దుబాయ్ శీను

ఇటీవల దుబాయ్ వెళ్ళాను. పెద్ద తమ్ముడుంటాడు అక్కడ. వాడు బిజినెస్, వాళ్ళావిడ ఇంజనీరు. గత పదేళ్ళ నుంచి వాళ్ళ మకాం దుబాయ్ లోనే. మీరు ఒక్కసారి వరల్డ్ మ్యాప్ చూడండి. మన దేశంతో పోలిస్తే దుబాయ్ ఎంత చిన్న దేశమో అర్ధమవుతుంది. మన దేశం అరచేయి అయితే, దుబాయ్ చిటికిన వేలి గోరంత. ఊరదే, రాజధాని అదే, దేశం అదే, సింగపూర్ లాగా, పిట్ట కొంచెం - కూత ఘనం లాగా దేశం ఎంత చిన్నదయినా, దాని సీను చూస్తే ఆశ్చర్యం వేయక మానదు.

అరేబియన్ గల్ఫ్ సముద్రంలో దుబాయ్ అనేది బుల్లి దేశం, మరికొన్ని దేశాలు కలిపి 'యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్' (యుఎఇ) గా 1971 లో అవతరించాయి. ఇవి మొత్తం ఏడు దేశాలు. 1. అబుదాబి (రాజధాని), 2. దుబాయ్ 3. అజ్మాన్ 4. పుజైరా 5. షార్జా 6. ఉమ్మాల్ కైవైమ్ 7. రసాల - కైమాల్ వీటిలో మనకు షార్జా బాగా తెలుసు. క్రికెట్ పిచ్చోళ్ళందరికీ గతంలో, షార్జాలో పాకిస్తాన్ కి, మన దేశానికి జరిగిన మ్యాచ్ లన్నీ గుర్తుండుంటాయి.

దుబాయ్ అంతకంటే ఎక్కువ పరిచయమే. దావూద్ భయ్యా, బంగారం కోట్లు, మొన్నటికి మొన్న రవితేజ 'దుబాయ్ శీను', ఇవన్నీ దుబాయ్ బోల్డంత పేరు తెచ్చిన విషయాలు. ఈ బుల్లి దేశానికి ఇంత ప్రాముఖ్యత ఎలా వచ్చిందటారా? తంతే గారెల బుట్టలో పడ్డట్లు, వీళ్ళు 'తవ్వితే నూనె తట్టలో' పడిపోయారు. కరెక్టుగా యాభై ఏళ్ళ క్రితం ఇక్కడ ఆయిల్ పడింది. అంతకు ముందు దాకా, గొర్రెలు, మేకలు కసుకునే ఈ షేకులు, ఆ దెబ్బతో మనందరికి షేకిచ్చి, సుల్తానులయిపోయారు.

ఇప్పుడు దుబాయ్ ని చూస్తే, “సొగసు చూడ తరమా" అని పాడుకోవాల్సిందే. 1968 దాకా ఈ పిల్ల దేశాలన్నింటికీ తెల్లదొర, తన కబ్జాలో ఉంచుకున్నాడు. “ఆ! ఈ పిల్ల కా(షే)కుల్ని ఎన్నాళ్ళు పోషించడం. మనకేం గిట్టుబాటు కావడం లేదు" అనుకుని (బ్రిటిషు వాళ్ళు, ఈ దీవుల్ని) వదిలేశారు. ఆ తర్వాత రెండేళ్ళకే ఆయిల్ దొరికింది. పాపం, దొరకి సుడిలేకపోవడమంటే ఇదే. దుబాయ్ లో ఎండ గాని, దుమ్ము గాని, జనం కాని అచ్చం మన హైదరాబాద్ లాగానే ఉంటుంది. తేడా అల్లా - రోడ్లు బాగుంటాయి.

