ఏడ్చేస్తున్నారు.....

ఏడ్చేస్తున్నారు.....

-పద్మశ్రీ

“వా.....వ్వా........వ్వా....”

“ముందా ఏడుపాపురా నాయనా.....”

మరింత గట్టిగా... “వ్వా.... వ్వా..... వ్వా....”

“అబ్బబ్బ... వీడి ఏడుపుతో చచ్చిపోతున్నాను.....” విసుక్కున్నాడు వెంకట్రావ్.

“ఏవండీ బావగారూ... అసలేం జరిగిందండీ... మీ అబ్బాయి ఎందుకలా ఏడుస్తున్నాడు...? ఇంత సడన్ గా ఎందుకు ఇలా మారిపోయాడు....?” డీలాగా అడిగాడు సుందర్రావ్. విషయమేమిటంటే సుందర్రావ్ గారి అమ్మాయిని వెంకట్రావ్ గారి అబ్బాయికి పెళ్ళి నిశ్చయం చేశారు. నిశ్చితార్థం అప్పుడు ఎంతో చలాకీగా, హుషారుగా పెళ్ళి కూతురితో సరదాగా గడిపాడు పెళ్ళికొడుకు.... అదేనండీ వెంకట్రావ్ కొడుకు గోవిందరావు. కానీ.... సరిగ్గా పెళ్ళి ముహూర్తం దగ్గరికి వస్తున్న సమయంలో ఇదిగో ఇలా గట్టిగా... “వా...వ్వా...వ్వా...” అంటూ ఏడ్చేస్తున్నాడు.

అతని ఏడుపుకి కారణం ఏంటో తెలియక అక్కడున్న వారందరూ జుట్టు పీక్కుంటున్నారు. పాపం కొందరికి బోడిగుండు ఉండడంతో ఏం పీక్కోవాలో తెలీక అలాగే ఉండిపోయారనుకోండి.... అది వేరే సంగతి.... జుట్టున్న వాళ్లెంత జుట్టు పీక్కున్నా.... గోవిందరావు నోట్లో నుండి ‘వ్వా’ అనే శబ్ధం తప్ప మరేమీ రావట్లేదు.

“పెళ్ళి కొడుకు ఏడుస్తున్నాడంట....”

“పెళ్ళి ఇష్టం లేదేమో...”

“మరొకర్ని ప్రేమించాడేమో...”

“ప్రేమించడమేంటీ బొందా... ఈ పాటికే పెళ్ళి చేసుకున్నాడేమో...”

“ఛ... అదేం అయ్యుండదు.. అతను ప్రేమించిన అమ్మాయికి మూడోనెలేమో....”

“ఏమో...”

చివరికి ‘ఏమో’ని తగిలించి పాపం గోవిందరావు ఏడుపుకి రకరకాల కారణాలు వెతుకుతున్నారు కొందరు జనాలు.

ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా.... ఎవరు ఎన్ని రకాలుగా ఓదార్చినా... ఎవరు ఎన్ని రకాలుగా బ్రతిమిలాడినా గోవిందరావు నోట్లో నుండి ‘వ్వా’ అనే శబ్ధం తప్ప మరేమీ రావడం లేదు. దాంతో గోవిందరావు తండ్రి వెంకట్రావ్, గోవిందరావుకి కాబోయే మామ సుందర్రావు ఓ గట్టి నిర్ణయానికొచ్చి ఏడుస్తూనే ఉన్న గోవిందరావుని ఓ సైక్రియాట్రిస్టు దగ్గరికి తీసుకొచ్చారు... కంగారు కంగారుగా... బెంగ బెంగగా...

