గురకా రెడ్డి

అచ్చు తప్పేం కాదు. అచ్చమైన, స్వచ్చమైన మారు పేరు. నిద్ర పట్టని, గిట్టని వాళ్లు పెట్టిన పేరు. అసలు గురక పెట్టంది ఎవరండీ ఈ ప్రపంచంలో. నిద్ర పోయిన ప్రతి వాడూ గురక పెట్టాల్సిందే. కాకపొతే, కొన్ని గురకలు వినపడతాయి. కొన్ని వెంటపడతాయి. నాది రెండో రకంఅయితే నేనేం చేయగలను. నా చిన్నప్పుడు, ఈ గురక వున్నట్లు తోచదు. ఆడపిల్లకి యవ్వనం చెప్పకుండా, చూస్తుండగానే ఎలా వస్తుందో, నా గురక కూడా అలానే వచ్చి చేరింది నాతో. ఇంగ్లాండులో ఓ స్నేహితుడుండే వాడు.

వెర్రి చూపుల ప్రతాప్ చౌదరి అని. (వెర్రి చూపులు ఇంటి పేరు కాదని మనవి) ఈ సదరు ఆసామి ఓ రోజు "గురివీ ఓ అద్భుతమైన మ్యూజిక్ క్యాసెట్ ఒకటి దొరికింది - విను" అని ఓ క్యాసెట్ వినిపించాడు.

అది సంగీతంలా లేదు. రైలు బండి రొదలా వుంది. కాకపొతే ఒకటే పిచ్ లో బోరు కొట్టకుండా, రైలు కాస్సేపు బ్రిడ్జి మీద వెళుతున్నట్లు, కాసేపు ఘాట్ లో లాగ లేక లాగుతున్నట్లు, చివర్లో బ్రిడ్జి మీద నుంచి లోయలోకి పడిపోయినట్లు, వెరైటీగా వుంది. నేనదే అంటే,ప్రతాప్, “బ్రదరూ, ఎంత గొప్పగా చిత్రీకరించావయ్యా, ఇది నిన్న నువ్వు నిద్ర పోయినప్పుడు చేసిన నీ గురక రికార్డింగ్" అని

తన మార్కు వెర్రి చూపొకటి పారేసి, పారిపోయాడు ఆ గదిలోంచి. నిజం చెప్పద్దూ - నా గురక మీద నాకే గర్వం వేసింది ఆ క్షణంలో, ఇంత చిరుత ప్రాయంలోనే అంత గుర్తింపు తెచ్చుకున్నందుకు.. అంతే, ఆ రోజు నుంచి నా గురక నిద్ర పోలేదు. నిద్రపోనీలేదు..

నిరంతరం, రాత్రనక, పగలనక, బెడ్ రూం అనక, సిన్మాహాలు అనక ఆరు స్పీకర్ల సాయంతో మోగుతూనే వుంది. మొరుగుతూనే వుంది. నాకు, ప్రతి చోటా, ప్రతి నోటా పేరు తెస్తూనే వుంది. సెలవులకి, ఎవ్వరింటికి వెళ్లినా, మనది స్పెషల్ స్టేటస్. ఇంట్లో ఎంత మంది సర్దుకోవాల్సి వచినా, మనకి సింగిల్ రూం గ్యారంటీ, “పాపం మహాతల్లి ఎలా భరిస్తోందో" అని, మా ఆవిడకి స్పెషల్ సింపతీ. మనలో మాటకొస్తే, మా ఆవిడ పాపం నా గురకని ఎప్పుడూ అవమాన పరచలేదు. ఎంతో గౌరవం తనకి నేనన్నా, నా 'సౌండ్ స్లీప్' అన్నా. ఒకటే కోరిక కోరుకుంటుంది.

“స్వామీ,నీ కంటే నన్ను ముందు పడుకోనివ్వండీ" అని. అప్పుడు నా కళ్లముందు "మీ కంటే ముందు నన్ను పసుపు కుంకుమలతో కడతేరి పోనివ్వండి స్వామీ" అని బడిపంతులు సిన్మాలో గుండెని టచ్ చేసిన అంజలీదేవి కనపడుతుంది.. ఓసారి ఓ పిల్లకవి మా ఆవిడతో, ప్రాస కోసం ప్రయాస పడుతూ, “ఓ మహాసతి, శబ్దకాలుష్యం చేస్తున్నాడు నీ పతి. అర్ధమయిందమ్మా నీ అధోగతి. నీకిదే మా సింపతి" అన్నప్పుడు మా ఆవిడ అదే స్టయిల్లో "బోరింగ్ భర్త కన్నా స్నోరింగ్ భర్త మిన్న" అని, ఎదురుదెబ్బ కొట్టినప్పుడు, నాకెంత ఆనందమేసిందో. ఆ రాత్రి మరింత గురక పెట్టి నిద్రపోయాను.

