పౌరుషం

 

 

పౌరుషం

 

-పద్మశ్రీ


అదో హెయిర్ సెలూన్.. హెయిర్ కటింగ్ చేస్తూ చాలా బిజీగా ఉన్న ఆ హెయిర్ సెలూన్ ఓనర్ జేబులో సెల్లు గల్లుమంది. ఆయన హెయిర్ సెలూన్స్ అసోషియేషన్ అధ్యక్షుడు కూడా...

 

ఈ టైంలో ఎవరా అనుకుంటూ కటింగ్ ఆపి ఫోన్ తీసి

హాల్లో... అన్నాడు.

సార్.. కొంపలంటుకుపోయాయి... గాభరా గాభరాగా వినిపించిందో కంఠం..

ఏం కొంపలయ్యా...? ఇంకా గాబరా గాబరాగా అన్నాడు అతను...

మీరు వెంటనే బయలుదేరి వెళ్ళాలి.... మరింత ఆందోళన నిండిన కంఠంతో వినిపించింది.

ఎక్కడికి బయలుదేరాలయ్యా... అతనికంటే ఆందోళనగా అన్నాడు హెయిర్ సెలూన్ ఓనర్.

 

ఎక్కడికంటారేమిటి సార్... సినిమాకి..

 

ఆ మాటలకి ఉలిక్కిపడ్డాడు హెయిర్ సెలూన్ ఓనర్ కమ్ వర్కర్ కమ్ హెయిర్ సెలూన్అసోసియేషన్ ప్రెసిడెంటయిన అతను.

తన మానాన్న తను హెయిర్ కటింగ్ చేసుకుంటూ ఉంటే ఫోన్ చేసి తననెంతో ఆందోళనకి గురిచేసిందే కాకుండా సినిమాకి వెళ్లమంటూన్న ఈ వెర్రి బాగుల వాడెవడా అని మనసులోనే అతన్ని తిట్టుకుంటూ పైకి మాత్రం...

ఏమయ్యా.. అసలు కొంపలంటుకోవడమేమిటీ.... ఆ కొంపలంటుకుపోవడానికి నేను సినిమా కెళ్లడానికి లింకేమిటీ... నాకేమీ అర్థం కావడం లేదు... అయినా నేను సినిమాలు చూడక పదేళ్లవుతుంది..

 

అక్కడ జరిగింది సార్ పొరపాటు... మీరు పదేళ్ళనుండి సినిమాలు చూడడమం లేడని వాళ్ళు ముందే తెలుసుకుని పక్కా ప్లానింగ్ ప్రకారం చేశారన్నమాట...

 

హెయిర్ సెలూన్ ఓనర్ గట్టిగా జుట్టు పీక్కోవాలనుకున్నాడు కానీ.... ఓ చేతిలో కత్తెర, మరో చేతిలో సెలు ఉండడంతో ఆపని చేయలేకపోయాడు. తాను సినిమాలు చూడలేదని ఎవరు తెలుసుకున్నారు. అతనేం ప్లాన్ చేసాడు. అసలు ఇతనేం మాట్లాడుతున్నాడో అనుమాత్రమైన అర్థం కాకపోవడంతో ఏడుపు మొహం పెట్టి.

ఏమయ్యా.. అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టకుండా అసలు ఏం జరిగిందో చెప్పు అన్నాడు అతను...

అక్కడికే వస్తున్నాను సార్.. ఈరోజే రిలీజయిన ఫలానా సినిమాలో మీ హెయిర్ సెలూనిస్టులని అవమాన పరిచే విధంగా సీన్లున్నాయి సార్.

ఏమిటీ.. మా హెయిర్ సెలూనిస్టులని అవమాన పరిచే విధంగా సీన్లున్నాయ్య...? ఆశ్చర్యంగా అన్నాడు అతను..

 

అవును సార్.. ఈ సినిమాలోని హీరో ఓ రౌడీ అన్నమాట.. అతను హెయిర్ కటింగ్ చేసుకోవడానికి ఓ హెయిర్ సెలూన్ కి వెళ్తాడు.. అక్కడికి వెళ్ళి... ఒరేయ్.. ఈ హెయిర్ సెలూన్ఓనర్ ఎవడ్రా... నాకు కటింగ్ చేయాలి.. అని గట్టిగా అంటాడన్నమాట... చూసారా.. చూసారా... ఎంత మాట... చిన్నా పెద్దా తేడా లేకుండా మీలాంటి హెయిర్ సెలూన్ ఒనర్లనే కాదు...యావత్ హెయిర్ సెలూనిస్టులనే అవమానపరిచే విధంగా ఈ సీన్ తీసారు. మీకెంత అవమానం...

 

 

అవునా... మా హెయిర్ సెలూనిస్టులనే ఒరేయ్ అనేలా తీసారా... నాయాల్ది... ఆ సినిమా ఎంటనే సూడాల... ఆ తర్వాత ఆడి సంగతి తేల్చాలి..

 

 

అదీ పౌరుషమంటే.. వెంటనే ఆ సినిమా జూసి హెయిర్ సెలూన్ ప్రెసిడెంట్ గా మీడియా ముఖంగా మీరు దీన్నీ తీవ్రంగా ఖండించడమే కాదు... రాష్ట్ర వ్యాప్తంగా మీ హెయిర్ సెలూనిస్టులందరికి ఈ సినిమా చూపించి వారితో ఆందోళనలు కూడా చెయ్యాలి...

