మీ కోసం మీరు బ్రతికి ఎన్నాళ్ళయింది?

ఈ మధ్య బాపట్ల వెళ్ళాల్సివచ్చింది. ముందురోజు మధ్యాహ్నం హాస్పిటల్ పని పూర్తి చేసుకుని, ప్లైట్ లో విజయవాడ చేరుకున్నాను సాయంత్రం నాలుగు గంటలకల్లా, మామూలుగా అయితే, రాత్రే రైలెక్కి ఉదయానికి బాపట్ల చేరుకోవచ్చు, కానీ, పని ఒత్తిడి ఎక్కువైనపుడల్లా - నా మనసు రిలాక్స్ అవ్వడానికి దారులు వెతుకుతుంటుంది. ఆ ప్రయత్నంలో భాగమే ముందు రోజు విజయవాడలో మజిలీ. విజయవాడ లో చాలామంది స్నేహితులున్నారు. కానీ నా ప్లాన్ ప్రకారం ఎవ్వరినీ కలవలేదు. ఎందుకంటే, ఈ సాయంత్రమంతా, నాకిష్టమొచ్చిన రీతిలో గడిపి, ఆనందాన్ని జుర్రుకుందామని. మొదటి స్టాప్... రాధారామన్ అనే ఓ పాత పేషెంటు ఇంటికి, రాధారామన్ కి 50 ఏళ్ళుంటాయి. నాలుగేళ్ళ కింద పరిచయం.

తనకి Rheumatoid arthritis అనే కీళ్ళ జబ్బు వల్ల, అన్ని జాయింట్స్ పాడయిపోయి, వీల్ చెయిర్ లో వచ్చాడు నా దగ్గరికి. రెండు మోకాళ్ళు, రెండు హిప్ జాయింట్స్, మొత్తం నాలుగు జాయింట్లు మార్చి తనని మళ్ళీ నడిపించగలగడంనాకు ఎంతో ఆనందాన్నిచ్చిన విషయం. రాధారామన్ తిరిగి నడవడంలో నా పాత్ర కొంతే. తన అద్భుతమైన పాజిటివ్ ఆటిట్యూడ్ వల్లే తను తొందరగా నడవగలిగాడని నా గట్టి నమ్మకం. రాధారామన్ ని కలిసినపుడల్లా, ఎన్ని కష్టాలున్నా, మనిషి ఎంత ఆత్మ స్థయిర్యంతో ముందుకు నడవచ్చో అర్ధమవుతుంది.

ఆ సాయంత్రం తనతో ఓ అరగంట గడిపి, బోలెడంత సంతోషాన్ని, సంతృప్తినీ మూట గట్టుకుని బయటపడ్డాను. దారిలో రోడ్డు పక్కన బండి నుంచి, ఉడకబెట్టిన శెనక్కాయలు కొనుక్కున్నాను. శెనక్కాయలు తింటూ ఎన్ని రోజులైనా బ్రతికేయగలను. అంతిష్టం. తర్వాత టీవీలో, క్రికెట్ హైలెట్స్ చూస్తూ గడిపేశాను. ఆ తర్వాత ఐపాడ్ లో పాటలు వింటూ నిద్రలోకి జారుకున్నాను - ఓ గంటపాటు. రాత్రి అయింది. ఆకలేస్తోంది, నాకు స్టార్ హోటల్స్ లో భోజనం కన్నా, చిన్న చిన్న మెస్సుల్లో భోజనం చాలా ఇష్టం. వెదికి వెదికి ఓ స్టూడెంట్స్ మెస్ పట్టుకున్నాను. అరటి ఆకులో వేడి వేడి భోజనం, కారంపొడి, నెయ్యి, అదిరిపోయే గోంగూర పచ్చడి, ఇంగువ ఘుమఘుమలతో సాంబారు, తియ్యని గడ్డ పెరుగు. ఇవన్నీ చాలదన్నల్టు, చివర్లో మైసూరుపాకు. అన్నీ శుభ్రంగా పట్టించి, పొట్ట నిమురుకుంటూ మళ్ళీ రోడెక్కాను.

తర్వాత మజిలీ సిన్మా.... 'మీ శ్రేయోభిలాషి', రాజేంద్రప్రసాద్ అద్భుతంగా నటించాడు. కథ కూడా వైవిధ్యంగా వుంది. “జీవితం విలువైందని, చిన్న చిన్న కష్టాలు వస్తుంటాయి - ప్రాణం పోగొట్టుకుంటే మళ్ళీ రాదు జీవితం జీవించడానికే" అని కథ. సుత్తి డాన్సులు, ఫైట్లు లేకుండా, చక్కగా నచ్చే రీతిలో వుంది సినిమా. ఇంటర్వల్ లో చిన్న సమోసాలు, టీ. ఈ బుల్లి సమోసాలు సినిమా హాల్లోనే దొరుకుతాయి. పెద్ద సమోసాల కంటే చాలా బాగుంటాయి. ఇవన్నీ కాలేజీ రోజుల్లో కనుక్కున్న విషయాలు. గుంటూరు ప్రయాణం కార్లో. మళ్ళీ ఐపాడ్ లో పాటలు వింటూ, సూర్యోదయంలో చుట్టు ప్రక్కల ప్రకృతి అందాలు అనుభవిస్తూ, మరో లోకంలోకి వెళ్ళిపోయాను.

