అర్థరాత్రి మండింది...

 

 

అర్థరాత్రి మండింది...

-పద్మశ్రీ

సగటు భారత పౌరుడికి ప్రతీరోజూ ఏదో ఒక విధంగా మండుతూనే ఉంటుంది అది వేరే విషయం.. ఇక ఇప్పుడు మన కథానాయకుడికి ఎందుకు మండింది....? ఎక్కడ మండింది....? అదీ అర్థరాత్రి మండదమేంటీ....? అనేవే కదా మీ క్వశ్చన్లు...

మామూలు మధ్యతరగతికి చెందిన వ్యక్తి. పేరు ముకుందరావు. ఆయన ఓ ప్రైవేటు ఆఫీసులో పనిచేస్తుంటాడు. నెలకి మూ....డు..... వేల రూపాయల జీతం. ఒక భార్యా, ముగ్గురు పిల్లలు. రోజూ వచ్చినట్టుగానే ఈరోజు ఇంటికి వచ్చాడు. కానీ కొత్తగా వచ్చాడు. రోజూ గడిపినట్టుగానే పిల్లలతో గడిపాడు కానీ కొత్తగా, రోజూ తిన్నట్టుగానే అన్నం తిన్నాడు కానీ కొత్తగా, ఎప్పుడూ పదికల్లా ముసుగుదన్నేవాడు కానీ ఈరోజు కొత్తగా అర్థరాత్రి వరకు మెలుకువతోనే ఉన్నాడు..

అంతవరకూ బాగానే ఉంది కానీ పడుకోబోయే ముందు టీవీ ఆన్ చేసి ఉత్సాహంగా ఓ ఛానెల్ పెట్టాడు. అదే అతను చేసిన పెద్ద తప్పు.... అంటే... టీ.వి. చూడడం తప్పుకాదుకానీ టీవీలో, రాత్రి వేళలో, ముఖ్యంగా నిద్రపోయే సమయంలో చూడకూడని ఛానల్స్ చూడడం వల్ల ఆయనకి మండింది. అంతా ఇంతా కాదు, ఎంతో మండింది.. ఎక్కడ మండిందంటే చెప్పడం కష్టం కానీ,,, గత కొన్ని సంవత్సరాలుగా ఆయనకి ఎక్కడో మండుతూనే ఉంది. కానీ ఆ మంటని వెంట వెంటనే చల్లార్చుకుని మామూలుగా ఇన్ని రోజుల పాటు నెట్టుకు వస్తున్నాడు.. ఇకపోతే ప్రస్తుతం ఆయన చేసే కంపెనీలో ఐదు సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యాడు. జాయిన్ అయినప్పుడు ఆయనకి ఇచ్చిన జీతం రెండు వేలు.

ఆ రెండు వేలలోనే అద్దె కట్టుకోవడాలు, ఇంట్లోకి సరుకులు తీసుకోవడాలు, గ్యాస్, కరెంటు తదితర బిల్లులాంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా చెల్లించాల్సిన డబ్బులు చెల్లించడాలు... ఎప్పుడో నెలకోసారి తన భార్య పిల్లలతో కలిసి ఓ సినిమాకి వెళ్ళి రావడాలు జరిగిపోయాయి... బాగానే ఉంది...

మరి ఇది అయిదు సంవత్సరాల తర్వాత కదా... ఈ అయిదు సంవత్సరాల కాలంలో అతను నివసించే ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందింది. కాల క్రమంలో ఏదైనా అభివృద్ధి చెందుతుంది దీంట్లో విశేషం ఏముందని అంటారా....? ఓకే... అయిదు సంవత్సరాలలో అన్నీ అభివృద్ధి చెందినట్లుగానే ఆయన జీతం కూడా ఐదేళ్ళకి వ్వె....య్యి.... రూపాయలు పెరిగింది... అబ్బో... బాగానే పెరిగింది కదా...! అయితే విచిత్రం ఏమిటంటే ఐదేళ్ళ క్రితం రెండు వేల రూపాయలతో తనకి కావలసినవన్నీ సమకూర్చుకుని ఆనందంగా ఉన్న సదరు ముకుందరావు ఇప్పుడు మూడు వేల రూపాయల జీతం వచ్చినా కూడా నెల ముందుకి రాగానే అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.....

ఇలా ఎందుకు జరిగిందంటారు....?