అపుడప్పుడూ తెల్ల డ్రెస్సుల్లో 'షేకిన్లు' కనపడ్తుంటారు. పట్టుమని పన్నెండు లక్షలున్న జనాభాలో 80 శాతం పైగా, మనూరోళ్లే. వీళ్ళని ఎక్స్ పాట్రేయిట్స్ అంటారు. రోడ్లు వేయా లన్నా, గుంట తవ్వాలన్నా, కారు రిపేరు చేయాలన్నా, కూరగాయలు అమ్మా లన్నా, బ్యాంకులో డబ్బులేయ్యాలన్నా, కంప్యూటర్ నడిపించాలన్నా, హోటల్ తిండి పెట్టాలన్నా - మనోళ్ళే. అసలా మాటకొస్తే. మనోళ్ళందరూ మానేస్తే, ఒక్కగంట గడవదు దుబాయ్ లో. గమ్మత్తేమిటంటే మనోళ్ళని, ఒక్కలెవల్ వరకే రానిస్తారు. పెద్ద పెద్ద పోస్టులన్నీ లోకల్స్ కే.

మనోళ్ళు చాలా మంది, బిజినెస్ లు పెట్టి కోట్లు సంపాదించారు. కానీ బిజినెస్ ఖచ్చితంగా ఓ లోకల్ పేరు మీదే పెట్టాలి. లేకపోతే లైసెన్స్ ఇవ్వరు (ఫ్రీ జోన్స్ లో తప్ప). దుబాయ్ ని వంశ పారంపర్య హక్కులున్న రాజులు పరిపాలిస్తారు. దుబాయ్ మనలాగా ప్రజాస్వామ్య దేశం కాదు. అందుకే బ్రతికి పోయింది. లేకపోతే ఒక ముందడుగు, నాలుగు వెనకడుగులు.అంటే, అచ్చం మనలాగే ఉండిపోయేది. దుబాయ్ లో ఇన్ కంటాక్స్ లేదు. వీళ్ళ కరెన్సీ 'దిర్హాన్' మన పదకొండు రూపాయలకు సమానం. దుబాయ్ గత పదేళ్ళలో సాధించిన ప్రగతి అమోఘం అనితర సాధ్యం.

వాళ్ళకి ప్రకృతి వనరులు (ఆయిల్ తప్ప), మానవ వనరులు (హ్యుమన్ రీసోర్సెస్) రెండూ లేవు. కానీ, రాజులు తెలివిగా బోల్డన్ని సదుపాయాలు, రాయితీలు కల్పించి ప్రపంచ నలు మూలల నుంచి పెద్ద పెద్ద కంపెనీలు అక్కడికి వచ్చేట్లు చేశారు. ఉదాహరణకు 'దుబాయ్ ఇంటర్నెట్ సిటీ' లో 850 పైగా కంపెనీలు బయటనుంచి వచ్చి కోట్లు తెరిచాయి. అలానే 'దుబాయ్ మీడియా సిటీ', 'దుబాయ్ నాలెడ్జ్ సిటీ', దుబాయ్ హెల్త్ సిటీ ఇలా రకరకాల ఫ్రీ జోన్స్ ని ప్రోత్సహించి, ప్రపంచమంతా ఏ పని కావాలన్నా, దుబాయ్ కి చేరిపోయేట్లు చేశారు. దుబాయ్ సముద్ర తీరంలో 'ప్రపంచ 8వ వింత' కి రూపకల్పన జరుగుతోంది.

సముద్రంలోం ఈతచెట్టు (పామ్ ట్రీ) ఆకృతిలో, మూడు మ్యాన్ మేడ్ ఐస్లాండ్స్ తయారవుతున్నాయి. ఆరు కిలోమీటర్లు పొడవు, ఆరు కిలోమీటర్లు వెడల్పు, ఉన్న ఈ ద్వీపానికి అవసరమయిన ఇసుక, రాళ్ళు, 85 మిలియన్ క్యూబిక్ టన్నులు.ఒక్కో ద్వీపంలో, 3,000 ఇళ్ళు, నలభై 5 స్టార్ హోటల్స్ ఉంటాయి. ఊహకందని అద్భుతాలంటే ఇవే. ఇది చాలదన్నట్లు, మరో కొత్త ప్రాజెక్టు మొదలెట్టారు. అదే సముద్రంలో, పామ్ ట్రీ కి పక్కనే, ప్రపంచ పటం షేపులో, 'ది వరల్డ్' అని 300 ద్వీపాల నిర్మాణం.

