వాలెంటెన్స్ డే స్పెషల్ ...

వాలెంటెన్స్ డే స్పెషల్ ...

-పద్మశ్రీ

ఓ పార్కు....

విశాలంగా ఉన్నా అక్కడక్కడా గుబురుగా ఉన్న కొన్ని చెట్లతో ప్రేమికులకి ‘అనుకూలంగా’నే తయారు చేయబడింది.

వాలెంటెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఓ ప్రేమ జంట ఆ పార్క్ కి వచ్చింది. కానీ వారి మనసులో ఎక్కడో ఏ మూలో భయం భయంగానే ఉంది.

కారణం కొన్ని సంస్థలు ప్రేమికులరోజు నాడు ప్రేమ జంటలు, పార్కుల్లో విహారాలు చేయడం వారి దృష్టికి వస్తే వెంటనే పెళ్ళి చేస్తామని కంకణం కట్టుకున్న విషయం ఈ ప్రేమ జంటకి కూడా తెలుసు...

అందుకే కాస్త భయంగానే పార్కులోకి ప్రవేశించారు. అంతలోనే వారిముందు ఓ వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు.

“మీరు ప్రేమికులా...?” సూటిగా అడిగాడు....

“అబ్బే... కాదండి... అదీ... అదీ... మేమిద్దరం ఫ్రెండ్స్ మండీ....చదువుకుందామని ఇలా పార్క్ కి వచ్చామని.... ఛఛ... చదువుకోవడానికి కాదండి కాలక్షేపం కోసం ఇలా వచ్చామండి... అసలు మేము ప్రేమికులమే కాదండి....” భయంగా, కంగారుగా చెప్పాడు అబ్బాయి.

“అబ్బా... నేను అలాంటి వాడిని కాదయ్యా బాబూ....?”

“అలాంటి వాడంటేనండి...?” అమాయకంగా అడిగాడు అబ్బాయి.

“అబ్బా... ఈ రోజు ప్రేమ జంట కనిపిస్తే పెళ్ళిచేసే గ్యాంగ్ లో వ్యక్తిని కాదు నేను....?”

“ఓహో... అలాగా...! అయితే మీరెవరు....?” “నేను మీకు సహాయం చేద్దామని వచ్చాను.....”

“అలాగా...! అది సరే మీరేంటి ఇలా చాప, దిండు, రగ్గు పట్టుకుని తిరుగుతున్నారు...”

“ప్రేమికుల రోజు స్పెషల్ ఇదేమరి....?” “అంటే....?”

“అబ్బా... ప్రతీదీ విడమరిచి చెప్పాలి మీకు...? ఇలా పార్కుకి రావడం ఇదే మొదటిసారా...?” విసుక్కున్నాడు ఆ వ్యక్తి.

అబ్బాయి కాస్త సిగ్గు పడుతూ “అవునండి...! ఇదే ఫస్టు... ఏదో సరదాగా అలా మాట్లాడుకుందామని...”

“అలా మాట్లాడుకున్న తర్వాత మీకు ఇంకోటి అనిపిస్తుంది... అలా అనిపించినప్పుడు ఇవి మీకు అవసరం పడుతుంది....

“ఇవే కాదు... ఏకాంత ప్రదేశం కూడా కావాల్సొస్తుంది. అలా కావాల్సి వచ్చినప్పుడు వాటన్నింటిని సమకూర్చి మీలాంటి ప్రేమికులకి సహాయం చేయడమే నేను చేసే పని, పైగా ఈరోజు ప్రేమికులకి ప్రత్యేకంగా సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేస్తాం... కంగారుపడకుండా నా మాట నమ్మండి...

” అతని మాటలకి అబ్బాయి మొహం వెలిగిపోయింది.. కానీ అమ్మాయికి మాత్రం ఏదో బెరుకుగానే ఉంది... అబ్బాయి, అమ్మాయి వైపు చూశాడు ఆత్రుతగా..

“నాకేదో భయంగా ఉంది...! పోనీ... పబ్బుకి వెళితేనో...”

“డోంట్ వరీ... అక్కడ కూడా మా వాళ్ళు ‘స్పెషల్’ ఆరెంజ్ చేయడానికి సిద్దంగా ఉన్నారు. అక్కడ కూడా మీకోసం సెపరేటుగా ఓ రూంని ఆరెంజ్ చేసి మీకు కావాల్సిన ‘అన్ని’ సదుపాయాలని సమకూర్చే అవకాశం వుంది... ఈ ప్రేమికుల రోజును మీరు ఎంతో జాలీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. సాయంత్రం వరకూ మీ గది తలుపుని ఎవరూ తట్టకుండా చూసే పూచీ నాది.....

“అబ్బో... పబ్బు కూడా వద్దు...” “అయితే హోటల్ కి వెళ్తారా... సిటీకి దూరంగా ఉండే ఏదైనా రిసార్ట్స్ కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారా....? మీరు ఎక్కడికంటే అక్కడికి.... ఎలా అంటే అలా... ఈ ప్రేమికుల రోజున మీరు ఎంతో ఆనందంగా ఉండడానికి మేము అన్ని విధాలుగా సహాయం చేస్తాం... మీకు ఏది, ఎలా కావాలంటే అలా సమకూరుస్తాం... మీ ఆనందమే మా ఆనందం...”

ఈరోజు ‘ప్రేమికులు’ అనే పదానికి అర్థం మారిపోయింది.

పార్కులకి, పబ్బులకీ ఇలా ఏకాంతంగా కలుసుకుని మనసువిప్పి మాట్లడుకోవాలనుకునే నిజమైన ప్రేమికుల మనసులో ఇలా ‘తప్పు చేయాలనే’ ఓ విషపూరితమైన ఆలోచనని కల్గజేసి, ఆ ఆలోచనని ఆచరణ సాధ్యం అయ్యేలా చేసేవారు ఎందరో ఉన్నారు.

కేవలం డబ్బుకోసం నిజమైన ప్రేమికులని కూడా పాడుచేస్తున్నారు.

ప్రేమికులకి రాని ఆలోచనలు సైతం వారికి కల్గించి పెళ్ళికి ముందే తొందరపడేలా ప్రోత్సహించేవారు చాలామంది ఉన్నారు.

ప్రేమని ప్రోత్సహిస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదు... కానీ ప్రేమ ‘తర్వాత’ అన్న ఆలోచనని కల్గించేవారు డబ్బుకి ఆశపడి ఎంత పెద్ద తప్పుని చేస్తున్నారో అర్థం చేసుకోనంత వరకూ నిజమైన ప్రేమికులని చూడడం బహుశా అసంభవం ఏమో....!