ఇదీ కథ

ఇదీ కథ

-పద్మశ్రీ

అంబులెన్సు పెద్దగా కుయ్... కుయ్... మనుకుంటూ ఆ ఏరియాలోకి ఎంటరయింది...

ఓ హోటల్ ముందు జనాలందరూ గుమిగూడి ఉన్నారు. అంబులెన్స్ రాగానే అందరూ పక్కకి తప్పుకున్నారు...

వారి మధ్యలో ఓ వ్యక్తి కిందపడి నురగలు కక్కుతూ అటూ ఇటూ, ఇటూ అటూ పొర్లుతూ అపస్మారక స్థితిలో ఉన్నాడు.

అంబులెన్సులో నుండి ఇద్దరు నర్సులు దిగారు...

కొందరి సహాయంతో అతన్ని అంబులెన్సులోకి ఎక్కించారు.

డాక్టర్ అతనికి ప్రథమ చికిత్స చేసాక, “ఇంతకీ ఏం జరిగింది?” అని అడిగాడు హోటల్ యజమానిని.

“ఏమో సార్ తెలియదు....”

“తెలియదా.... నీ హోటల్ ముందు అతను అలా కిందపడి పొర్లుతున్నాడు.. నీకేమీ తెలియదా?”

“నిజంగా నాకేమీ తెలియదు సార్.... అందరిలాగానే హోటల్లోకి వచ్చాడు. అందరిలాగానే టీ ఆర్డర్ చేసాడు... అందరిలాగానే తాగాడు...”

“కానీ అందరిలాగా బయటికి వెళ్లక నీ హోటల్ ముందు పడి పొర్లుతున్నాడు.. ఎందుకు... టీలో విషం కలిపావా....?” కోపంగా అన్నాడు డాక్టర్.

“ఓరి భగవంతుడో... ఓరి నాయనో... ఓరి దేవుడో.. ఓరి...”

“ఓరి... ఓరి.... అంటే ఊరుకుంటాననుకుంటున్నావా... నేను చూడ్డానికి డాక్టర్ లా ఉన్నాను కానీ, ఈ వైట్ డ్రెస్ తీసేస్తే...”

“స్సార్... సారీ... డాక్టర్... సారీ...డాక్టర్ సార్... నిజంగా నాకేమీ పాపం తెలియదు సార్...

టీలో విషం కలిపితే టీ తాగినవారందరూ నా హోటల్ ముందు పొర్లాలి కదా... ఇతనొక్కడే పొర్లుతున్నాడంటే నా టీలో లోపమేం లేనట్టే కదా.. డాక్టర్ సార్....” ఏడుపు మొహంతో లబోదిబోమన్నాడు హోటల్ యజమాని...

“అవును కదూ.... నీ టీ తాగినవారందరూ పొర్లాలి కదూ... కానీ ఇతనొక్కడే పొర్లుతున్నాడంటే లోపం నీ టీలో కాదన్న మాట... వేరే దేంట్లోనో లోపం ఉండి ఉంటుంది...” సాలోచనగా అన్నాడు డాక్టర్...

“హమ్మయ్య బ్రతికించారు సార్... నన్నొదిలెయ్యండి సార్... ఆయన్ని ఇక్కడినుండి తీస్కెళ్లండి సార్...”

“ఊ... సరే... తీసుకెళతా... అతను స్పృహలోకి వచ్చి లోపం నీ హోటల్లోనే ఉందని స్టేట్ మెంటుగానీ ఇచ్చాడో... అప్పుడు నేను వస్తాను... అంబులెన్సు వస్తుంది.... ఆ వెనకాల పోలీస్ జీపూ వస్తూంది..” అన్నాడు డాక్టర్ హెచ్చరిస్తున్నట్టు....

హోటల్ యజమాని బుర్ర గోక్కున్నాడు...

“స్సార్ మీరు వస్తారు బాగానే ఉంది. పోలీస్ జీపూ వస్తుంది.. అంత వరకూ బాగానే ఉంది. మధ్యలో ఈ అంబులెన్సు ఎందుకు సార్...?”

