నాటకాల రాయుళ్ళు

నాటకాల రాయుళ్ళు

-పద్మశ్రీ

ఒక్కప్పుడు నాటకాలు నటులు మాత్రమే వేసేవారు. వారు మాత్రమే నాటకాలని పండించేవారు. ఏ పాత్రకైనా జీవంపోసి ప్రేక్షకులని మంత్రముగ్దులని చేసే నటులు ఎంతోమంది ఉన్నారు. నాటకాలని రక్తి కట్టించి పేరు ప్రఖ్యాతులు సంపాదించినవారు చాలామందే ఉన్నారు.

వెనకటి కాలంలో నాటకాలు వేస్తున్నారంటే చుట్టుపక్కల గ్రామాలనుండి ఎడ్లబండ్లు కట్టుకుని మరీ వచ్చి నాటకాలని చూసేవారు.

అంటే నాటకాలలో నటించేవారికి అంతటి ఫాలోయింగు ఉండేదన్నమాట...

`కాలక్రమేణా సినిమారంగం అభివృద్ధి చెంది నాటకాలు కాస్తా సినిమాలుగా రూపాంతరం చెందడం ప్రారంభమయింది.

సినిమా అంటే కదిలే బొమ్మ. ఆ కదిలే బొమ్మని చూసి ఎంజాయ్ చేయడం ఒక అనుభూతి...

అయితే కళ్ళెదుటే అటూ ఇటూ కదులుతూ తన నటనా చాతుర్యంతో ఆకట్టుకునే నాటకాలని చూడడానికి వెనుకటి తరంవారు ఎక్కువగా ఇష్టపడతారు.

వెండితెర వెలుగులలో నాటకాలు అదృశ్యం అయ్యేసరికి పాపం వారికి నాటకాలు చూడటానికి ఛాన్స్ లేకుండా పోయింది....

అలాంటి నాటకాలు చూడాలనుకునే వారికి ఇప్పుడొక శుభవార్త...!

ఏమిటంటారా...? ఒక్కప్పుడు నాటకాలని నటీనటులు పోషించారు.

కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు పోషిస్తున్నారు.

అప్పటి నాటకాలు స్టేజీపై మాత్రమే రక్తి కట్టేవి.. మరి ఇప్పుడు రాజకీయ నాయకులు ఆడే నాటకాలు స్టేట్ మొత్తాన్ని రక్తి కట్టిస్తున్నారు.

నాయకుడికి కావలసింది సమర్థవంతంగా పరిపాలించే సుగుణం ఉండాలన్నది ఒకప్పటి మాట...

నాయకులకు సమర్థవంతంగా నటించే గుణం ఉండాలన్నది ఇప్పటి మాట...

ఎంతబాగా నటిస్తే రాజకీయ రంగంలో అంత బాగా రాణించొచ్చన్నమాట...

అందుకే ఈరోజు పేపర్లలో వార్తలని పరిశీలిస్తే ఓ పార్టీ నాయకుడు, మరో పార్టీ నాయకుడిది అంతా నటననే అంటాడు.

ఆ పార్టీ నాయకుడు ఊరుకుంటాడా... నాది ఒట్టి నటననే కానీ ఆయనది నంది అవార్డు అందుకునే లెవెల్ నటన అంటూ ఇంకా అద్భుతంగా నటిస్తూ చెబుతాడు.

‘ నాది నంది అవార్డు నటన అయితే అవతలి వారిది నేషనల్ అవార్డు అందుకునే నటన’ అంటూ ఈ పార్టీ వారి స్టేట్ మెంట్... దానికి బదులుగా ‘మాది నేషనల్ అవార్డు నటనే కావచ్చు. కానే అవతలి పార్టీలో ఉన్న నాయకులందరూ నటులే...

వారి నటనకి నంది అవార్డులు, ఫిలిం ఫేర్ అవార్డులు, నేషనల్ అవార్డులు... అన్నీ ఇవ్వొచ్చు.... అంతా ఒట్టి నటన... అంతే...” అంటూ ఆవేశరసాన్ని ఒంటపట్టించుకుని ఊగిపోతూ స్టేట్ మెంటిస్తారు....

“ఏమిటేమిటీ... మా నాయకులందరూ నటులా... మరి మీ నాయకులో... మా నటనకి నేషనల్ అవార్డులే వస్తాయేమో...

కానీ మీరు నటించే నటన... అబ్బో... చాలా గొప్పది...

ఎంత గొప్పదంటే.. మా నాయకుల నటనకి ఒక్కొక్కరికి ఒక్కో నంది అవార్డు, నేషనల్ అవార్డు వస్తే... మీ నటనకి ఏకంగా ఇంటర్నేషనల్ అవార్డే వచ్చేస్తుంది...

అదే.... దాన్నేమంటారు... ఆ... ఆస్కార్.. మీ అందరికీ తలా ఒక ఆస్కార్ అవార్డు వస్తుంది..

అంతమంచి నటులు మీ పార్టీ లీడర్లంతా... అంతా నటనే... అంతా.. ఒట్టి, ఒట్టి నటనే...

” ఈ స్టేట్ మెంటుని బట్టి మీకేమనిపిస్తుంది....?

‘అసలెవరండీ మన దేశంలో నటీనటులు కరువయ్యారనన్నదీ....?” అనే కదా...

సేమ్... నాకు కూడా అదే డౌటు వచ్చింది... ఇలా రాజకీయ నాయకులంతా నటులు అవుతున్నారు కాబట్టే సినిమా నటులంతా రాజకీయ నాయకులైపోతున్నారు....

ఎందుకంటే సినిమాలోనటిస్తే కేవలం అభిమానులే ఈలలూ, గోలలూ చేస్తారు...

అదే రాజకీయాలలో నటిస్తేనో... స్టేట్ మొత్తం గోలగోల చేయొచ్చు.... అదీ విషయం....!