నా గురక పర్వంలో ఒకటి, రెండు సంఘటనలు మీతో పంచుకోక తప్పదు. ఓసారి, ఇంగ్లాండ్ లో డాక్టర్ల Reunion సంబరాల్లో హోటల్ రూమ్ ను ఓ ఇఎన్టి (చెవి, ముక్కు, గొంతు) డాక్టర్ తో (Dr. Krishna Reddy) షేర్ చేసుకోవలసి వచ్చింది. ముందే చెప్పాను నా గురక గురించి, “భలే వాడివయ్యా, నేను గురకలకి ఆపరేషన్ చేసి, నయం చేసే స్పెషలిస్ట్ ని. నేను భయపడతానా? నీ గురక గురించి. ఏం ఫర్వాలేదు. కమ్మగా పడుకో. తనివి తీరా గురక పెట్టుకో". అని అభయం ఇచ్చాడు ఆ డాక్టరు గారు. తెల్లారగట్ల మెలకువ వచ్చి చూద్దును గదా. ఆ దృశ్యం వర్ణనాతీతం. నా గురకని వెంట్రుకలాగా తీసి పారేసిన ఆ గురక స్పెషలిస్ట్ చిన్న పిల్లాడిలాగా చెవులకి టవల్ చుట్టుకొని, టీవి మ్యూట్ లో పెట్టుకొని, మూలుగుతూ, తూలుతూ కనపడ్డాడు. నేను లేవడం చూసి, అమాంతంగా నా కాళ్ల మీద పడినంత పని చేసి మహాప్రభో, తప్పయిపోయింది. అజ్ఞానిని. మీ నిద్ర సంగీతం రాశిని, వాసిని తక్కువ అంచనా వేసిన నాసిగాడ్ని.

నాకు విముక్తి కలిగించి, కనీసం ఓ గంటన్నా నిద్రపోయే భాగ్యం కలిగించు స్వామీ" అంటూ వాపోయాడు, మర్నాడు ఎవరో చెప్పారు. మూడు రోజులు వుంటానని వచ్చిన ఆ డాక్టరు అన్న, వంట్లో బాగాలేదని ఆ రోజే వెళ్లిపోయాడని. ఈ మధ్యే తెలిసింది. ఆ అన్న ఇప్పుడు గురక వైద్యం మానేసి, నెల్లూరులో సేద్యం చేసుకుంటున్నాడని. నా కెరీర్ తో పాటే, నా గురక కూడా అంచెలంచెలుగా మోనో స్టేటస్ నుంచి స్టీరియో లెవల్ కి, సినిమా సౌండ్ కి ఎదిగి, స్వర రోగ గంగా ప్రవాహం లాగా, ఓ గుర్తింపును సంపాదించుకుంది. ఓసారి వైజాగ్ నుంచి వస్తున్నాం రైల్లో నా అసిస్టెంటు డాక్టరూ, నేను. ఓ (అ)సహ(న) ప్రయాణీకుడు చాలా సార్లు లేపాడు నన్ను 'గురక ఆపండీ' అంటూ. 'గాలి తీసుకోవడం ఆపండి' అన్నంత ముద్దుగా. 'నా వల్ల కాదు' అని నేనూ, 'నేను ఏం పాపం చేశానని' తనూ, రాత్రంతా పోట్లాడుకున్తూనే వున్నాం. హైదరాబాద్ వచ్చింది. మా వాడి ఒక బూట్ కనపడ్డం లేదు. కంపార్ట్ మెంట్ అంతా వెదికాడు. ఇదంతా చూస్తున్న ఆ గురక శత్రువు చిద్విలాసంగా 'నీదా ఆ బూటు మీ గురువుగారి దనుకొని కసిగా తన్ని తగలేసాను. కక్కసులో ఉంది తెచ్చుకో ఫో' అని అక్కసు అంతా వెళ్లకక్కాడు. ఆ తర్వాత నుంచి నేను రైళ్లలో ప్రయాణించడం మానేశాను, ఒకవేళ తప్పనిసరయితే , బూట్లు కాలికి గట్టిగా కట్టుకొని మరీ పడుకుంటాను. నా అసిస్టెంట్లు 'వేరే బోగీలో వస్తాం సార్' అని తప్పుకుంటుంటారు. ఇన్ని కష్టాలెందుకులే అని, ఈ మధ్యే ధైర్యం చేసి ఆపరేషన్ చేయించుకున్నాను.

భయం ఎందుకంటారా? ఆపరేషన్ సూపర్ సక్సేన్ అయి, గురకతో పాటు, గొంతు కూడా. కాకపొతే అలా జరిగితే, నా బంధు మిత్రులంతా పండగ చేసుకుంటారేమోనని నా అనుమానం. ఇంతకీ ఆపరేషన్ తర్వాత ఏమయిందని మీరందరూ టెన్షన్ లో వున్నారు కదూ! నా గొంతు పోలేదు. నా అదృష్టం. గురక ఆరు స్పీకర్ల నుంచి నాలుగు స్పీకర్లకు తగ్గిందని quality లో ఒకింత మార్పు వచ్చి సూపర్ ఫాస్ట్ రైలు, గూడ్సు బండిలాగా, గరీబ్ రథ్లాగా మారిందని మా ఆవిడ అభిప్రాయం.

పాప, నా శ్రేయోభిలాషులంతా తమ వంతు సాయం చేస్తుంటారు. నా నోరు మూయించడానికి కనీసం రాత్రిపూటయినా, ఈ మధ్యే, చుక్కపల్లి సురేష్ సింగపూర్ నుంచి ముక్కుకి వేసుకునే క్లిప్స్ లాంటివి తెచ్చాడు. చాక్లెట్లు, బిస్కట్లు లాంటివి తేకుండా. కానీ, ఏదో వాళ్ల తాపత్రయమే కానీ, నా స్వర పేటికా వీణ మూగబోదని, రానున్న కాలంలో మీదపడే వయసు ప్రభావంతో మరిన్ని కొంగొత్త రాగాలని పలికిస్తూ, నా దగ్గరి వారిని, దూరంగా వున్న వారిని సమంగా అలరిస్తూనే వుంటుందని నాకు మటుకు తెలుసు.

ఎవరో అన్నారు "To eat is human – To digest is divine” అలానే "To sleep is human – To snore is divine”. “నిద్ర పోవడం మానవ సహజం. కానీ, గురక పెట్టడం దైవాంశ సంభూతం.”