సతీష్ కుట్టి

జీవితంలో స్థిరపడ్డానికి దోహదం చేసిన వాళ్ళలో ముఖ్యులు ఈ అయిదుగురు. నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది, ఆత్మ విశ్వాసాన్ని అందించిన ప్రసాద్ మాష్టార్ ఒకరు - పీజీ సీటిచ్చి, కెరీర్ లో మొదటి మెట్టేక్కిచ్చిన సంచేటీ సర్ ఒక్కరు, ఇంగ్లాండ్ లో ఉద్యోగం ఇప్పించి, మరో పది మెట్లు ఎక్కించిన సతీష్ కుట్టి ఒకడు -

హైదరాబాద్ తిరిగి వచ్చానాక ప్రాక్టీస్ లో స్థిరపడ్డానికి ఎంతో సహాయం చేసిన డాక్టర్ యస్.యస్.రెడ్డి గారొకరు. మొదటి రోజుల్లోనే నా expertise ని పదింతలుగా ప్రచారం చేసి, ఓ VVIP నాతో operate ని చేయించుకునేట్లు చేసి, నా career కి fast forward బటన్ నొక్కిన కాసు ప్రసాద్ రెడ్డి ఇంకోక్కరు. సతీష్ కుట్టితో పరిచయం పూనాలో. తను నాకంటే వయసులో చిన్న. కానీ, చదువులో ముందు. తను యంఎస్ లో గోల్డ్ మెడలిస్ట్. ఆ తెలివితేటలు చూసి, మా బాస్ సంచేటి, వెంటనే కన్సల్టెంట్ ఉద్యోగం ఇచ్చాడు.

నాకు, మిగిలిన సీనియర్ బాస్ ల దగ్గర పనిచేసే అవకాశం ఉన్నా, ఎందుకో తెలీదు, కుట్టికి అసిస్టెంటుగా ఉండిపోయాను. వెనక్కి తిరిగి చూసుకుంటే, అది ఎంత మంచి నిర్ణయమో అనిపిస్తుంది. సతీష్ చాలా సౌమ్యుడు. సున్నిత మనస్తత్వం అతనిది. తన పనిలో ఎవన్నా తప్పులు జరిగినా, పెద్ద బాస్ మందలించినా, చాలా ఫీలయ్యేవాడు. అలాంటి విషయాల్లో మనం కొంచెం ముదురు కదా!

అందుకే సతీష్ దిగులుగా వున్నప్పుడల్లా "లైట్ తీస్కో బ్రదర్" అని బోధ చేస్తూ, తనని ఉత్సాహపూరితుడ్ని చేస్తుండే వాడిని. అలా, ఆపరేషన్ థియేటర్ లో తను నాకు గురువుగా, లైఫ్ థియేటర్ లో నేను తనకు గురువుగా, మా ఇద్దరి మధ్య అనుబంధం పెరిగింది. రెండేళ్ళ తరువాత సతీష్ ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు.

వీడ్కోలు సమయంలో "గురువా! నువ్విచ్చిన ఎమోషనల్ సపోర్ట్ మరువలేనిది. నీ మేలు తీర్చుకోవాలంటే నిన్ను కూడా ఇంగ్లాండ్ తీసుకెళ్లాలి. రెడీగా వుండు" అన్న సతీష్ మాటలు నేను పెద్దగా పట్టించుకోలేదు. ఓ ఏడాది గడిచిపోయింది. బ్యాంక్ లోను తీసుకుని గుంటూరులో ప్రాక్టీస్ పెడదామనే ప్రయత్నాల్లో మునిగిపోయాను. ఓ రోజు ఇంగ్లాండ్ నుంచి ఓ బరువైన ఉత్తరం వచ్చింది. 'ఏమిటా' అని చూద్దును కదా -

అది - డాక్టర్ ముఖర్జీ అని యార్క్ షైర్ పనిచేసే ఓ కన్సల్టెంట్ రాసిన ఉత్తరం. సారాంశం "సతీష్ కుట్టీ మొన్నటి దాకా నా దగ్గర పని చేశాడు. తన తర్వాత, తన ఉద్యోగానికి నిన్ను రికమెండ్ చేశాడు. జియంసి కాగితాలు పంపుతున్నాను. ఇంకో నెల రోజుల్లో ఇక్కడ చేరాలి నువ్వు" అని. కలా, నిజమా అర్ధం కాలేదు. అప్పటికే మా హాస్పిటల్ లో, నాకంటే సీనియర్స్, బోల్డంత అనుభవం ఉన్నవాళ్ళు చాలామంది ఇంగ్లాండ్ లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరినీ కాదని, నాకు ఉద్యోగం, అందునా రిజిస్ట్రార్ ఉద్యోగం రావడం చెప్పలేనంత సంభ్రమాశ్చర్యాల్ని కలిగించింది.

ఇదంతా సతీష్ పుణ్యం కాక ఇంకేమిటి? అంతే - ఫాస్ట్ ఫార్వర్డ్ నొక్కినట్లు - నా జీవితం ఓ అద్భుతమైన మలుపు తిరిగి, నెల రోజుల్లో, లండన్ హీత్రు ఎయిర్ పోర్టులో దిగిపోయాను. స్కూటర్, ఫ్రీజ్ అమ్మేసి విమానం టిక్కెట్టు కొనుకున్నాను. యంబిబిఎస్ అయిన దగ్గర నుంచీ, అమ్మ నాన్నల దగ్గర, అత్తమామల దగ్గర చేయి చాపకుండా, స్నేహితుల వద్ద మాత్రమే అప్పుడప్పుడు అప్పులు చేస్తూ బ్రతకాలని తీసుకున్న సిన్మా నిర్ణయం వలన, ఇవి అమ్మాల్సి వచ్చింది. కరెక్టుగా టిక్కెట్టుకు సరిపోయాయి.

