Rating:             Avg Rating:       753 Ratings (Avg 3.02)

మాతృ దేవోభవ

ఈమధ్య రవీంద్రభారతిలో 'మాతృ వందనం' అనే ఓ గొప్ప కార్యక్రమానికి వెళ్లాను. నాకు అత్యంత ఆత్మీయులు, శాంతా బయోటెక్ అధినేత వరప్రసాదరెడ్డిగారి జన్మదినం ఆరోజు. కానీ ఆయన జన్మదినం లాగా కాకుండా, జన్మనిచ్చిన దినంగా ప్రకటించి వారి అమ్మని సన్మానించారు.

అద్భుతమైన భావన కదూ! ఆ రాత్రి ఓ మూడు గంటలపాటు అమ్మలందరికీ జేజేలు పలుకుతూ, అందరం ఆదమరిచిపోయాం. జీ టీవీ లిటిల్ ఛాంప్స్ లో ఫైనల్స్ కి వచ్చిన బుడతలందరూ అమ్మమీద పాటలు పాడారు. అంత చిన్న వయసులో ఎంత చక్కగా పాడారో! వీళ్లనే దైవాంశ సంభూతులు, Child Prodigies అంటారేమో! ఆరోజు వరప్రసాద్ గారు వాళ్ళమ్మ గురించి అన్న మాటలు నాకెంతో నచ్చాయి.

“అమ్మా నా బాల్యం, నీ ఒడిలో సేదతీరిన పసితనం - మరల వస్తే ఎంత బాగుండును! నీవు తినిపించిన గోరుముద్దలూ, నీవు వినిపించిన ప్రహ్లాదుడి కథా, గజేంద్రమోక్షమూ, మిత్రలాభ, మిత్రభేద కథలూ, భర్తృహరి సుభాశితాలూ - అవన్నీ నా హృదయంలో నిలిచిపోయిన మధురఘట్టాలు.

“అమ్మా, ఆకలేసినప్పుడు అన్నపూర్ణవి భయమేసినప్పుడు ధైర్యలక్ష్మివి అక్షరాలు దిద్దించేటప్పుడు సరస్వతివి సందేహం బాధించినప్పుడు మార్గదర్శివి ఓటమి కృంగదీసి నప్పుడు చుక్కానివి తలిస్తే పలికే ఆప్తదైవానివి ఆదమరిస్తే క్షమాపూర్వక త్యాగానివి" నేను కూడా ఆరోజు, స్టేజ్ మీద అమ్మ గురించి మాట్లాడాల్సి ఉంది. అమ్మ గురించి, ఉపన్యాసం తయారు చేద్దామని, వారం రాజులు ప్రయత్నించాను. కానీ టైం దొరక్కకుదరలేదు. ఎలా మాట్లాడతానో అనుకుంటూ టెన్షన్ లో మైకు ముందుకొచ్చాను.

ముందు వరసలో అమ్మ, నాన్న కూచుని ఉన్నారు. అమ్మని చూడగానే అనర్గళంగా, ఓ పది నిముషాలు మాట్లాడేశాను. అప్పుడు తెలిసింది అమ్మ గురించి మాట్లాడడానికి తయారవనక్కర్లేదని . ఏ పూస్తాకాలూ, ఏ కోటేషన్లూ అక్కరలేదని. హృదయంలో పొంగే భావాల అలలకు మాటలు పొదిగితే చాలని. అందరిలాగే నా జీవితంలో కూడా అమ్మది ఓ అతి ముఖ్యమైన స్థానం. నేనీరోజు డాక్టరుగా ఉన్నానంటే దానికి ఆ అమ్మే ముఖ్య కారణం.

ఆమెకి, నేను డాక్టరవ్వాలని ఎంతగానో కోరిక ఉండేది, నేను మెడికల్ ఎంట్రెన్స్ లో సీట్ మీస్ అయిన ప్రతిసారీ, తను "ఈసారి వస్తుందిలే నాన్నా ఇంకా బాగా చదువు" అని వెన్ను తట్టి ముందుకు పంపేది. చిన్నప్పటి నుంచీ మా అందరి చదువులూ, సంధ్యలూ ఆమె పట్టించుకునేది. పేరుకి మేం ముగ్గురమే కానీ మా ఇల్లు ఎప్పుడూ ఓ హాస్టల్ లాగా కళకళలాడుతూ వుండేది. మా పిన్ని పిల్లలు, మా మేనమామ పిల్లలు ఇలా ఎప్పుడూ ఇంట్లో కనీసం అరడజను మంది పైగా ఉండేవారు.

