సె(సొ)ల్లు ఫోను

రోజులు మారాయి. దేశం మారింది. మన జీవన విధానం మారింది. ఏ దేశమైనా ప్రగతి పథంలో దూసుకెళ్లాలంటే రెండు విషయాల్లో శ్రద్ధ వహించాలని, ఆర్ధిక శాస్త్రవేత్తలు ఎప్పుడో సూచించారు అవి, దేశమాతకు రక్తనాళాలు అనబడే రోడ్లు, నరాలు అనబడే టెలీకమ్యుని కేషన్స్. శాంపిట్రోడా అనబడే మేధావివల్ల, ఆ మేధావిని గౌరవించి దేశ వికాసానికి తోడ్పడిన రాజీవ్ గాంధీ వల్ల, మన దేశంలో టెలీ కమ్యూనికేషన్స్ ఎంతగానో అభివృద్ధి చెందాయి. 25 ఏళ్ల క్రిందటి మాట. నేను బాపట్లలో టెన్త్ క్లాసు చదువుతున్నాను. 

అప్పుడు మా నాన్నగారు అమెరికాలో ఉండేవారు. అమెరికా నుంచి సంగతులు తెలియాలంటే ఉత్తరమే గతి. మూడు వారాలు పట్టేది ఉత్తరం అందడానికి. మూడు నెలలకో సారి, నాన్నతో ఫోన్ లో మాట్లాడడానికి ప్రయత్నం చేసే వాళ్లం. అది చిన్న ప్రయత్నం కాదు. మహా యుద్ధం. ఓ ఆదివారం ఉదయమే నాలుగు గంటలకి వెళ్లి నేను, మా తమ్ముళ్లు, మెయిన్ టెలిఫోన్ ఆఫీసులో క్యూలో నుంచునే వాళ్లం, ట్రంక్ కాల్ బుక్ చేయడానికి, బహుశా ఈతరం వాళ్లకి ఆ మాటంటే తెలియదేమో.

మా వంతు కోసం ఎదురు చూస్తూ మధ్యాహ్నం అయిపోయేది. కనెక్షన్ మధ్యలో కట్ అయ్యేది. కట్ అయితే మళ్లీ క్యూలో సాయంత్రం దాకా. ఇంతకీ ఎంత సేపు మాట్లాడామంటే, రెండు నిమిషాలు. అది కూడా మేం ఇటు హలో అంటే, నాన్న అటు హలో. అయితే గొంతు ఎక్కడో నూతి లోంచి మాట్లాడుతున్నట్లుండేది. అంత కష్టపడే వాళ్లం ఆ రోజుల్లో. ఈ 25 ఏళ్లలో ఎంత మారిపోయింది ప్రపంచం. ఒకరితో ఇంకొకరు కనెక్ట్ కావడం ఎంతో సులువయింది.

ఆ మధ్య హంగేరి రాజధాని అయిన బుడాపెస్ట్ కు కాన్ఫరెన్స్ కాల్ లో అమెరికాలో వున్న ఒక తమ్ముడితో, దుబాయితో, దుబాయిలో వున్న ఇంకో తమ్ముడితో, కేయిరోలో వున్న ఓ వదినతో, బీజింగ్ లో వున్న ఒంకో వదినతో మాట్లాడగలిగాను, నా హోటల్ రూం లోంచి కదలకుండా, ఎక్కడ ట్రంక్ కాల్ - ఎక్కడ కాన్ఫ రెన్స్ కాల్. టెక్నాలజీ అద్భుతాలంటే ఇవే. నా చిన్నప్పుడు టెలిఫోన్ కనెక్షన్ కావాలంటే చాలా పలుకుబడి కావాలి. ఇప్పుడా - వెంటబడి ఇస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో 217 మినియన్లు మందికి సెల్ ఫోనులున్నాయి.

ప్రతినెల 70 నుంచి 80 లక్షల మంది కొత్త చందా దారులున్నారట సెల్ ఫోన్ లకి. ఆ జనంలో మా వంటమనిషి వుంది. మా డ్రైవర్ వున్నాడు. మా వాచ్ మన్ వున్నాడు. ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తరువాత లాభాలు ఎన్నో. సదుపాయాలు ఎన్నో. వ్యాపారాలు పెరిగాయి. ప్రతి చిన్న మనిషి కూడా కూసింత పెట్టుబడితో తనలి చాతనయినంత బిజినెస్ చేయగలుగుతున్నారు. అంతకు ముందు వైజాగ్ సముద్ర తీరంలో, అందరు మత్స్యకారులు ఒకేచోట ఒడ్డుకు చేరడం వల్ల, ధర తక్కువగా పలికేదట. కానీ, ఫోన్స్ వల్ల తలా ఒక చోటికి చేరుకోవడం వల్ల ప్రతి చోటా, సప్లయ్ అండ్ డిమాండ్ సమతూకాలవుతున్నాయట.