ప్రపంచంలో ఉన్న చాలా మంది, ఇప్పుడు అక్కడే ఇండ్లు బుక్ చేసుకున్నారట. “లైవ్ లైఫ్ కింగ్ సైజ్' అన్న నానుడి వినే వుంటారు. దుబాయ్ లో అది అక్షరాల నిజం. “ప్రపంచంలో నంబర్ వన్ అనేవి అన్నీ మా ఊళ్ళో ఉండాల్సిందే" అంటారు. దుబాయ్ రాజులు. ఆ దిశలోనే "బర్జ్ దుబాయ్" అనే బిల్డింగ్ నిర్మాణం జరుగుతోంది. 2009లో ఈ కట్టడానికి, “ప్రపంచంలో కెల్లా ఎత్తైన భవనం" అనే కిరీటం లభించనుంది.

అలానే ప్రపంచంలో కెల్లా పెద్దదైన షాపింగ్ మాల్" కి, 'గోల్ఫ్ కోర్స్' కి, 'అమ్యూజ్ మెంట్ పార్కు' కి అంకురార్పణ జరిగింది. దుబాయ్ అంటే మనందరికీ గుర్తొచ్చేది - షాపింగ్. నిజమే. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ కి కొన్ని మిలియన్ల పర్యాటకులు వస్తారు ప్రతి సంవత్సరం. ఒక్క దుబాయ్ లోనే 414 హోటల్స్ ఉన్నాయి. పోయిన సంవత్సరం ఈ హోటల్స్ లో 65 లక్షల మంది టూరిస్టులు బస చేశారు. దుబాయ్ బంగారం మార్కెట్టు చూడాల్సిందే! కృష్ణ దేవరాయల రోజుల్లో బంగారం కుప్పలుగా పోసి, రోడ్ల మీద అమ్మేవారట.

అది నిజమో, కాదో కానీ, దుబాయ్ లోమట్టుకు బంగారు నగలు కుప్పలు కుప్పలుగా పడి వుంటాయి. నెక్లెస్ లు, మొలతాడు సైజు నుంచి ఉరితాడు సైజు దాకా రకరకాల నగిషీలతో ప్రత్యక్షం. “డిసెర్ట్ సఫారి - చాలా మంది టూరిస్టులకి ఇష్టమైన, ఇంకో సొగసు. సాయంకాలం సంధ్యా సమయంలో, ఫోర్ వీల్ డ్రైవ్ జీపుల్లో ఎడారిలో, క్రింద పడిపోయే ఫీలింగ్ వచ్చేట్లు తిప్పుతారు. ఆ తర్వాత నక్షత్రాల సాక్షిగా విందు భోజనం గుడారాల్లో. అరేబియన్ సంగీతం, అందమైన భామల బెల్లీ డాన్సులు కొసరు మురిపెం.

ఇప్పటిదాకా 'పిల్లలకు ఏమీ లేదు' ఎంజాయ్ చెయ్యడానికి అనే మాటుండేది. ఆ లోటును పూడ్చడానికి, 'దుబాయ్ లాండ్' అని అమెరికాలోని 'డిస్నీలాండ్' ని తలదన్నే పిల్లల పార్కు 2010 లో వచ్చేసింది. కాబట్టి, మీరందరూ పిల్లా, పాపలతో దుబాయ్ కి వెళ్ళి, ఆనందంగా సెలవులు గడిపి, నూతనోత్సాహంతో తిరిగి రావచ్చు. వచ్చేటప్పుడు నాకు ఓ బంగారపు గొలుసు తేవడం మర్చిపోవద్దే!