తెలుగువాడి తెగులు

ఇటీవల రవీంద్ర భారతిలో 'శ్రీనాధుడు' పద్య నాటకం చూడడం జరిగింది. నా ఆప్త మిత్రుడు డాక్టర్ గుమ్మడి గోపాలకృష్ణ ఈ నాటకాన్ని అనేక రకాల వ్యయ ప్రయాసాల కోర్చి ఏర్పాటుచేశాడు. కారణం - తెలుగు భాష మరిచిపోతున్న జనానికి, పద్య నాటకం సొగసులు చూపించడం! గుమ్మడి గోపాలకృష్ణ గారి పద్యాలు, నటన గుండెకి హత్తుకునేట్లు వున్నాయి. వక్తలందరూ తెలుగు భాష అంతరించి పోతోందనీ, మనమందరమూ నడుం కట్టాలని, చాలా బాధపడిపోయారు.

ఈ మధ్య ఏ తెలుగు సభకు వెళ్లినా, ఈ రకమైన వ్యధా పూరిత ప్రసంగాలు ఎక్కువ వినపడుతున్నాయి. ఎందుకా అని ఆలోచిస్తే, తెలుగు భాషాభిమానినైన నా మనసుకు చాలా ఆందోళనకరమైన సమాధానాలు దొరికాయి. ఏ సంస్కృతి అయినా, బ్రతికి బట్ట కట్టాలంటే, భాష మీద ప్రేమ బలంగా వుండాలి. మాతృ భాషని మరిచిపోతే, అమ్మని మరిచిపోయినట్లే. మన దేశంలో బోల్డన్ని భాషలున్నాయి. ఓ వందమైళ్లు ప్రయాణిస్తే భాష మారిపోతుంది. ఇంత భిన్నత్వంలో మన మందరం కలిసి వుండడమే గొప్పతనం.

ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో మాట్లాడే భాషల్లో తెలుగుకు ఆరవ స్థానం వుంది. దేశంలో రెండవ స్థానం. పేరు ప్రఖ్యాతుల్లో తెలుగువాళ్లు ఎవ్వరికీ తీసిపోరు. కాకుంటే భాషాభిమానంలో మనం వెనుక వరసలో వున్నామన్న నిజాన్ని అంగీకరించక తప్పదు. నేను పది ఏళ్లు ఇంగ్లాండ్ లో వున్నప్పుడు చాలా మంది వివిధ భాషస్థుల్ని కలిసాను. ప్రతి ఇంట్లో వాళ్ల మాతృభాషలోనే మాట్లాడుకునే వారు. మన వాళ్లు తప్ప.

మలయాళీలు, అరవ వాళ్లు, బెంగాలీలు, గుజరాతీలు ఇక మరీ గత్యంతరం లేదంటే తప్ప వారు వేరే భాషలో మాట్లాడేవారు కాదు. సభా మర్యాద ప్రకారం నల్గురు కలిసినప్పుడు అందరికీ అర్ధమయ్యే భాషలో మాట్లాడడమే సంస్కారం. ఊ ఇంగిత జ్ఞానాన్ని కూడా గాలికి వదిలేసి, భాషా దురభిమానిలాగా నీ మాతృ భాషలో మాట్లాడుకోమని నేననడం లేదు. కానీ మనవాళ్లు ఇద్దరూ కలిసినా ఇంగ్లిష్ లోనే మాట్లాడే వాళ్లు. ఇంట్లో పిల్లలతో ఇంగ్లీషే, ఇక పిల్లలకి తెలుగు ఎక్కడ వస్తుంది చెప్పండి.

తెలుగులో మాట్లాడడం నామోషీ అన్న భావం వుంటే, భాష ఎలా బ్రతుకుతుందో చెప్పండి. ఒక భాష జాతికి చెందిన ప్రజల్లో 30 శాతం మందికి తమ భాషను చదవడం, రాయడం రాకపోతే ఆ భాష అంతరించిపోయే ప్రమాదం వుందని ఐక్యరాజ్య సమితి విద్యాసాంస్కృతిక మండలి ప్రమాణాలు చెబుతున్నాయి. అంటే మన తెలుగు భాషకి రోజులు చెల్లినట్లే అనిపిస్తుంది. ఆ ఊహే ఎంతో బాధాకరంగా వుంది. జాతి గుండె చప్పుడు భాష, భాష ద్వారా జీవితాన్ని వెలికి తెచ్చేది సాహిత్యం.

సర్వాభరణ భూషిత అయిన తెలుగు సాహిత్య సరస్వతి పద్యంగా, గద్యంగా, కీర్తనగా, సంకీర్తనగా, ప్రబంధంగా, వచనంగా, అవధానంగా, ఆటగా, పాటగా వివిధ వర్ణాల అంబరాలు ధరించి విశ్వమంతా నిండిపోయింది. కానీ ఇంత మహోన్నతమైన తెలుగు సాహిత్యాన్ని ఎంత మంది ఆదరిస్తున్నారు. ఎంత మంది పుస్తకాలు కొంటున్నారు? చదువుతున్నారు> బెంగాల్ లో పుస్తక ప్రదర్శనల్లో, జనాన్ని అదుపు చేయడానికి లాఠీ చార్జి చేయవలసి వస్తుందట.

