అసత్యానంద స్వామికీ.... భౌ....

అసత్యానంద స్వామికీ.... భౌ....

- పద్మశ్రీ

అర్థ రాత్రి పన్నెండు గంటలు...

హైదరాబాదు మహానగరం అప్పుడే మెల్లమెల్లగా ముసుగుదన్నుతోన్న వేళ...

ఓ వీధిలో నుండి కంగారుగా పరుగెత్తుకుంటూ వస్తోంది ఓ ఆకారం...

ఒంటికి కాషాయం రంగు దుస్తులున్నాయి. భుజానికో సంచి వేళాడుతోంది. గడ్డం మీసాలు కలిసిపోయి మొత్తానికి అతనో స్వామీజీ అని అతని అవతారం చెబుతోంది.

పరిగెత్తీ పరిగెత్తీ అలసిపోయి కాస్త సేదతీరడం కోసం చీకటిగా ఉన్న ఓ గోడ వద్దకు చేరుకుని కూర్చున్నాడు.

అతని దృష్టి అంతా తాను వచ్చిన దారివైపు వుంది. అతని ఎవరైనా కనిపెట్టారేమోనన్నభయం అతని కళ్ళలో కనిపిస్తుంది....

అతను భయపడ్డంతా జరిగింది... ఎవరైతే తన జాడ కనిపెడితే నానా రభస అవుతుందో, వారే కనిపెట్టేసాయి..

కనిపెట్టాక కామ్ గా ఊరుకోవడం వారికలవాటు లేని పని. అందుకే ఆ స్వామీజీ వైపు పరుగెత్తుకు వస్తున్నాయి.. ‘భౌ...భౌ...’ అంటూ మొరుగుతూ, అవసరమైతే స్వామీజీ తనకి చిక్కితే అతని పిక్కని లాగడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి.

ఆ అరుపుకి ఆ వీధిలోని వారంతా అప్రమత్తమయితే తన గతేమవుతుందో తలచుకోగానే, ఒక్క గెంతుతో లేచి పరుగు పందెంలో పాల్గొన్న వాడిలా లంకించాడు స్వామీజీ...

ఎట్టకేలకి తను చేరుకోవసిన ప్రదేశానికి చేరుకుని అలాగే కూలబడిపోయాడు.. అతని ఎదురుగా ఓ వ్యక్తి ఉన్నాడు. ‘నాయనా, నా జీవితంలో ఎప్పుడూ ఇలా పరుగెత్తలేదు....

ఆ కుక్కలని తప్పించుకుని వచ్చేసరికి నా తల ప్రాణం తోకకొచ్చింది.’

‘అంతా తలరాత స్వామి... తల రాత... పగలు భక్తుల చేత పూజలు అందుకొంటూ, రాత్రి వేళల్లో సరససల్లాపాలలో మునిగిపోతూ ఎంతో ఆనందంగా గడిపే మీకు ఈ గతి పట్టడం... హా... అంతా విధి...’

‘జరిగినదాని గురించి కాదు, జరగబోయేది ఆలోచించు...’

‘అదే ఆలోచిస్తున్నాను స్వామీ... మీరు ఉదయం ఎవరికంట్లోనైనా పడితే కొంప కొల్లేరవుతుంది... ఈ రాత్రికి రాత్రే రాష్ట్రం విడిచో, దేశం విడిచో వెళ్లిపోవడం మంచిది...

ఆర్నెల తర్వాత మీ గురించి అందరూ మర్చిపోతారు కాబట్టి తిరిగి రావచ్చు, అన్నట్టు ఆ సంచిలో ఏముంది స్వామీ..’ అడిగాడు వినయంగా.

’ఏముంటుంది నాయనా.. నా గురించి నీకు తెలుసుగా... గంజాయి నోట్లో దిగందే నాకు గడవదు... అందుకే ఈ సంచి నిండా గంజాయి నింపుకొచ్చా...’

“ఆహా.. ఏమి దూరదృష్టి స్వామీ....!’

“నీ పొగడ్తలాపు’ స్వామీజీ మొహంలో కోపం ప్రవేశించింది.

‘ఆ మూర్ఖుల పని పట్టందే నా కోపం చల్లారేలా లేదు. ఆ మూర్ఖులని ఎలాగయినా నా ఎదుటకి తీసుకురా... వాళ్ళని ముక్కలు ముక్కలు చేస్తా...’ కోపంగా అన్నాడు స్వామీ...

‘ఏ మూర్ఖులు స్వామీ.... ఓహూ.. మీ గెస్ట్ హౌస్ లో దొంగతనం చేసినవారా... వదిలేయండి స్వామీ.. పాపం దొంగలు వారి పనివారు చేసారు... అందులో వారి తప్పేముంది? అయినా మీ దగ్గర దొంగ నోట్లుంటాయని వారేమన్నా కలగన్నారా...?’ అన్నాడు.

‘మూర్ఖుడా... దొంగాస్వాముల దగ్గర దొంగనోట్లు కాక రిజర్వు బ్యాంకు నోట్లు ఉంటాయనుకున్నారా ఆ దొంగ నాయాళ్ళు? డబ్బు పొతే పోయింది.. ఎంతో కష్టపడి తీయించిన బ్లూ ఫిలిం సిడిలు కూడా తీసుకెళ్ళిపోయారు... వెధవలు...’

‘గట్టిగా అరవకండి స్వామీ... ఎవరైనా వింటే కొంపకొల్లేరవుతుంది...’ భయంగా అన్నాడు అతడు.

‘వింటే విన్నీ.. నా బ్యాక్ గ్రౌండ్ నీకు తెలుసుగా.. నేను ఒక చిటిక వేస్తే చాలు ఐ.పి.ఎస్. ఐ.ఎ.ఎస్. ఆఫీసర్లు బడా బడా లీడర్లు నా పాదాలకి మొక్కడానికి క్యూ కడతారు’ దర్పంగా అన్నాడు స్వామి...

‘అదంతా నిన్నటి వరకు స్వామీ... ఇప్పుడు వారెవరూ మీ దగ్గరికి వచ్చేంత సాహసం చేయరు. గ్రహాలన్నీ మీకు ప్రతికూలంగా ఉన్నాయి...’ స్వామీజీ శాంతించాడు.

‘ప్రస్తుత్తం మన తక్షణ కర్తవ్యం ఏమిటి నాయనా...’ అడిగాడు... కుక్కల బారిన పడకుండా ఈ రాత్రికి రాత్రే ఎటయినా చెక్కేయడమే మన ముందున్న కర్తవ్యం స్వామీ....’

‘హతవిధీ... ఎంత కష్ట కాలం దాపురించింది....’ అనుకుంటూ పారిపోవడానికి సిద్ధపడ్డాడు స్వామీజీ....

ఇలాంటి దొంగస్వాములకి చివరికి పట్టే గతి ఇదే అయినప్పటికీ.. ఇటువంటి స్వాములని నమ్మి, వారి మాయమాటల్లో పడిపోయి తమ జీవితాలని సర్వనాశనం చేసుకునేవారు ఇప్పటికయినా కాస్త కళ్ళు తెరిచి, దొంగ స్వాములకి చెక్ చెబితే బాగుంటుంది కదా......