Rating:             Avg Rating:       777 Ratings (Avg 2.98)

అయ్యవారికి చాలు అయిదు వరహాలు

“అయ్యవారికి చాలు అయిదు వరహాలు. పిల్లలకు చాలు పప్పు బెల్లాలు” మీలో చాలా మంది, అప్పుడే దసరా పండగ ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళిపోయారు కదూ. నా బాల్యంలో దసరా పండగ ఉంటే, చిన్న విహార యాత్రలాగా వుండేది. దసరా వారం రోజులూ, బడి సగం రోజే. మిగిలిన సగం, పంతులు గారు, పిల్లల ఇళ్లకి వెళ్లి, పద్యాలు చదివే వాళ్లం. మా అందరికీ పప్పు బెల్లాలు, మరమరాలు దొరికేవి. కొంచెం డబ్బున్న వాళ్లిళ్లలో కొత్త బలపాలు, పలకలు ఇస్తుండే వారు. మిగతా పండగలన్నీ ఇంటి దగ్గర సందడిగా వుండేది. కానీ దసరామటుకు, స్కూలులో సందడి, స్కూలులో కొన్ని క్లాస్ రూంలను రంగుల కాగితాలతో అలంకరించే వాళ్లం.

అటెండన్స్ రిజిస్టర్ కి కొత్త ఆట్టలు వేసేవాళ్ళం. కొత్త డస్టర్లు కొనేవాళ్లం బ్లాక్ బోర్డు తుడవడానికి. దసరా ముందురోజు పద్యాల పోటీ వుండేది. వ్యాస రచన, వకృత్వ పోటీలు కూడా జరిగేవి. అమ్మాయిల ఇళ్లకు వెళ్లి (పిలిచినా, పిలవకపోయినా) బొమ్మల కొలువులు చూసేవాళ్లం. ఆ బొమ్మలమీద, అమ్మాయిన మీద అంత చిన్న రోజుల్లోనే జోకులు, కామెంట్స్, మగబుద్ది కదా! మా నాన్నమట్టుకు దసరా రోజుల్లో చికాగ్గా వుండేవాడు. రోజు ఉదయాన్నే ఎవరెవరో వచ్చి ఇంటి ముందు నిలుచునే వారు. వాళ్లని చూసి ఇంకా చికాకు పడిపోయేవాడు. నాకెందుకో అర్ధమయ్యేది కాదు తర్వాత తెలిసింది. ‘దసరా మామూళ్లు’ వత్తిడి అని. విజయదశమి ముందు రోజు దుర్గాష్టమి. భవానీ మాతకి పూజ చేయాలట. ఆ విషయం నా మనసులో బాగా నాటుకుపోయి, ఈ రోజుకి కూడా ఆ పూజ మానలేదు. రోజూ ఉదయాన్నే భవానీ పూజ చేస్తాను, పండగ రోజు అయితే, రెండు గంటలపాటు.

మా ఆవిడ పేరు ఏమిటంటారా? భవానీ? శ్రీరామనవమి వారం రోజుల పండగ. ప్రతి పేటకీ, రోడ్డుకీ ఓ పందిరి వేసేవాళ్లు చందాలు వసూలు చేసి. రోజూ ఉదయం పూట ప్రసాదం, పానకం, వడపప్పు. ఆ పానకం రుచు ఆద్భుతం. ఇక పులిహోర వుండేదీ – అత్యద్భుతం. శ్రీరామనవమి పది రాత్రులూ, తిరణాలే. ప్రతి పందిరిలో, ఏదో ఒక సందడి. హరికథలు, మిమిక్రీలు, నాటికలు, నాటకాలు, సిన్మా పాటల విభావరులు. ఇలా ఇంకా ఎన్నో అనుభూతులు, ఆనందాలు మూట కట్టుకొని ఇంటికి చేరేసరికి అర్ధరాత్రి అయ్యేది. కళామతల్లికి నా వంతు సేవగా, నేను కూడా ఓ సారి ‘నిమ్మకాయ పంతులు’ అనే నాటికలో ఓ పాత్ర వేసినట్లు గుర్తు.