పిల్లలు, బయటకు ఎంత దూరం వెళ్లినా, బెంగా లేదిప్పుడు. వాళ్ల క్షేమ సమాచారాలు గంట గంటకూ తెలుసుకోవచ్చు. పల్లెలో కూడా, రైతులు ధాన్యానికి ధరలు తెలుసుకొని, నచ్చితేనే బళ్లు కడుతున్నారు. ఇక వైద్య రంగంలో చెప్పనక్కర్లేదు. ఎన్నో ప్రాణాలు కాపాడబడ్డాయి వీటి వల్ల. ఎమర్జెన్సీ వస్తే సెల్ ఫోన్ వల్ల నేనెక్కడున్నా నిమిషాల్లో హాస్పిటల్ కి చేరుకుంటాను. ఆ మధ్య హిమాలయ పర్వత శ్రేణులో చిక్కుకుపోయిన ఓ వ్యక్తి సెల్ ఫోన్ వల్లే రక్షించబడ్డాడు.

అన్నీ లాభాలేనా - అంటే ఖచ్చితంగా నో. చాలా నష్టాలు కూడా తలెత్తాయి. ఈ సొల్లు ఫోన్ల వల్ల ముఖ్యంగా కొంతమంది జనాలకు, సెల్ ఫోన్ కొనే స్తోమత వచ్చింది కానీ, దాన్ని ఉపయోగించే మంచి మర్యాదలు అబ్బలేదు. వీళ్ల న్యూసెన్స్ అంతా ఇంతా కాదు, పబ్లిక్ ప్లేసుల్లో వీళ్ల వీర విహారం చూస్తుంటే చాలా కోపం వస్తుంది. పక్కవాడి ప్రైవసీ, నిశ్శబ్ద వాతావరణాన్ని పట్టించుకోకుండా, ఒకటే రొద. కొంతమంది షో ఆఫ్ గాళ్లు. మరికొంత మంది ఎంత పెద్దగా మాట్లాడతారంటే - వేరే ఊళ్లో ఉన్నవాడికి, డైరెక్టుగా వినపడుతుందేమో అనిపిస్తుంది.

భయంకరమైన శబ్ద కాలుష్యానికి వీళ్ళే కారకులు. సభలో, సినిమా హాళ్లల్లో, వందల మంది ఏకాగ్రతను, భంగం చేస్తూ, ఈ సుత్తిగాళ్ల సొల్లు. నీకు ముఖ్యమైన ఫోన్ వస్తే - బయటకు వెళ్లి మాట్లాడు. కానీ వేరే వాళ్లను ఇబ్బంది పెట్టే - హక్కు వీడికెవరిచ్చారు. కనీసం ఇంగిత జ్ఞానం లేని ఈ మూర్ఖ శిఖామణులందరికీ జోహార్లు. ఈ రకమైన వెర్భల్ డయేరియా (మాటల విరోచనాలు) గాళ్ల గురించి, నాలాగే విసుగు చెందిన ఓ ఆసామీ, ఈ మధ్యే కొన్ని మర్యాద పద్ధతులు సూచించాడు.

సెల్ ఫోన్ సంభాషణ చాలా చిన్నదిగా చేయాలి. ముఖ్యంగా పబ్లిక్ ప్లేసుల్లో. ఎవరికైనా ఫోన్ చేస్తే, ముందు మాట్లాడొచ్చా అని అడగాలి. సంభాషణ క్లుప్తంగావుండాలి. అవతలి వారు ఎంత బిజీగా వున్నారో! నల్గురు వున్న ఏ పార్టీలో కానీ, సమావేశంలో కానీ, ఫోన్ లో గంటల తరబడి మాట్లాడకూడదు. కనపడ్డ ప్రతి వాడినీ, మీ సెల్ నెంబరెంత? అని అడగకూడదు.

ఫోన్ అన్నది మానవ జీవితానికి ఎంతో సౌఖ్యాన్ని అందించిన సాధనం. దాన్ని వేరే చెత్త పనులకు వాడొద్దు. చివరగా సెల్ ఫోన్ కెమేరా ద్వారా అమ్మాయిల ఫోటోలు తీయడం, అసభ్యకరమైన మెసేజ్ లు ఇవ్వడం, అశ్లీలమైన వీడియోలు పంపడం, ఇలాంటి నికృష్ట పనులను చేసే నీచాతి నీచమైన వ్యక్తులకి ఏ శిక్ష వేసినా చిన్నదేనేమో!!