మా భాస్కర్ బాబాయి చిన్నప్పటి నుంచీ మాతోనే ఉండేవాడు. అమ్మ, మా అందర్నీ ఒకేలా చూసేది. మా అమ్మలో నాకు బాగా ఇష్టమైంది ఈ విషయం. అమ్మ చదువుకుంది ఆరో తరగతి వరకే. కానీ ఆమెకు చదువు విలువ బాగా తెలుసు. అందుకే మేం చదువుకోకుండా ఏమన్నా నకరాలు చేస్తే వీరనారి అయిపోయేది. వీపు వాతలు నిశానీలుగా మిగిలేవి. నాన్న ఆయుధం బెల్ట్ అయితే, మా అమ్మ ఇష్ట దైవం బెత్తం. మా అమ్మమ్మ వాళ్లూర్లో నేను చదువుకున్న రెండేళ్ళూ ఆ ఇష్ట దైవానికి రోజూ పూజలు జరిగేవి.

పూజాస్థలం నా అతిమెత్తని వీపు. మా అమ్మ బెత్తం పట్టుకోగానే నేను పరుగే పరుగు. ఆమె కూడా వెంటబడి కొట్టేది. కొన్నాళ్ల తర్వాత తెలిసింది. ఆమె యుద్ధభూమికి కొన్ని ఎల్లలున్నాయని. ఒక వైపు హుస్సేన్ కిరాణా షాపు, రెండో వైపు వీరయ్య టీ స్టాలు. ఆ తర్వాత నా వీపుకి బోల్డంత విశ్రాంతి దొరికింది. కాందిశీకుడిలాగా ఎల్లలు దాటి ప్రక్కదేశంలోకి పారిపోయేవాణ్ణి. అమ్మకి అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉండేది. మా బంధువుల పెళ్ళి రోజులూ, వాళ్ల పిల్లల పుట్టిన రోజులూ, అన్నీ ఠక్కున చెప్పేసేది.

నాన్న జీతం ఎంతో, దాంట్లో డిఎ ఎంతో, తర్వాత ఇంక్రిమెంట్ ఎప్పుడు వస్తుందో అన్నీ తెలుసు ఆమెకు. అమ్మ ఓపిక గురించి ఎంత చెప్పినా తక్కువే, గుంటూరులో మా ఇల్లు, బంధువుల రాకపోకలతో ఎప్పుడూ నిండుగా ఉండేది. వచ్చిన వాళ్ళందరికీ వంటా వార్పులూ, స్నానాలూ, పానాలూ అమ్మ ఒక్కటే చేసేది. ఇప్పటి సౌకార్యాలు లేవాయో అప్పుడు. రాత్రి పదకొండు గంటలకు వచ్చిన వాళ్లకు కూడా వేడినీళ్ళు, వేడి భోజనం ఏర్పాట్లు గొణక్కుండా చేసేది.

త్యాగానికి అంజలీదేవి కదా. మంచం కూడా దానం చేసి క్రింద పడుకున్న రోజులు ఎన్నో! నేను మెడికల్ కాలేజీలో చేరేదాకా అమ్మే తల దువ్వేది. చిన్నప్పుడు అంతగా మా జీవితాల్ని నియంత్రించిన అమ్మ మేం పెద్దవ్వగానే ఎంతో హుందాగా మా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకి స్వాగతం పలికి తను, వెనుక సీటులో ఒదిగిపోయింది. అలా అని ఆమెకి నచ్చనివి ఏమన్నా ఆమెపైన రుద్ది, చాసించాలని మేం ప్తయత్నిస్తే చివరకు ఓడిపోయేది మేమే.