శ్రీరామనవమి చివరి రాత్రి, పెద్ద పందిట్లో రికార్డింగు డ్యాన్సు హైలైట్. సిన్మాల్లో ఐటమ్ గర్ల్ గా జ్యోతిలక్ష్మి, విజయలలిత కుర్రకారు గుండెల మీద డ్యాన్సు చేసి రాజ్యమేలుతున్న రోజులవి. రికార్డింగు, డ్యాన్సు రాత్రి అలాంటి జ్యోతిలక్ష్మిలు, విజయలలితలు బోల్డంత మంది, ‘వేస్కోకోకో కోలా, తీస్కో రమ్ము సారా” లాంటి పాటలకి విచ్చలవిడి విన్యాసాలు చేస్తుంటే, చూడ్డానికి ఒకటే జనం. అసభ్యతకి, అశ్లీలతకు ప్రతీకలయిన ఆ డ్యాన్సులు, దేవుడి పండగ, అదీ శ్రీరాముడి పండుగరోజు ఎందుకొచ్చాయో అర్థం కాని విషయం. బాగా గుర్తుండిపోయే ఇంకో పండగ వినాయక చవితి. తలంటు బాదేకాక ఇంకో ఇబ్బంది ఎదురయ్యేది

ఈ పర్వదినాన. ఉదయం పదింటిదాకా పస్తు. కళ్లముందు వడపప్పు, గారెలు, పాయసం అన్నీ వుండేవి, కానీ నాన్న పూజ చేయాలి. కథ చదవాలి. అప్పుడు కాని ఫుడ్ దొరికేది కాదు. పూజా కార్యక్రమం,కథా కార్యక్రమం ఏమన్నా కొద్దిసేపా అంటే, కనీసం రెండు గంటలుపట్టేది. అందరం పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టాలి. చదువుకోవడానికిఏమీ విఘ్నాలు రాకూడదని మట్టి వినాయకుడికి, పత్రితో, పుష్పాలతో పూజ. నాన్న మంత్రాలు చదువుతున్నంత సేపూ, మేం ఆకో, పువ్వో, దేవుడిమీద వేయాలి.ఒక్కోసారి, కొంచెం ఓవర్ యాక్షన్ చేసి, అవి స్పీడు వేశామనుకోండి, ఒక డోస్ తిట్లు పడిపోయేవి. ఒక ఆ కథ బాబాయ్ తెలుగు టీవి డైలీ సీరియల్ లాగా సాగుతూనే వుండేది. ప్రస్తుత కాలంలో అయితే నేను పూజని, కథని, మా వాళ్లకి తెలియకుండా కుదించేసి, కంగారుగా ముగిస్తుంటాను.

కానీ మా నాన్న ముచ్చటగా మూడు గంటల పాటు చేసేవారు. పాయసం, గారెలు బాగా పట్టించి, ఊరుమీడకి బలాదూరు. వినాయకచవితి రోజు, ఎంత తిట్లు తింటే అంత మంచిదట మరి. ఈ థీసిస్ ఎవరు కనిపెట్టారో తెలీదు కాని, జనంలో తిట్లు తినడానికి, గుంపులుగా బయలుదేరే వాళ్లం రోడ్ల మీదకి. ఈ బృహత్ కార్యక్రమంలో, తిట్లు సంపాదించడానికి ముఖ్యంగా రెండు మార్గాలుండేవి. ఒకటి పల్లేరు కాయలు, రెండు కాసర గడ్డలు. జనం కూర్చునే చోట, కుర్చీల్లో, కాళ్ల కింద, పల్లేరు కాయలు వేసి పారిపోయే వాళ్లం.

కాసర గడ్డలు అంటే, ఉల్లిపాయల్లాగా వుండేవి. రోడ్డు మీద తిరుగాడే అమాయక ప్రాణుల మీదకి, బాంబుల్లాగా విసిరి ఆనందించే వాళ్లం. ఎక్కువ దూరం పరిగెత్తే వాళ్లం కాదు. ఎందుకంటే, వాళ్ల తిట్లు (ఆశీర్వచనాలు) వినపడాలి కదా. అప్పుడప్పుడు, ‘దురద గుంటాకు’ రాసేవాళ్లం. ఈ తరానికి ఎం తెలుసు? ఆ రోజుల్లో తిట్లు తినడానికి కూడా మేము ఎంత కష్టపడే వాళ్లమో!! క్రిస్టియన్ స్నేహితులు, ముస్లిం స్నేహితులు ఎంత మందో వుండేవారు.

క్రిస్మస్ కేకు, రంజాన్ పండుగా పలావ్, సేమ్యా, నిన్న కాక మొన్నే తిన్నట్లు అనిపిస్తుంది. ఆ పండుగ రోజుల్లో, వాళ్లిళ్లల్లోనే ఉండేవాళ్లం ఎక్కడున్నారో, ఎం చేస్తున్నారో ఆ బాల్య మిత్రులందరూ. పండగ దండగ’ అనే వాళ్లు చాలా మంది లేకపోలేదు. కానీ, మన పండుగల్లో ఎంత తీపి వుంది. ఎంత ప్రేమ వుంది. ఎంత మార్దవం వుంది. దేవుడా.... నా చిన్నప్పటి పండగ రోజులన్నీ నాకు తిరిగి ఇచ్చేయ్.