“ఆ పోలీస్ జీపులో వచ్చిన పోలీసులు నిన్ను మక్కెలిరగతంతారు కదా... అప్పుడు నిన్ను హాస్పిటలుకి మోసుకెళ్లదానికి అంబులెన్సు కావాలి కదా... అందుకు...” అంటూ అంబులెన్స్ ఎక్కాడు డాక్టర్...

హోటల్ యజమాని బిక్కచచ్చిపోయి అలాగే నిలబడిపోయాడు...

హాస్పిటల్ లో... రెండు గంటల తర్వాత నర్సు పరుగు పరుగున డాక్టర్ గదిలోకి వచ్చింది....

“డాక్టర్... డాక్టర్...” పరగు పరుగున రావడంతో అలుపు వస్తోందావిడకి...

“ఏం కొంపలంటుకుపోయాయని అంతలా పరుగెత్తుకు వచ్చావ్... నిదానంగా రావచ్చు కదా.... ఇంతకీ ఏం జరిగిందేమిటీ....?” అన్నాడు డాక్టర్...

‘ఇందాక అంబులెన్సులో ఓ పేషంట్ ని తీసుకువచ్చారే.. అతను స్పృహలోకి వచ్చాడు...”

“అయితే మాత్రం... పరుగు పరుగున వచ్చి ఈ విషయం నాతో చెప్పడానికి అతనేమన్నా వి.ఐ.పి.నా?” విసుక్కున్నాడు డాక్టర్...

“అది కాదు డాక్టర్... అతను ఎందుకు అలా పొర్లాడో చెప్పాడు...”

“ఎందుకట..?” నర్సు చెప్పింది...

“వాట్ నిజమా...”

“నిజం డాక్టర్....” కన్ను మూసి తెలిచేలోపు డాక్టర్, నర్సు పేషెంట్ దగ్గర ఉన్నారు.... నర్సు కిసుక్కున నవ్వింది డాక్టర్ ని చూసి...

“హె...హె... ఎందుకు నవ్వుతున్నావ్...?” రొప్పుతూ అన్నాడు డాక్టర్...

“ఇందాక ఇంతకంటే ఎక్కువ స్పీడులో మీ గదిలోకి పరుగెత్తుకుంటూ వచ్చినా మీ అంత అలుపు నాకు రాలేదు.... మీరేమో తెగ రొప్పుతున్నారు...”

 

“షటప్....” కోపంగా అన్నాడు డాక్టర్...

ఓ రెండు నిమిషాలు అలుపు తీర్చుకుని పేషంట్ వంక చూసాడు....

పేషెంట్ డాక్టర్ వంకే చూస్తున్నాడు... “ఏం మిస్టర్... నువ్వు చెప్పింది నిజమేనా...?” నిజమే అన్నట్టుగా తలూపాడు నీరసంగా పేషంటు....

“ఎందుకలా...?” ఫేస్ ని క్వశ్చన్ మార్క్ గా పెట్టి అడిగాడు డాక్టర్...

“అది మీరే చెప్పాలి కదండీ...” అమాయకంగా అన్నాడు పేషెంట్...

“ఎస్... ఎస్.... నేనే చెప్పాలి కదూ... ఓకే.... ఓకే.... నా సర్విస్ లో ఇంతవరకూ ఇలాంటి కేసుని టేకప్ చేయలేదు.... సో.. దీనంతు తేల్చే వరకు నేనూరుకోను.... కాబట్టి... ఇప్పుడు నేను కూడా నీలా మారి... ఈ ఎక్స్ పీరియన్స్ తెచ్చుకుని మరీ ఎందుకలా జరిగిందో చెబుతాను... నర్స్..” గట్టిగా అని ఆ గదిలోనుండి వెళ్లారు

ఇద్దరూ. డాక్టర్ తనకు కావాల్సినవి తెప్పించుకున్నాడు.... “నర్స్.. ఓ రెండు గంటల వరకు నన్ను డిస్టర్బ్ చేయకండి.” అంటూ ఆపరేషన్ ‘ఎందుకు, ఏమిటి, ఎలా’ కి శ్రీకారం చుట్టాడు...