 

 

తప్పకుండా జేస్తా... మమ్మల్ని ఒరేయ్.. అనంటే పడడానికి మేమేమైనా చవట దద్దమ్మలమా... ఇప్పుడే వెళ్తా... మావాళ్ళందరికీ ఇప్పుడే సినిమా చూడమని చెప్తా.. ఆ తర్వాత నా తడాఖా ఏంటో చూపిస్తా... కోపంగా అన్నాడతనుఇప్పుడనిపించుకున్నారు సార్... మీరు పౌరుషవంతులని..

 

 

అదిసరే టైమైపోతుంది.... ఇంతకీ టికెట్ దొరుకుతుందంటావా...

 

 

మీకా శ్రమే అవసరం లేదు సార్... ఒక్కసారి తలతిప్పి మీ గుమ్మం దగ్గర చూడండి... టిక్కెట్లతో ఓ మనిషి రెడీగా ఉంటాడు...

 

అతను తలతిప్పి చూడగానే ఆ షాప్ గుమ్మంముందు ఓ వ్యక్తి టిక్కెట్లు చేత్తో ఊపుతూ కనిపించాడు..

మరింకేమీ ఆలస్యం చేయకుండా ఆ సినిమా టిక్కెట్ తీసుకుని ఎంటనే సినిమాకెళ్ళిపోండి..

చాలా థాంక్సండీ.. మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా వచ్చిన సినిమా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మంచి పని చేశావు.. ఇప్పుడే వెళ్తున్నా.. సినిమా చూసాక నా తడాఖేమిటో చూపిస్తా... గాండ్రింపులు చేస్తూ కత్తెరని పక్కన పడేసి బయటికి నడిచాడు అతను...

ఏమయ్యా... నా కటింగ్ ని సగంలో ఆపేసి అలా వెళ్లిపోతే ఎలాగయ్యా... కటింగ్ బాధితుడు లబోదిబో మన్నాడు..

నువ్వలాగే కూర్చో.. సినిమా చూసొచ్చాక... ముందు ఆ సినిమా తీసినోడి సంగతి చెప్తాను.. ఆ తర్వాత నీ మిగతా కటింగ్ సంగతి చూస్తాను... కోపంగా అంటూ సినిమా టిక్కెట్టు తీసుకుని గబగబా వెళ్ళిపోయాడతను..

అప్పటివరకూ ఆ హెయిర్ సెలూన్ అసోసియేషన్ ప్రెసిడెంటుకి ఫోన్ చేసిన వ్యక్తి ఆ వెంటనే గబగబా అన్ని న్యూస్ చానెల్స్ కీ ఇన్ఫర్మేషన్ పాస్ చేసేసాడు.. ఫలానా థియేటర్లో ఫలానా హెయిర్ స్టయిల్ అసోసియేషన్ ప్రెసిడెంటు సినిమాకెళ్ళాడనీ.. ఆ సినిమాలో తమ హెయిర్ సెలూనిస్టులని అగౌరవ పరిచేవిధంగా సీన్లున్నాయని అతనితో ఎవరో చెబితే కోపంగా వెళ్ళాడనీ, సినిమా చూసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయడానికి రెడీ అవ్వబోతున్నాడనీ... అన్ని ఛానెల్స్ కీ సమాచారం అందించేయడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరు నిమిషంలో మీడియా నిమిత్తం సదరు హెయిర్ సెలూన్ అసోసియేషన్ ప్రెసిడెంటు సినిమా చూస్తున్న థియేటర్ ముందు ప్రత్యక్షమయ్యాయి.

అలా ఆ ప్రెసిడెంటుకి, మీడియా వారికి ఇన్ఫర్ మేషన్ పాస్ చేసిన వ్యక్తి ఆనందంతో చెంగుచెంగుమని ఎగురుతుంటే... ఆ పక్కనే ఉన్న ఆయన అసిస్టెంటు మాత్రం భయంకరంగా అరిచేసాడు..

 

స్సార్... ఇందాక మీరు ఏ సినిమా గురించి మాట్లాడారు సార్..

 

ఎవరి సినిమా గురించయితే నేనెందుకు మాట్లాడతానురా.. మన సినిమా గురించే... ఆ మాటలకి బుర్ర గిర్రున తిరిగినట్టయ్యింది అతనికి...

స్సార్... ఆ సినిమాకి సాక్షాత్తూ మీరే నిర్మాతగా ఉండి ఇలా మొదటిరోజు మొదటి ఆటకూడా ఆడకుండానే దానిపై నెగెటివ్ గా అలా చెప్పేశారు ఏంటండీ... బుర్రగోక్కుంటూ అన్నాడు అతను... అతని మాటలకి పెద్దగా నవ్వేశాడు ఫలానా సినిమా నిర్మాత.

నాన్నా సినిమా అన్నాక నెగెటివ్ రెస్పాన్సా.... పాజిటివ్ రెస్పాన్సా అన్నది చూడకూడదు.. మన సినిమా అన్ని మీడియా ఛానెల్స్ లోనూ హాట్ న్యూస్ అయ్యిందా లేదా అన్నదే చూడాలి... ఇలా చేస్తే మనకి ఫ్రీ పబ్లిసిటీ... .............
రజనీకాంత్ స్టైల్లో ఓ నవ్వు నవ్వేశాడు నిర్మాత....

ఇలా ఆయా అసోసియేషన్ ప్రెసిడెంట్లకి ఫోన్లు చేసి వారిలోనిపౌరుషాన్ని నిద్రలేపి తమ సినిమా పబ్లిసిటీ కోసం నిర్మాతలు ఇలాంటి పాట్లు కూడా పడాల్సి వస్తుందేమో.... ఏమో....