“అబ్బా... ముందు మీరలా బెంగేట్టుకోవడాలూ, కంగారు పడదాలూ అపండయ్యా.... లేకపోతే ముందు మీకు నేను ట్రీట్ మెంట్ ఇవ్వాల్సి వస్తుంది...” నవ్వుతూ అన్నాడు డాక్టరు. “కంగారు పడకుండా ఎలా ఉండమంటారు డాక్టరు గారూ... అసలే వాడి పెళ్ళి దగ్గరికొచ్చింది. ఈ సమయంలో ఎందుకేడుస్తున్నాడో తెలియకుండా అలా ఏడ్చేస్తుంటే మాకు కంగారు కాకుండా మరేముంటుంది చెప్పండి...” కంగారుగా అన్నాడు గోవిందరావు తండ్రి వెంకట్రావ్.

“మీ కంగారునీ, మీ అబ్బాయి ఏడుపునీ ఆపేసే బాధ్యత నాదీ... ముందు సైలెంటుగా కూర్చోండి... మీ అబ్బాయి ఏడుపుకి కారణం ఏమిటో నేను కనుక్కుంటాను కదా...” కూల్ గా అన్నాడు డాక్టర్.

ఆ తర్వాత ‘వ్వా’ అంటూ ఏడుస్తున్న గోవిందరావు వైపు తిరిగి చిన్నగా నవ్వాడు. ఆ నవ్వుకి మరింత పెద్దగా ఏడవడం ప్రారంభించడంతో ఖంగుతిన్న డాక్టరుగారి మొహంలో సీరియస్ నెస్ తెచ్చుకుని గొంతు సవరించుకున్నాడు. “ఊ... మొత్తానికి చాలా సేపట్నుండి నువ్వలా ఏడుస్తున్నావు కాబట్టి నీలో ఉన్న బాధ చాలావరకు బయటికి వెళ్ళే ఉంటుంది యామై రైట్....?” అడిగాడు డాక్టరు.

“వ్వా... వ్వా..” అంటూ ఏడుస్తూనే అవునన్నట్టు తలూపాడు.

“నీలో ఉన్న బాధంతా ఏడుపు రూపంలో బయటికి వెళ్ళాక కూడా అలా ఏడ్చేస్తే నీరసం రావడం తప్ప మరేమీ ప్రయోజనం లేదు... అందుకే... ఆ ఏడుపాపి.... అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావో చెప్పు...” గోవిందరావుని హిప్నాటైజ్ చేస్తున్నట్టుగా అన్నాడు డాక్టరు. అప్పటివరకు అలా ఏడుస్తున్న గోవిందరావు ఠక్కున ఏడుపాపి డాక్టర్ వంక చూశాడు. “వెరీగుడ్... ఊ... ఇప్పుడు చెప్పు ఎందుకు ఏడుస్తూన్నావో...”

“ఎందుకంటే... ఎందుకంటే... మరేమో... మరేమో...” అతడేం చెబుతాడా అని గోవిందరావు తండ్రి వెంకట్రావు ఆతృతగా, కాబోయే మామ సుందర్రావు టెన్షన్ గా చూస్తున్నారు. “

ఊ... మరేమో.... చెప్పు...” డాక్టరుగారు మరింత కూల్ గా అడిగాడు.

“మరేమో... మొన్నే మన రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగాయి.... వా....”

“అవును జరిగాయి.... కాదని ఎవరన్నారు....?”

“కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది... వ్వా...”

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందీ.... మళ్ళీ వై ఎస్ గారే ముఖ్యమంత్రి కూడా అయ్యారు. దానికి నీ పెళ్ళికి, ఈ ఏడుపుకి సంబంధం ఏమిటి...?” కాస్త అసహనంగా అడిగాడు డాక్టరు గారు.

గోవిందరావు తండ్రి. మామగార్లు గోవిందరావునే వింతగా చూస్తూండి పోయారు...

“మరేమో... మరేమో.... వ్వా...”