సరిగ్గా రెండు గంటల తర్వాత నర్సు డోరు తెరిచేసరికి డాక్టర్ కిందపడి పొర్లుతూ కనిపించాడు...

వెంటనే ఆ డాక్టర్ ని ఇందాకటి పేషంట్ పక్క బెడ్ పై చేర్చి ట్రీట్ మెంట్ ఇచ్చారు... గంట తర్వాత... “డాక్టర్...” ఆన్నాడా వ్యక్తి...

డాక్టర్ నీరసంగా పేషెంట్ వైపు తల తిప్పాడు...

“తెలిసిందా డాక్టర్.... నా ప్రాబ్లెం ఏమిటో....?” నీరసంగా తలూపాడు డాక్టర్....

“ఇది నీ ఒక్కడి ప్రాబ్లం కాదు మిస్టర్... ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి ప్రాబ్లం ఇది... ఈరోజు నువ్వు, నేను కిందపడి గిలగిల కొట్టుకున్నట్టే రేపు అంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఎంతమంది కొట్టుకుంటారో అని భయంగా ఉంది...”

“దీనికి పరిష్కారం లేదా డాక్టర్...” “ఉంది... దానికి ఒక్కటే పరిష్కారం... ఆ పరిష్కారాన్ని ఖచ్చింతంగా పాటించినవారు బయట ఉంటారు.... పాటించని వారు హాస్పిటల్ బెడ్ పైన ఉంటారు... అంతే..” గంభీరంగా అన్నాడు డాక్టర్....

“ఇంతకీ ఏమిటా పరిష్కారం డాక్టర్...”

“నీకొక్కడికే కాదు రాష్ట్ర ప్రజలందరికి తెలియాలి... ఇందుమూలంగా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా... నా ఎక్స్ పీరియన్సు కొద్దీ మీకు విన్నవించుకుంటున్నది ఏమిటంటే... మీరు పొద్దున్నే లేవగానే రోజూ ఏ దినపత్రికని చదువుతారో అది మాత్రమే చదవండి... ఏ హోటల్ లోనో మన రాష్ట్రంలోని కొన్ని లీడింగ్ దినపత్రికలు కనిపించాయి కదా అని అన్నింటినీ చదవకండి...

చదివితే ఇదిగో ఇలా హాస్పిటల్ పాలు కావాల్సి వస్తుంది...

నేడు వస్తున్న దినపత్రికలలో న్యూసులు కనిపించడం లేదు... ఓ పత్రికలో ఓ న్యూసు కరెక్టయితే, మరో పత్రికలో ఆ న్యూస్ రాంగవుతుంది... ఓ పత్రిక ఓ లీడర్ ని దోషి గా నిలబెడితే మరో పత్రిక ఆ లీడర్ నే గాంధీ మహాత్ముడంతటి వాడని పొగుడుతుంది... చివరికి అందులో ఏ న్యూస్ రైటో, ఏ న్యూస్ రాంగో తెలుసుకోలేక.. తికమక పడిపోయి... బ్రెయిన్ ఆఫయిపోయి... మైండ్ బ్లాకయిపోయి కిందపడి గిల గిలా కొట్టుకుంటారు... తస్మాత్ జాగ్రత్త... మూడు, నాలుగు పేపర్లు చదవడం వద్దు, ఒక్క పేపర్ ని చదవడమే ముద్దు...”

ఇదీ కథ.... రాను రాను ఈ న్యూస్ పేపర్ల మధ్య ఉన్న తీవ్ర పోటీతత్వంతో సామాన్యులు ఈ విచిత్ర వ్యాధికి గురయినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.... ఏమో....!