Rating:             Avg Rating:       729 Ratings (Avg 2.95)

పోయినోళ్లు అందరూ మంచోళ్లు........

ఆమె చనిపోయిన రెండు వారాలయిపోయింది. అయినా ఇంకా జ్ఞాపకాలు ముసురుతూనే వున్నాయి. ఇంట్లో ఏ మూల చూసిన ఆమె సంబంధిత వస్తువులు, పాత అనుభూతుల్ని తట్టి లేపుతున్నాయి. గుండెంతా ఏదో బరువు. ఆమె అందరికీ భవనం జయప్రదం. నాకు మటుకు బిజెపి.

చాలా మంది అల్లుళ్లకు పిల్లనిచ్చిన అత్తగారు పెళ్లి నుంచే పరిచయం వుంటుంది. కానీ నా అదృష్టం నాకు చిన్నప్పటి నుంచీ పరిచయం మా అత్త. నేను ఆమె ఒళ్లోనే పెరిగాను. అప్పుడు మా నాన్నవాళ్లు, మామవాళ్లు ఇరుగిల్లు, పొరుగిల్లు. చాలా సార్లు అత్తయ్యతో జోకులు వేసేవాడిని. పుట్టగానే, నా యశస్సు చూసి 'నా అల్లుడు వీడే' అని ఫిక్స్ అయిపోయి వుంటారని, అత్తయ్య జీవితం ఓ అసాధారణ, అద్భుత ప్రయాణం.

1931లో గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరు అనే చిన్న పల్లెటూరులో ఓ సామాన్య రైతు కుటుంబంలో జననం, ఇంటికి పెద్ద కూతురు. ఇద్దరూ చెల్లెళ్లు. ఒక తమ్ముడు. ఇంటి మొత్తానికి, తనొక్కతే చదువుకుంది. ఏ రకమైన ప్రోత్సాహం, ప్రోద్బలం లేని ఆ వాతావరణం నుంచి, తనంతట తాను చదువుకోవడానికి ఎంత ఆత్మ విశ్వాసం, పట్టుదల అవసరమో! గుంటూరు ఎసి కాలేజీలో బిఏ, ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ, ఎల్ఎల్బి చేసింది. గుంటూరులో వున్నప్పుడే మా మామ భవనం వెంకట్రాం గారితో ప్రేమలో పడిపోయింది.

అందర్నీ ఎదిరించి కులాంతర వివాహం చేసుకుని, ఆదర్శ నారిగా ఎదిగింది, చాలా మందికి స్ఫూర్తిగా. గుంటూరులో లాయరుగా, తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా మంచి పేరు తెచ్చుకుంది. వినుకొండ నుంచి, కాంగ్రెస్ టిక్కెట్టు మీద 1967, 1972 లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచింది. విద్యుత్ శాఖ మంత్రి, కోస్టల్ ఆంధ్రా డెవలప్ మెంట్ బోర్డు చైర్మన్ గా ఉన్నత పదవుల్ని అందుకుంది. ఆమె పదవిలో ఉన్నప్పుడు, లేనప్పుడు చాలా మందికి సహాయం చేసింది.

వినుకొండ చుట్టుపక్కల చాలా గ్రామాలకు కరెంటు ఇచ్చి, వారందరి జీవితాల్లో వెలుగు నిపింది. ఆమె క్రియాశీల రాజకీయాల్లోంచి తప్పుకున్న తర్వాత కూడా, మా మామగారు భవనం వెంకట్రాం చీఫ్ మినిస్టర్ గా వున్న హయాంలో ఆమె సలహాలు సూచనలు ఎంతో ఉపయోగంగా వుండేవని అంటారు అందరూ. వ్యక్తిగతంగా అత్తయ్య ఒక ప్రేమమయి. పిల్లలన్నా, మనవళ్లన్నా ప్రాణం. అత్తయ్యకి ముగ్గురు కూతుళ్లు,ఒక్క కొడుకు. నేను చిన్న అల్లుడిని. అందరూ హైదరాబాద్ లోనే వున్నాం.

మామయ్య చనిపోయిన తర్వాత, ఈ అయిదు ఏళ్లు అత్తయ్య మా అందరి దగ్గరా, కొన్ని కొన్ని నెలలు వుంటూ అందరికీ ఆమె ఆప్యాయతానురాగాలు సమంగా పంచిపెట్టింది.'అమ్మను నీ దగ్గర పెట్టుకో - మా ఇంట్లో ఇరుకు' అంటూ అమ్మను వదిలించుకోవాలనే పిల్లలు ఎక్కువయిపోతున్న ఈ రోజుల్లో - 'అమ్మ మా దగ్గరే వుండాలి (మా మదులూ, గదులూ చాలా విశాలం) అంటూ పట్టుబట్టి ఆమెను చూసుకోవడానికి పోటీలు పడే పిల్లలుండడం ఆమె అదృష్టం.

