Rating:             Avg Rating:       739 Ratings (Avg 2.96)

మా ఫాదర్ ఓ టైగర్

“మా ఫాదర్ ఓ టైగర్, మాట్లాడాలంటే థండర్" అన్న పాట వినబడింది మొన్నోరోజు సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు లిటిల్ సోల్జర్స్ సిన్మా కోసం రాసిందీ పాట. ఈ పాట, ఆ సిన్మా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఆ సిన్మాలో నటించిన 'బన్ని' నా కూతురు కావ్య. పన్నెండేళ్ల కిందటి మాట అది. మొన్న ఈ పాట వినగానే, మా నాన్నగుర్తుకొచ్చారు.

మా ఇద్దరి అనుబంధం, చిన్నప్పటి నుంచి ఎన్ని మలుపులు తిరిగిందో అని ఆలోచిస్తూ, ఓ గంట పాటు పూర్వపు రోజుల్లోకి జారిపోయాను. చాలా మంది ఇళ్లల్లో నాన్నకి పెద్దపీట. అలానే, నాన్నకి బోల్డన్ని నిక్ నేమ్ లు. టైగర్ అని, హిట్లర్ అని, బిగ్ బాస్ అని, ఓల్డ్ మాన్ అని వగైరా వగైరా. మా నాన్నకి అలాంటి ముద్దు పేరేమీ పెట్టినట్లు గుర్తులేదు.

కానీ, మేం ముగ్గురం తమ్ముళ్లం పెద్దయినాక మా అమ్మానాన్నల చిలిపి తగాదాలు చూసి నాన్నని స్పిన్నర్ అని, అమ్మని ఆ స్పిన్నర్ ని సిక్స్ లు కొట్టే బ్యాట్స్ మన్ గా వర్ణించుకునే వాళ్లం. మానాన్నకి ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు. అంటే ఈయనే బిగ్ బాస్. చిన్నప్పటి నుంచి వాళ్లనందరినీ లైన్ లో పెట్టేవాడన్నమాట. మా చిన్న బాబాయి, నేనూ కలిసి చాలా అడ్వంచర్స్ చేసేవాళ్లం. ఇద్దరికీ నాన్నంటే టెర్రర్. సిన్మాకు అడగడానికి కూడా భయమే. మా అమ్మ ద్వారా మా సిన్మా భవిష్యత్తు తెలిసేది.

చిన్నప్పుడు, నేను, బాబాయి గొప్పు పనులు చేసి, మా నాన్నతో తన్నులు తినే వాళ్లం. శాంపుల్ కి ఓ రెండు సంఘటనలు చెప్పడం సముచితం. ఒకటి రవ్వలడ్ల ఉదంతం. అమ్మ రావ్వలడ్లు అద్భుతమైన రుచిగా వుండేవి. కానీ ఖర్మ ఏమిటంటే, ఆ రోజుల్లో ప్రతిదానికీ, కిరసనాయిలు నుంచి, చెక్కెర దాకా, కజ్జికాయల నుంచీ, రవ్వలడ్ల దాకా రేషన్ వుండేది. రోజుకి రెండు కంటే పెట్టేది మా అమ్మ. మన జిహ్వ చాపల్యం ఏమో అమోఘం. నాలుగు లడ్లు తస్కరించి వాటిని మెట్లు లేని మేడమీద పదిలంగా దాచి, మునగ చెట్టు మీదుగా కిందకు దిగుతుండగా మా బిగ్ బాస్ కంటపడ్డాను.

అంతే Rest is History. 'మునగచెట్టు పెళుసు - దాన్నెక్కి, కిందపడి కాళ్లు విరగొట్టుకోవద్దు' అన్న శాసనాన్ని ఉల్లంఘించినందుకు పది బెల్టు దెబ్బలు, రవ్వలడ్లు దొంగతనం చేసినందుకు ఇంకో పది దెబ్బలు, 'పైకి ఎందుకు ఎక్కావురా?' అంటే సూర్యుడిని చూడ్డానికి' అన్నాను. లెక్కతేలని రవ్వలడ్లకు, నాకూ ఏమాత్రం సంబంధం లేదు అని అబద్ధం చెప్పినందుకు మరో పది దెబ్బలు వెరసి ముచ్చటగా ముప్ఫై దెబ్బల శిక్షపడింది.