ఎందుకంటే.... ఈ అయిదు సంవత్సరాల తర్వాత ఆయనకి పెరిగిన జీతం వెయ్యి రూపాయలైతే ... ఇంట్లోకి కావలసిన సరుకులు, వీధిలో దొరికే సరుకులు, ఒకటేమిటీ... మనిషి జీవించడానికి కావలసిన అన్నింటి ధరలు కూడా అయిదు సంవత్సరాల కాలంలో యాభై శాతం పెరిగితే.... ముకుందరావు జీతం మాత్రం అయిదు శాతం పెరిగింది... అంతేకాదు పాపం... అతని పిల్లలు కూడా అతని ప్రమేయం లేకుండానే పెరిగిపోయారు.... అలా పెరిగిన పిల్లలతో పాటు ఖర్చులూ పెరుగుతాయి కదా కామన్ గా... ఇలా అయితే అప్పులు కాక మరేమవుతాయి చెప్పండి... కాబట్టి ముకుందరావుకి మండడం అన్నది కామన్ అయిపొయింది, మందినప్పుడల్లా ఆ మంట చల్లార్చుకోవడానికి తెగ ప్రయత్నం చేస్తాడు. దాంట్లో సక్సెస్ సాధిస్తాడు. అయితే ఇప్పుడు అర్థరాత్రి ఆయనకి మండిన మంటని చల్లార్చుకోవాలంటే ఎంతకీ చల్లారడం లేదు... అందుకే తెల్లవార్లూ నిద్రలేకుండా ఉండిపోయాడు పాపం ముకుందరావు...

ఎంతకీ ఎందుకు మండిందంటే...?

వచ్చేది మూడు వేల జీతం... బాగానే వుంది... తన తోటి కొలీగ్స్ తన చుట్టూ పక్కల వున్న వారందరూ టూవీలర్ బండ్లు కొనుక్కుని హాయిగా తిరుగుతువుంటే ముకుందరావుకి కూడా ఓ టూవీలర్ వెహికల్ కొనాలన్న కోరిక కలిగింది... ఫైనాన్స్ లో బండి కొన్నాడు. మూడువేల రూపాయల జీతంలో సగం డబ్బులు ఫైనాన్స్ కట్టడానికి, మిగతా సగం డబ్బులు పెట్రోలుకే పోతాయి కదా... ఇల్లునెలా గడుపుతాడు అనే ఆలోచన మీకు వచ్చినట్లే నాకు వచ్చింది. అయితే ముకుందరావు తెలివిగల వాడు కాబట్టి వెహికల్ మెయింట నెన్స్ కికావలసిన డబ్బుని వచ్చే విధంగా ఓ పార్ట్ టైం జాబ్ పట్టుకున్నాడు. జాబ్ వుంది కాబట్టి కొత్త వెహికల్ కొన్నాడు. కొత్త బండిమీద కొత్త ఉత్సాహంతో ఇంటికి వచ్చి కొత్త ఠీవీని తెచ్చుకుంటూ ఇంట్లోకి వచ్చాడన్నమాట... అల కొత్త కొత్తగా వచ్చి ఆనందంగా గడిపిన తర్వాతటీవీ చూడగానే ఎందుకు మండింది... ఇంతకీ టీవీలో ఏమి చెప్పారు...?

ఎందుకు మండిందంటే...!

పాపం ముకుందరావు మొదటిసారి టూవీలర్ కొన్నాడు దాన్ని మెయిన్ టెయిన్ చేయడానికి కావలసిన ఖర్చులు ముందే లేక్కేసుకున్నాడు.. కానీ... అర్థరాత్రి పూట టీవీలో చూసిన వార్త చూడగానే ఒక్కసారిగా విపరీతంగా మండిపోయింది.. పాపం... వెహికల్ కొని ఒక్కరోజు కూడా పూర్తి కాలేదు.. కానీ ఈరోజు అర్థరాత్రి నుండి పెట్రోలు ధరని రెండు రూపాయలు పెంచేశారు ప్రభుత్వం వారు.. ఆ వార్తని మన ముకుందరావు టీవీలో చూడడం జరిగిందన్న మాట... అందుకే మండింది...

ఎప్పుడైనా ఏదో పావలాయో, అర్థ రూపాయో లేదంటే రూపాయో పెంచే పభుత్వం వారు ముకుందరావు దురదృష్టం కొద్ది ఒక్కసారిగా రెండు రూపాయలు పెంచేశారు. అప్పటి వరకూ కొత్త కొత్త ఎంజాయ్ చేసిన ముకుందరావుకి పెట్రోలు ధర పెరిగిందనే వార్త చూడగానే కొత్త కొత్తగా మండడం ప్రారంభించింది...

అయినా ముకుందరావు పిచ్చిగానీ, కొత్త బండి తెచ్చిన ఉత్సాహంతో ఎంజాయ్ చేసి హాయిగా నిద్రపోక మధ్యలో ఆ టీవీ ఎందుకు చూసినట్టు...? అనే ఆలోచన ఇది విన్నవారికి వస్తే రావచ్చు గానీ.. ముకుందరావుకి అర్థరాత్రే మండింది... తెల్లారనివ్వండి పొద్దున్నే పెట్రోలు బంకు దగ్గరకు వెళ్లిన ప్రతీ ఒక్కరికి మండుతుంది... ఎక్కడో చెప్పలేం కానీ మండుతుంది.......? మండదా....?