జేబులో నిజంగా ఒక్క పైసా (పెన్నీ) లేకుండా, లండన్ లో దిగిపోయాను. మొదటిసారి విమాన ప్రయాణం, అందునా లండన్ కి చాలా ఆనందంగా, గర్వంగా అనిపించింది. బారిష్టర్ పార్వతీశం స్టైల్ లో, పెద్ద భంగపాట్లేవీ పడకుండానే చేరాను. మూడు గంటల బస్ ప్రయాణం చేసి, వచ్చి సతీష్ నన్ను రిసీవ్ చేసుకున్నాడు. “నువ్వే బస్ ఎక్కిరా" అని చెప్పవచ్చు. కానీ నేను ఎక్కడ ఇబ్బంది పడతానో అని, తనే రావడం, తన ఆత్మీయతకి, అభిమానానికి నిదర్శనాలు. నన్ను తన రూం లో పెట్టుకుని వంట వండి పెట్టాడు -

ఓ పదిరోజుల పాటు. బ్యాంక్ లో డబ్బులు వేసి, జియంసి ఫీజ్ తనే కట్టాడు అప్పటికే. కొత్త ఉద్యోగం, కొత్త ఆపరేషన్లతో నేనెక్కడ తికమక పడతానోనని ఓ వంద పేజీల నోట్సు రాసి ఇచ్చాడు - ఏ ఆపరేషన్ లో ఎలా చేయాలి, తోటివారితో ఎలా మెలగాలి, బాసుల్ని ఎలా సంబోధించాలీ, స్టడీలీవ్ ఎప్పుడు తీసుకోవాలి లాంటి అన్ని విషయాలూ - ఆ నోట్స్ లో విపులంగా రాసిచ్చాడు. ఇంతగా సొంత అన్నదమ్ముళ్ళు కూడా చేయరేమో. ఆ క్షణంలో, సతీష్ నాకు దేవుడు పంపిన దూతలాగే అగుపించాడు.

నన్ను, నా ఉద్యోగంలో సెటిల్ అయ్యేట్లు చేశాకనే తను కొత్త ఉద్యోగానికి లివర్పూల్ వెళ్ళాడు. ఆ రోజు నా కళ్ళనీళ్ళు ఆగలేదు. ఈ మనిషికి నేనే రకంగా ఋణం తీర్చుకోగలను అన్న భావం. గొంతులో ముద్దగా మారి మాట కరువైంది ఆ క్షణాన. ప్రతిరోజూ సతీష్ కి ఫోను చేసి వేధించే వాడిని. ఆపరేషన్ల గురించే కాదు - అన్నింటి గురించీ సలహాలు అడుగుతుండే వాడిని. పాపం, ఎపుడూ విసుక్కో కుండా సహాయం చేసేవాడు. తన సహాయం అక్కడితో ఆగలేదు.

ఆ తర్వాత రెండేళ్ళకు, రివర్ పూల్ లో యం, సిహెచ్ Super Speciality డిగ్రీ రావడం కూడా తను పెట్టిన భిక్షే, మళ్ళీ లివర్ పూల్ లో, కూడా అదే రేంజ్ లో సహాయ సహకారాలు. ఇల్లు చూసిపెట్టాడు, ఆదర్శ్ కి స్కూల్ చూసిపెట్టాడు - ఇలాంటివి ఇంకా ఎన్నో. సతీష్ పుణ్యమా అని, నాక్కూడా ఓ మంచి అలవాటు అబ్బింది. నన్ను సతీష్ చూసుకున్నట్లు, నేను నా తర్వాత వచ్చిన మనోళ్ళని చూసుకునే వాడ్ని. చాలామంది, ముక్కు మొహం తెలీని వాళ్ళు కూడా, లండన్ లో దిగగానే ఫోన్ చేసేవాళ్ళు.

నాకు చేతనయినంత సహాయం చేసి, దేవుడి దగ్గర మంచి మార్కులు కొట్టేస్తుండే వాడిని. అలా పదేళ్ళు, సతీష్ ఆదరణలో నా ఇంగ్లాండ్ జీవితం అద్భుతంగా గడిచిపోయింది. నా య.సి హెచ్ థిసీస్, సతీష్ కు అంకితం చేసి, నా కృతజ్ఞతని వెల్లడించుకున్నాను. అంతకంటే చేయగలిగింది ఏముంది నా దగ్గర. సతీష్ లేకుంటే, నా జీవన పథంలో ఇన్ని మెట్లు ఎక్కగలిగే వాడినా?

ఈ రోజు నేనీ మాత్రం స్థిరపడ్డానంటే, ప్రతి గెలుపు వెనకా, సతీష్ హస్తం వుంది. ఫలాపేక్ష లేకుండా, ప్రక్క వాడికి చాతనయినంత సహాయం చేసే ఇలాంటి అమృత మూర్తుల వల్లే, ప్రపంచం ఇంకా బ్రతికుంది. సతీష్, 17 ఏళ్ళ కింద ఇచ్చిన సలహాల నోట్ బుక్ ఇంకా ఉంది నా దగ్గర భద్రంగా. ఎపుదయినా స్వార్ధపు దయ్యం నాట్యం చేయడం మొదలెట్టినపుడు 'పక్కవాడితో మనకు పనేంటి" అనే భావ భూతం, నా మనసులో తొంగిచూసినపుడు- వెంటనే పరుగు పరుగున వెళ్ళి ఆ పుస్తకాన్ని తెరచి చూసుకుంటాను. మనసు నిర్మలంగా మారిపోతుంది.