కన్ను లొట్టపోయినట్లు బయట పడతారు. కాలేజీ రోజుల్లో ఇలాంటి పిచ్చి, వెర్రి పనులు చాలా మందిమి చేస్తుంటాం. కాలేజీలో చేరేటప్పుడు అందరూ మంచివాళ్లే. కష్టపడి వచ్చినవాళ్లే. కాకపొతే, కాలేజీలో, టీనేజిలో, సావాస దోషం వల్ల కొంతమంది తప్పుదార్లు తొక్కుతుంటారు. సరదాగా 'జస్ట్ ఫర్ ఫన్' అంటూ చేసే చిలిపి చేష్టలు కొన్ని సార్లు శ్రుతిమించి, జీవితంలో అంతులేని కష్టాన్ని కలగజేస్తాయి.

మా పిన్నికొడుకు నార్త్ లో ఓ కాలేజీలో ఇలానే చిన్న తగాదాలో ఇరుక్కుని చివరికి చిలికి చిలికి గాలివానలో మునిగిపోయి, కోర్టు కేసులో ఇరుక్కుని, ఆరు నెలల పాటు పరారీలో వుండి, బయటపడ్డాడు. ఎంతో సౌమ్యుడు, ఏ చెడ్డ అలవాటు లేని మనిషి వీడు అంతకు ముందు. నాటిక చూసిన రాత్రి నా కాలేజీలో జీవితం ఫ్లాష్ బాక్లోకి వెళ్లి చూసుకున్నాను. నేను కూడా ఇలాంటి 'తొట్టి పనులు' ఎవన్నా చేశానా? అని. వెంటనే, బాపట్ల ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో జరిగిన ఓ సంఘటన గుర్తొచ్చింది.

ఆరోజు సాయంత్రం వర్షం పడుతోంది. మా క్లాస్ అయిపోయింది. వర్షం వల్ల కారిడార్ లో నుంచొని వున్నాం అందరం. పక్కనే కామర్స్ వాళ్లకి ఇంగ్లీష్ క్లాస్ జరుగుతోంది. రామారావు గారని మాక్కూడా ఆయనే ఇంగ్లీష్ టీచర్. ఆయన కొంచెం స్ట్రిక్ట్. అందుకని మా అందరికీ ఆయనంటే ఒకింత కోపం. బయట నుంచి, చిన్న చిన్న జోకులు, కామెంట్స్ మొదలయ్యాయి గురువుగారి మీద. ఆ సందడిలో మనం కూడా భాగం పంచుకోవాలనే తపన. ఆ బలహీన క్షణంలో ఓ నాటీ హీరో బయటకు తన్నుకు వచ్చాడు నాలోంచి.

“మీ కుళ్లు జోకులేం లాభం లేదురా... రామారావు గార్కి నేనిస్తాను చూడండి షాక్" అంటూ, ఆ పక్కనే వున్న ఓ ఇనప కడ్డీ తీసుకొని, కిటికీలోంచి ఆయన క్లాస్ లోకి విసిరేశాను. ఆ శబ్దానికి అందరూ ఉలిక్కిపడడం, గురూజీ కూడా ఖంగుతినడం వెంట వెంటనే జరిగిపోయాయి. మనం అందరి ముందూ కాలర్ ఎగరేసి, “చూశారా, మన రేంజ్ ఏమిటో" అనుకుంటూ విజయ గర్వంతో ఇంటికి చేరాను.

మా క్లాస్ అమ్మాయిలందరూ, “సిన్మా హీరోలాగా, రామారావు ని భలే ఏడిపించాడు కదే" అని ఆరాధనా పూర్వకంగా నా చుట్టూ మూగినట్లు కల కూడా వచ్చినట్లు గుర్తు ఆ రాత్రి. ఏదో గొప్ప పని చేసినట్లు ఇక లెక్చరర్స్ అందరూ మాతో బుద్దిగా వుంటారన్నట్లు ఫీల్ అయ్యాను ఆ రాత్రంతా. నేను చేసింది తప్పని, ప్రమాదమని ఏమాత్రం అనిపించలేదు. మర్నాడు కాలేజీకి ఎప్పటికంటే కొంచెం జోరుగా, హుషారుగా చేరుకున్నాను.