అత్తయ్యకు పాత తెలుగు పాటలంటే ఇష్టం. పుస్తక పఠనం కూడా ఇష్టం. పొలిటికల్ బయోగ్రఫీస్ బాగా చదివేది. ఎంజె అక్బర్, ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో కాలమ్స్ వదిలిపెట్టేది కాదు. ఏ టాపిక్ లోనైనా అనర్గళంగా మంచి ఇంగ్లీషులో మాట్లాడేది. ఆమెకి జనరల్ నాలెడ్జి పిచ్చి. సిద్దార్థ బసు క్విజ్ ప్రోగ్రామ్ లు తప్పకుండా చూసేది. Cross word రోజూ చేయాల్సిందే. నాకు రోజుకొక్క క్విజ్ ప్రశ్న వేసి, నా బుర్ర చిలుకుతూనే వుండేది చివరి దాకా.

ఆమె చివరి రోజుల్లో ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ వుండే వాళ్లు. యువరాజ్సింగ్, అనిల్ కుంబ్లే. వాళ్లంటే తెగ ఇష్టం ఆవిడకి. అత్తయ్య నుంచి మేం నేర్చుకోవలసిన విషయాలు చాలా వున్నాయి. తనకి ఆరోగ్యం బాగా లేక ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఏనాడూ సెల్ఫ్ సింపతీ ప్రదర్శించేది కాదు. ఎవరికీ తన అనారోగ్యం, ఆశక్తత గురించి చెప్పి సానుభూతి అడిగేది కాదు. అంత ఒంటరితనం, నిస్సహాయతలో కూడా మమ్మల్నేవరినీ ఇబ్బంది పెట్టేది కాదు.

మా టైమ్ డిమాండ్ చేసేది కాదు. తనే ఏదో రకంగా కాలాన్ని దొర్లించేసేది. ఒక్కతే కూచుని, పేకాట, చైనీస్ చెక్కర్ ఇరువైపులా తనే అడుకునేది. అత్తయ్యది మరో అద్భుతమైన వ్యక్తిత్వం ఏమంటే, ఏ వయసు వారితోనయినా చక్కగా ఇమిడిపోయి మాట్లాడేది. మనవళ్లతో, మాతో, ఆమె స్నేహితులతో, అందరితో హాయిగా కాలం గడిపేది. అత్తయ్యతో నా అనుబంధం అద్వితీయం. మేం ఇద్దరం మాట్లాడుకోవడం చూస్తే అత్తా అల్లుడు అని ఎవరూ అనుకోరు.

ఒకరి మీద ఒకరు జోకులు తెగ వేసుకొని ఆనందించే వాళ్లం. నన్ను 'యూజ్ లెస్ ఫెలో' అని తప్పవేరే పేరుతో పిలిచేది కాదు. నేను కూడా 'నీకేమైనా క్రాక్ వచ్చిందా' లాంటి డైలాగులతో ఆమెను అట పట్టిస్తుండే వాడిని. మేం ఇద్దరం కలిసి, టివిలో ఎన్నెన్ని పాత తెలుగు పాటలు ఎంజాయ్ చేసే వాళ్లమో! నేనే ఊరు వెళ్లినా 'ఆమెకు ఏ పుస్తకం కొనాలా? అన్న ఆలోచనే. ఇరవై ఏళ్ల క్రింద మా పెళ్లయిన కొత్తల్లో, పూనేలో, మాతో వుండేది అత్తయ్య. ఆ రోజులు మళ్లీ రావు.

రోజూ ఓ పాత హిందీ సినిమా వీడియో కాసెట్ నేను తేవడం, నేను ఎప్పుడొస్తానా అని ఆమె ఎదురు చూడ్డం. సాయంత్రాలు ఆమెకు ఇష్టమైన వెజ్ ప్రైడ్ రైస్ తేవడం, ఇద్దరం కలిసి షేర్ చేసుకోవడం - ఎన్నో తీపి గుర్తులు. చివరి రోజుల్లో, నా చేతిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని చెక్కిలికి అనించుకునేది కాసేపు. చివరి సారి హాస్పిటల్ క్కూడా నేనే ఎత్తుకొని, కారులో కూర్చో పెట్టాను. ఆమె చిన్న కూతురయిన నా భార్య, పిల్లలిద్దరూ అత్తయ్యని చివరి రోజుల్లో ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు.

ఆమె గదిలోనే పడుకునే వారు అత్తయ్యకు తోడుగా. ఆమె లేకపోవడం మా అందరికీ పూడ్చలేని వెలితి. నాకు అమ్మకు, అత్తకు తేడా లేదు. అలాంటి బాంధవ్యం, అనుబంధం దొరకడం పూర్వజన్మ సుకృతం. ఆమె నాకికకనపడకపోయినా, అత్తయ్యతో ఉన్నట్లే అనుకుని నా మనసు ఇంకా ఎన్నో తీపి అనుభవాల్ని తోడుకుంటూనే వుంటుంది. ఆమె జ్ఞాపకాలు ఇంకా ముసరనీ, ఆ అనురాగపు వర్షం జల్లులో తడిసిపోనీ....