“ఏదో చిలిపి కృష్ణుడి ఫక్కీలో వెన్న ముద్దలకు బదులు రవ్వలడ్లు దొంగిలించాడులే" అని ముచ్చటపడి వదిలేయ కుండా , వళ్లు వాచిపోయే ఈ బెల్టు దెబ్బల్ని ప్రసాదించిన ఈ తండ్రిని నేను కాబట్టి క్షమించి వదిలేశాను. నా విశాల హృదయం మీకు అర్ధం అయిందనుకుంటా ఈ పాటికి.

రెండో ఉదంతం ఇంకా అమానుషం. మా బాబాయి వల్ల నేను తన్నులు తిన్నాను. మా వాడు, ఆ రోజుల్లో గవాస్కర్ లాగా ఫీలయ్యేవాడు. ఓ రోజు, ఇంట్లో ట్యూషన్ కని చెప్పి, తాటితోపుల్లో క్రికెట్ కి చేక్కేశాడు, ఎందుకో బిగ్ బాస్ కి అనుమానం వచ్చి, చెక్ చేయడానికి నన్ను పంపాడు. మా బాబాయి బాపట్ల లార్డ్స్ గ్రౌండ్ లో దొరికిపోయాడు నాకు. “మరి నాకేంటి?” అన్న నా ప్రశ్నకు స్పందించి, జేబునిండా ఉసిరికాయలు లంచం నింపాడు. ఇద్దరం ఇంటికి చేరి, 'బాబాయి ట్యూషన్ లో అదిరిపోయేట్లు చదువుతున్నాడని' నేనూ,

“బుద్దిగా చదువుకునే వాడి మీద ఇంత అనుమానమా?' అని బాబాయీ నాన్న దగ్గర ఆస్కార్ అవార్డు రావల్సిన లెవల్లో నటించాం. అంతలోనే, నాన్న, ఆయన ఫేవరేట్ ఆయుధం (బెల్టు) చేబూని, నన్ను, బాబాయిని లెక్కలో తేడా రాకుండా, ఇద్దరికీ చేరిసమానంగా వడ్డించారు. రాత్రి, అమ్మ చెప్తే తెలిసింది. బాబాయిని చెక్ చేయడానికి వెళ్లిన నన్ను చెక్ చేయడానికి, బిగ్ బాసే స్వయంగా వెళ్లారని. ఇంత అనుమానపు తండ్రి వల్ల ఎన్ని అవమానాలు పాలయ్యానో మీకు తెలిస్తే, కళ్ల నీళ్లు పెట్టుకుంటారు.

అలా దెబ్బలు తిని, తిని ఇంటర్మీడియట్ కి వచ్చేశాను.”కాలేజీ, టీనేజీ కదా - ఇక దెబ్బలుండవులే" అని విర్రవీగుతుండగా, మా డాడ్ ఇంకో అనూహ్యమైన దెబ్బ కొట్టారు. “నీకు ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ రాకపోతే నేను ఇల్లు వదిలి వెళ్లిపోతాను కుమారా" అని తెగ ముద్దుగా, గోముగా ప్రకటించారు. ఇక చూస్కోండి నా టెన్షన్. నాకు ఫస్ట్క్లాస్ ఒక మార్కుతో మిస్ అయినట్లు, నాన్నహిమాలయాలకు వెళ్లిపోయినట్లు, అమ్మని, తమ్ముళ్లని పోషించడానికి నేను రాత్రిళ్లు రిక్షా తొక్కుతున్నట్లు - ఒకటే కలలు.