మొదటి క్లాస్ రామారావు గారిదే. గురువు గారు సీరియస్ గా వున్నారు. నేను లోలోపలే నవ్వుకుంటున్నాను 'ఎలా కొట్టాను దెబ్బ!' అనుకుంటూ. అంతలో రామారావు గారు ఓ పిడుగు లాంటి స్టేట్ మెంట్ కొట్టారు. “Yesterday, some idiot of this class threw a long iron cudgel in to commerce class room. ఆ వెధవ ఎవరో తెలిసే దాకా క్లాసెస్ జరగవు, ఈ ఉదయమే లెక్చరర్స్ మీటింగ్ లో నిర్ణయం తీసుకొన్నాం.” అని ఇంగ్లీష్ లో దంచేసి, వెళ్లిపోయారు. క్లాస్ అంతా భయంకర నిశ్శబ్దం. నేను రాడ్ వేయడం చూసిన వాళ్లు కొంతమంది, నా వైపే చూస్తున్నారు. నాకు ఏం చేయాలో తోచడం లేదు.

ఏదో సరదాగా ఓవర్ యాక్షన్ చేస్తే ఇంత దూరం వస్తుందనుకోలేదు. ఆరోజు, మాకే కాదు. వేరే గ్రూపులకి కూడా క్లాసులు జరగలేదు. సాయంత్రం ప్రిన్సిపల్ వచ్చి, “ఆ రోగ్ తనంతట తానుగా ఒప్పుకుంటే సరి, లేకపోతే సస్పెండ్ చేయడం గ్యారంటీ, అని మరో పిడుగు వేసి వెళ్లారు నా నెత్తిమీద, నాకు ఒప్పుకుందామంటే ధైర్యం చాలడం లేదు. అసలీ పాటికి, ఎవడో చెప్పేసే వుంటాడు అని గుండెదడ. క్లాస్ మేట్స్ అంతా నన్ను అదోలా చూడ్డం మొదలు పెట్టారు. ఇలా రెండు రోజులు గడిచాయి.

హీరో అయిపోవాలనుకున్న నేను విలన్ గా మిగిలిపోయాను. మూడవ రోజు రామారావు గారింటికి వెళ్లి, ఏడుపు మొహం పెట్టి, 'తప్పయిపోయింది సార్' అని ఒప్పేసుకున్నాను. ఆయన మీరు వినలేని, వినరాని తిట్లు తిట్టాడని నేను వేరే చెప్పనక్కర్లేదు కదా. క్లాసులు మళ్లీ మొదలయ్యాయి. కానీ నన్ను రోజుకొక లెక్చరర్ పిల్చి ప్రైవేట్ క్లాస్ తీసుకునే వాడు. ప్రిన్సిపల్ గారయితే, నన్ను ఓ పురుగు కింద చూసేవారు.

ఆ మచ్చ అలానే వుండిపోయింది. నేనంటే గిట్టని కొంతమంది నాకు 'cudgel' అని ముద్దుపేరు పెట్టారు. కాలేజీలో, అంతకు ముందు 'బిందాస్' గా తిరిగే నేను చాలా సిగ్గుపడ్తూ దాక్కుని బతకాల్సి వచ్చింది చాలా నెలలపాటు. బాగా బుద్ధి వచ్చింది ఆ దెబ్బతో. ఆ తర్వాత ఎప్పుడూ పిచ్చి వేషాలు వేయలేదు. నిజం మళ్లీ cudgel అస్సలు విసరలేదు. బలహీన క్షణాల వల్ల చాలా కష్ట నష్టాలు సంక్రమిస్తాయి అని స్వానుభవంతో తెలుసుకున్నాను. అలాంటి క్షణాల్లో జాగ్రత్తగా వుండాలి. సిగ్గుపడి దాచాల్సిన విషయం సిగ్గు లేకుండా మీ అందరితో ఎందుకు పంచుకుంటున్నానంటే మీరన్నా అలాంటి క్షణాల్లో జాగర్తగా వుంటారని.