నా ఐపాడ్ లో, ఇలాంటి అందమైన ఉదయానికి, మరింత మకరందం అద్దడానికి, కొన్ని పాటలుంటాయి. “ఈ ఉదయం, నా హృదయం పురులు విరిసి ఆడింది, పులకరించి పాడింది"అని, “నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో" అని ఘంటసాల కాసేపూ, “పగలే వెన్నెల, జగమే ఊయల" అని జానకి కాసేపూ, “తోలి సంధ్యకు తూరుపు ఎరుపు, మలి సంధ్యకు పడమర ఎరుపు" అని ఎస్పి కాసేపు, నాకోసం పాడారు. ఆ ఉదయం కనులవిందు, వీనులవిందు. మనసంతా విందు విందు. తర్వాత ఇంకో ఇష్టమయిన మజిలీ. చెప్పానుగా ముందే. ఈ ట్రిప్ లో, ఇష్టమైనవన్నీ సమకూర్చుకుని, రిలాక్స్ అవ్వడమే ప్లాన్ అని. మా అమ్మ చేసి పెట్టిన వేడి వేడి పూరీలు, బంగాళదుంప కూర, “ఇంకోటి తిను నాన్నా" అని అమ్మచేసే గారాబంతో కలుపుకుని తినడం.

ఈ ప్రయాణంలో పొందిన సంతోషాల పరాకాష్ట. అలా, ఆ కొద్ది సమయంలో నాకోసం నేను బ్రతికేసి, బ్యాటరీస్ రీచార్జ్ చేసుకుని, హైదరాబాద్ చేరుకున్నాను. ఇంకో నెల రోజులకి సరిపోతుందీ ఆనందం. చాలామంది అనుకుంటుంటారు - ఆనందం అనేది ఓ గమ్యం, ఓ ఎండ్ పాయింట్ అని. నా ఉద్దేశం ఆనందం అనేది ఓ ప్రయాణం. బ్రతుకుతూనే, ప్రతి మలుపులో ఆనందపు గడియల్ని దొంగిలించాలి. మనం సంతోషంగా ఉండడానికి ఏవో కొన్ని వస్తువులు, సౌకార్యాలు కావాలనుకుంటాం. మళ్ళీ పరుగు మొదలు. ఇదొక అంతంలేని విషాదకర పయనం. ఈ విషాదంలో ఇరుక్కుపోయిన దురదృష్టవంతులెంతమందో. వీళ్ళకు సంతోషం అనేది మిథ్యే.

“మా బాగా క్లాస్ పీకావు బ్రదర్ - నీకు అన్నీ అమర్చాడు దేవుడు. పొట్ట నిండాక, మేం కూడా సంతోషంగా ఉంటాం నువ్వు చెప్పనక్కర్లేదు" అని మీలో కొంతమంది అనుకుంటుండవచ్చు. అలా అనుకోవడం మీ ఇష్టం. కానీ జేబులో కానీ లేక, రోజూ అప్పులు చేసిన పూనా రోజులు, రాత్రింబవళ్ళు గాడిదలాగా పనిచేసి, బాస్ ఎక్కడ తిడతాడోనని భయపడుతూ బ్రతికిన ఆ పూనా రోజులే, నా జీవితంలో తెగ ఆనందించిన రోజులంటే నమ్ముతారా!! పెద్దోళ్ళు ఎపుడో చెప్పారు. దారిలో ఆగి, కాస్త పక్కనున్న పూలని పరామర్శించి, వాటి పరిమళాన్ని నీతో తీసుకెళ్ళమని - చిన్న చిన్న ఆనందాలే, మానసికోల్లాసాన్ని కలిగిస్తాయి.

అందుకే అపుడపుడు, పరుగు ఆపి, మీ కోసం మీరు బ్రతకండి. ఓ మంచి హాస్య రచన చదివినపుడు మనసారా హాయిగా నవ్వండి. దుఖం కలిగినపుడు, మనసారా ఏడ్చి గుండె బరువు దించుకోండి. మంచి పాట వింటున్నప్పుడు, మీరు కూడా గొంతెత్తి గానం చేయండి - నాట్యం చేయండి. ఓ రోజు ఆఫీస్ పని తొందరగా ముగించి, మీ అభిమాన హీరో సినిమాకు వెళ్ళిపొండి. ఓ ఆదివారం, ఆటక మీద పడేసిన పాత క్యాసెట్స్ తీసి మీకు నచ్చిన పాట వినండి. దుమ్ము కొట్టుకుపోయిన ఆల్బమ్స్ తీసి, పాత ఫోటోలు చూడండి. అలా అంతులేని ఆనందాన్ని గురించి ఓ కవి ఏమన్నాడో తెలుసా -

“ఒక్క మనోహర దృశ్యమ్మును వీక్షించినపుడు-

ఒక్క శ్రావ్య సంగీత ధ్వని వీనుల దాకినపుడు,

ఒక్క అనురాగ పులకింత చూపు గుండె మీటినపుడు,

ఒక్క ప్రగాఢ సత్యమ్మును ఊహ సేయుచున్నపుడు-

నా లోపల ఒక ఆనంద తరంగమ్మెగసి పడును

నా లోపల ఒక నిశ్శబ్ద మురళి రవళించును

నాలో ఒక సుప్త సప్త వర్ణ ధనువు మేల్కాంచును" అని.