గుంటూరు వదిలి హైదరాబాద్ వచ్చి ఉండమని, సంవత్సరాల నుంచి పోరాడుతున్నాను. ఓడిపోతూనే ఉన్నాను. మా అమ్మకి జనం కావాలి. హైదరాబాద్ లో మా ఇంటికి వచ్చి పది రోజులుంటే కనీసం ఇరవై మంది స్నేహితుల్ని, బంధువుల్ని కలిసి వెళ్ళాల్సిందే. అందరికీ ఫోన్ చేసి ప్రేమగా పలకరిస్తుంది. అందుకే తెగ పాపులర్ ఆమె, మా బంధువర్గంలో. ఎప్పటికైనా ఆమె పాపులారిటీని ఉపయోగించి అమ్మని ఎంఎల్ఏగా చేయాలని జోకులేస్తుంటాను నేను. మా అమ్మకి ఇప్పుడు •70 ఏళ్ళు. అయినా తమ్మళ్ళిద్దరు దుబాయి, అమెరికా వెళ్లడానికి ఎప్పుడూ రెడీయే, మా నాన్నే వెనక్కి తగ్గుతుంటారు.

నా దగ్గరికి లండన్ వచ్చినప్పుడు రోజూ ఇంగ్లిష్ వర్డ్స్ రాసి కంఠస్థం చేసేది, ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు తడబడకూడదని. ఆమెకి కబుర్లంటే తెగ ఇష్టం. ఓపిక ఉన్నంతసేపూ మాట్లాడుతూనే ఉంటుంది. నా వాగడం ఆమె వారసత్వమే అంటారందరూ. మా ముగ్గురి పెళ్ళిళ్లూ మా ఇష్ట ప్రకారమే జరిగాయి. అమ్మకాని, నాన్నకాని ఏ రకమైన అభ్యంతరాలు చెప్పలేదు. అదృష్టం కొద్దీ, అందరూ ఆమెని గౌరవిస్తారు, ప్రేమిస్తారు.

కాబట్టి మాకెవరికీ నిన్మా స్టైల్ లో 'తల్లా, పెళ్లామా' అన్న మీమాంస ఎప్పుడూ ఉదయించలేదు. పోయిన సంవత్సరం అమ్మకి స్ట్రోక్ వచ్చింది. ఎప్పుడూ సందడిగా కబుర్లు చెప్పే అమ్మని, అలా నిస్సహాయంగా, నిస్తేజంగా చూసినప్పుడు నా కళ్ళ నిండా నీళ్ళు. అదృష్టం కొద్దీ త్వరలోనే పూర్తిగా కోలుకుంది. ఆమె నన్ను డాక్టర్ కావాలని కోరుకున్నందుకు, ఆ సమయంలో డాక్టరుగా, కొడుకుగా ఒకింత నా బాధ్యత నిర్వర్తించగలిగినందుకు ఆనందమేసింది.

ప్రతివారం మాటల కోసం వెదుక్కునే వాడిని ఒక పేజీ నింపడానికి. ఈ వారం ఒక్కపేజీ సరిపోవడం లేదు. ఇంకా ఎన్నో భావాలు పెల్లుబుకుతున్నాయి అమ్మ గురించి. నాయని సుబ్రహ్మణ్యం నాయుడు "అమ్మకు జేజే" అని ఓసంకలనం తెచ్చారు. తప్పక చదవాల్సిన పుస్తకం. దాంట్లో బాపు నుంచి, మంగళంపల్లి నుంచి, చంద్రబాబు దాకా, వాళ్ళమ్మల గురించి వ్రాశారు. అద్భుతంగా ఉన్నాయి 'అమ్మ గురించి - అనుభవాలు, ఆలోచనలు. చివరగా డా. కల్లూరి ఆనందరావు గారి కవితతో అమ్మకి నీరాజనం పలుకుదాం.

“ఆమె - భూదిగంతాల మధ్య ప్రతి ప్రాణినీ ఒడిలో చేర్చుకుని ఓదారుస్తుంది. ఆ నయనాలు సూర్యచంద్రులై ధరిత్రిని పాలిస్తాయి, లాలిస్తాయి. ఋతువుల్తో నిమిత్తం లేకుండా ఆప్యాయతల్ని వర్షించే ఆ కళ్ళు, బిడ్డలకు నిత్యం వసంతా వాసాలౌతాయి; నిస్వార్థంగా, పటాటోపం లేకుండా పలుకు నేర్పి. బ్రతుకు నిచ్చే ఆమె, ఒకరికి మాతృమూర్తి, మరొకరికి తల్లి వేరొకరికి అమ్మ - కలబోస్తే తరగని దాతృత్వం"