“అబ్బా.... ఈ మరేమోని పక్కన పెట్టి అసలు విషయానికి వచ్చేసేయ్...” చిరాగ్గా అన్నాడు డాక్టరు గారు. “

మరేమో... మొన్నటి వరకూ కేజీ బియ్యం ధర 20రూపాయలు, ఇప్పుడు 30 రూపాయలయ్యింది.... వ్వా...” అతను చెప్పే సమాధానానికి డాక్టరుతో సహా వెంకట్రావు, సుందర్రావులకి కూడా గట్టిగా జుట్టు పీక్కోవాలనిపించింది.

“దీనికి నీ ఏడుపుకి సంబధమేమిటి నాయనా...”

“పాల ధర పెరిగింది.... వ్వా..”

“దీనికి నీ ఏడుపుకి...”

“కూరగాయల ధరలు పెరిగాయి.. వ్వా...”

“దీనికి నీ..”

“నూనె ధర పెరిగింది.... వ్వా...."

“దీనికి.....”

“సినిమా టిక్కెట్ల ధరలు కూడా పెరిగాయి వ్వా...”

“దీని....”

“రేపో, మాపో పెట్రోలు ధరలు కూడా పెరుగబోతున్నాయి.... వ్వా...”

“దీ...”

“మందుకొట్టి ఇయ్యన్నీ మరిచిపోదామనుకుంటే బీర్ల ధర కూడా అమాంతం పెరిగింది... వ్వా... వ్వా...”

“...............” డాక్టరుకి నవ్వాలో ఏడ్వాలో అర్ధం కావడం లేదు... “దాంతో నాలో భయం పెరిగింది... వ్వా..” ఆ చివరి మాటకి డాక్టరు గారిలో ఉత్సాహం ప్రవేశించింది.

“ఆ... ఇప్పుడు నీ ప్రాబ్లెం అర్థమయింది... పెరిగిన ధరల గురించి అదేపనిగా ఆలోచించడంతో నీలో భయం ప్రవేశించింది... ఆ భయం తోనే అలా ఏడుస్తున్నావన్నమాట...” భుజాలెగరేస్తూ అన్నాడు డాక్టర్ ఏదో కనిపెట్టినట్టు..... “భయం వల్లే అయితే ఫర్వాలేదు... కానీ... కానీ... వ్వా...” ఏడుస్తూనే కాదన్నట్టు తల అడ్డంగా ఊపాడు గోవిందరావు....

“మరెందుకు ఏడుస్తున్నావయ్యా...” అసహనంగా అన్నాడు డాక్టరు గారు.

“ఎందుకంటే... ఎందుకంటే... వ్వా....”

“అబ్బా... ముందా ‘వ్వా...వ్వా..’ అనడం ఆపి అసలు విషయం చెప్పు..” అసహనంగా, చిరాగ్గా అన్నాడు డాక్టరు.

“నేనెందుకుఏడుస్తున్నా నంటే... ధరలన్నీ ఆకాశాన్నంటుతున్న ఈ పరిస్థితిలో పెళ్ళి చేసుకుంటే, పెళ్ళాన్ని ఎలా పోషించాలా అన్న భయంతో... టెన్షన్ తో...”

“ఓస్... అంతేనా...”

అంతే కాదు డాక్టరు గారూ... ఆ భయంతో, టెన్షన్ తో, నాలో మగతనం పోయిందేమోనని డౌటోచ్చీ... వ్వా.... వ్వా... వ్వా...

” అంతలోనే ఆ గదిలోకి ప్యూన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు.... “సార్... సార్... సార్....”

“అబ్బా... ఏందయ్యా అంత కంగారూ ఏమయింది...?” విసుగ్గా అన్నాడు డాక్టరు. “పేషెంట్లు వచ్చారండీ..”

“నా దగ్గరికి పేషెంట్లు రాక మరెవరొస్తారయ్యా... వెయిట్ చేయమను.....”

“అదికాదండీ... అందరూ అచ్చు ఈ బాబులాగే ఏడ్చేస్తున్నారండీ... వాళ్ళందరిదీ ఈ బాబులాంటి ప్రాబ్లమేనటండీ...”

“ఆ......!!!!”