ఆ తర్వాత బాపట్లలో వ్యవసాయ కళాశాలలో, నేను శిష్యుడిని, ఆయన గురువు. చాలా సిగ్గు పడిపోయే వాడిని. అందరిలాగా గురువుల్ని గొడవచేయడానికి లేదాయే. కాలేజీలో పాఠాలే కాక, ఇంట్లో కూడా కీటకాల గురించి, కరువు కాటకాల గురించీ ప్రైవేట్ క్లాసులు పడిపోయేవి. ఆ క్లాసులు తప్పించుకోవడానికే మెడికల్ కాలేజీలో చేరాల్సి వచ్చింది. “నన్ను వదిలి నీవు పోలేవులే" అని పాడుకుంటూ, పట్టుమని ఆరునెలల్లోనే, అప్పుడప్పుడే వికసిస్తున్న నా హాస్టల్ జీవితాన్ని మొగ్గలోనే త్రుంచేసి, మా డాడ్ గుంటూరుకి ట్రాన్స్మిఫర్ అయిపోయారు.

మెడికల్ కాలేజీలో "చదువు ముఖ్యం - వినోదం చివరి అంకం" అని తనూ, “వినోదమే ప్రథమం - చదువు అనవసరం" అని నేనూ, వాదించుకుంటూ రోదించుకుంటూ గడిపేశాం. కానీ అప్పటికే, నా 'పెద్దరికానికి' గౌరవం ఇచ్చేసి, నా లవ్ అఫైర్ ని ఆమోదించేసి, అడపా దడపా నేనిచ్చే సలహాలని పాటించే లెవల్ కి (ఏ)దిగి పోయాడు మానాన్న. చిన్నప్పటి నుంచీ నాన్న క్లాసులు తప్పించుకోవాలని, దూరంగా వెళ్లాలని ప్రయత్నించిన నేను, చివరికి ఇంగ్లాండ్ లో తనకి దూరంగా పదేళ్లున్నప్పుడు, తనని ఎంతో మిస్ అయిపోయాను.

ఇప్పుడు అందరూ అంటారు. నేను నా కొడుక్కి అచ్చం మా నాన్న నాకు తీసినట్లే క్లాసులు తీస్తుంటానని. చిన్నప్పుడు తన్నులు మినహాయిస్తే, మానాన్న చాలా మంచోడు. నాకూ, నా ఇద్దరి తమ్ముళ్లకి ఆయనంటే అపారమైన గౌరవం. ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాం తన సాన్నిధ్యంలో. పెద్దా చిన్న తారతమ్యాలు లేకుండా, అందర్నీ ఆప్యాయంగా అక్కున చేర్చుకునే వ్యక్తిత్వం ఆయనిచ్చిందే.

ఆటోడ్రైవర్ కి కూడా మాతోపాటే సహ పంక్తి భోజనం పెట్టించిన రోజు ఇంకా గుర్తే నాకు. సేవాగుణం ఆయన బలం. ఉద్యోగం ఒక యజ్ఞం ఆయనకి. ఆయన సిన్నియారిటీ, కష్టపడి పనిచేయడం మా అందరికీ ఆచరణీయం. మా అందరి గురించీ, ఆయన ఇప్పటికే పడే తాపత్రయం ఒక్కోసారి చాదస్తం అనిపించినా, వెంటనే అది అవధుల్లేని ఆప్యాయత అని తెలిసి, ఆ అనురాగంలో తడిసి ముద్దాయిపోతాం. చాలా మంది నాన్నలకి, అమ్మలకి దొరికే ప్రేమ, గౌరవం లభించవు.

ఎందుకంటే పిల్లలకి గోరుముద్దలు తినిపించే అమ్మలే ఇష్టం. కానీ ఆ గోరుముద్ద అమ్మ చేతికి రావడానికి, నాన్న ఎంత తపనపడ్తారో, ఎన్ని పగళ్లు, రాత్రులూ నిశ్శబ్దంగా, నిస్వార్థంగా కష్టపడ్తారో తెలుసుకున్నప్పుడు నాన్న మీద అపారమైన గౌరవం, అవాజ్వమైన ప్రేమ కలగక తప్పదు. అందుకే నాకు, నాన్నంటే ఇష్టం.