మన రాష్ట్రంలో ఈగలు, దోమలు తప్ప ఎవ్వరూ వుండరు. మంచి పుస్తకానికి, వండర రూపాయలు కన్నా ఎక్కువ పెట్టి కొనడానికి అల్లాడి పోతారు. అదే ఫైవ్ స్టార్ హోటల్ లో కాఫీకి 500 రూపాయలు ధార పోస్తారు. పిల్లలకు మనం ఇవ్వవలసింది మన ఆస్తిపాస్తులే కాదు. మన భాషా సంస్కారాలు కూడా. కానీ మన పిల్లలు విద్యా రంగంలో తెలుగు భాషకున్న (అ) గౌరవాన్ని గమనిస్తే బాధతప్ప ఏమీ మిగలదు. మొన్న మొన్నటి దాకా తెలుగు అసలేమీ చదవకుండా పాఠశాల విద్యనంతా పూర్తి చేయగల పరిస్థితి వుంది.

జి.ఓ.నెం 86/2003 ద్వారా పరిస్థితి కొంత మెరుగు పడొచ్చు అని ఆశించినా, తెలుగు భాషా బోధనకి అనుకున్నంత అండదండలు కోరక లేదన్నది నిజం. మన పక్కింటి తమిళుల్ని చూసి మనం చాలా నేర్చుకోవాలి. చెన్నయ్ లో ఎక్కడయినా ముందు తమిళ్ రాసి వుంటుంది బోర్డుల మీద. తర్వాత కొన్ని చోట్ల మాత్రమే ఇంగ్లిష్వుంటుంది. మనోళ్ళు, హైదరాబాద్ లో తెలుగులో మాట్లాడితే,షాపువాడు వెంటనే హిందీలో సమాధానమిస్తాడు. తెలుగుదేశం రాజధానిలో తెలుగుతో పనులు జరగని మన అధోగతిని ఎవరు మారుస్తారు? తెలుగుని ప్రాచీన భాషగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఇంకా తంటాలు పడుతున్నాం.

మన పక్కింటి తంబి ఎప్పుడో తమిళ్ ని ప్రాచీన భాషగా తెచ్చేసుకుని, ఇప్పుడు రెండవ అధికార భాషగా గుర్తింపు తేవడానికి పావులు కడుపుతున్నాడు. రేపు, మనోళ్లు సైన్ బోర్డులు ఇంగ్లీష్ లో, హిందీలో, తమిళంలో కనపడ్డా ఆశ్చర్యపోనక్కర్లేదు. 'తెలుగు మాట్లాడు నాయనా' అంటే, ప్రతి పదమూ తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించి రసాభాస పాలవక్కర్లేదు. ప్రతి భాషలోనూ, వేరే భాషా పదాలు బోల్డన్ని చక్కగా అమరి వుంటాయి.

అప్పుడే ఆ భాష శోభాయ మానంగా వుంటుంది. ఇంగ్లీషులో చూడండి ఎన్ని ప్రెంచ్, లాటిన్ పదాలు వుంటాయో! కాబట్టి మీరు రైలు స్టేషన్ కే వెళ్లవచ్చు. ధూమశకట గమనా గమన స్థలికి వెళ్లనక్కరలేదు. 15 కోట్ల మందికి పైగా తెలుగు మాట్లాడే వారు వున్నారు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యాకులు మాట్లాడే పది భాషలలో తెలుగు ఒకటి. 50 లక్షలు కూడా మాట్లాడని ఫిన్నీష్ నార్వే భాషలు అంతరించిపోయే స్థితిలో లేవు.

మరి మన తెలుగుకే ఎందుకీ తెగులు వచ్చింది? దీనికి ముఖ్య కారణాలు నాలుగు. మనం, మన ప్రభుత్వ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, విద్యా వ్యవస్థ, క్లుప్తంగా చెప్పాలంటే మనం ఇంట్లో తెలుగు మాట్లాడం, తెలుగే నేర్పం. “తెలుగు నేర్చుకుంటే నీకు బెల్లం లేకపోతే ఖతం" అని మన ప్రభుత్వం బెదిరించదు.

“తెలుగు వదిలేసి ఆంగ్లం చదువు - నీకు అమెరికాలో ఉద్యోగం ఖాయం" అని విద్యా సంస్థలు బ్రెయిన్ వాష్ (క్షమించాలి - మెదడు ఉతకడం) చేస్తుంటాయి. ఈ నేపద్యంలో, నా బోడివాడి మాటలు,లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని పద్య నాటకాన్ని వేయించిన డాక్టర్ కృష్ణయ్య మాటలు ఎవడు వింటాడు?! రాజకీయ బానిసత్వం కంటే సాంస్కృతిక బానిసత్వం పరమ నీచం. కాబట్టి తెలుగు వీర లేవరా.... దీక్షపూని సాగరా... తెలుగు భాషని కనీసం నువ్వన్నా చదవరా... నీ పిల్లలకన్నా నేర్పరా....