పిటీ...పిటీ... సెలబ్రిటీ

పిటీ...పిటీ... సెలబ్రిటీ

పద్మశ్రీ

ఓ సెలబ్రెటీ ప్రొద్దున్నే అందరూ నిద్రలేచినట్లుగానే నిద్రలేచాడు....

‘అందరూ నిద్రలేస్తారని అంటున్నావుగా... అదేమైనా పెద్ద విశేషమా....?’

‘అబ్బా....! అప్పుడే మీరు ప్రశ్నల వర్షం కురిపిస్తే... నేనెట్టా చెప్పేది... కాస్త ఓపికగా విని సరదాగా నవ్వుకోండి...’

ఆ.. అందరూ నిద్రలేచినట్లుగానే నిద్రలేచాడు కాబట్టి అదేమీ పెద్ద విశేషం కాదు.... పక్కమీది నుండి లేచి ఒళ్ళు విరుచుకుని బాత్రూంలోకి నడిచాడు. అతను లోనికి వెళ్ళాడో లేదో... దభ్... మని పెద్ద శబ్దం....ఆ సెలబ్రిటీ బాత్రూంలో జారి కిందపడ్డాడు. మరుక్షణమే న్యూస్ ఛానల్స్ లో ప్లాష్ న్యూస్ వచ్చేసింది...... ‘ప్రముఖ సెలెబ్రిటీ రెండు క్షణాల క్రితమే బాత్రూంలో జారి క్రిందపడ్డాడు...’ అని.

సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న ఆ సెలబ్రెటీ భార్యకి బాత్రూంలో అంత పెద్ద శబ్ధం వచ్చినా వినిపించలేదు.... కారణం.... ఆమె ఇంట్రెస్టుగా టీవీ చూస్తుండటమే... అలా చూస్తుండడంవల్ల ఆ ప్లాష్ న్యూస్ లో వస్తున్నది తన భర్త గురించి అని తెలుసుకుని, కంగారుగా బాత్ రూంవైపు పరుగు తీసింది....

అప్పటికే ఆ బాత్ రూం చుట్టూ కెమెరాలు పట్టుకుని ఛానెల్ ప్రతినిధులు గుమిగూడి ఉన్నారు. వారిని తప్పించుకుని బాత్ రూంలోకి జొరబడడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ‘ఏమిటిదంతా... ముందు మీరిక్కడినుండి వెళ్ళిపోండి.... ఇది బాత్ రూమయ్యా...’ అంటూ కోపంగా అరిచాడు ఆ సెలబ్రెటీ... ‘అలా మీరు ఆవేశంగా మాట్లాడకండి సార్.... మీరు బాత్ రూంలో జారిపడిన విషయం ప్రజలందరికీ తెలిసిపోయింది.... లైవ్ టెలికాస్ట్ వల్ల మిమ్మల్ని వారు చూస్తున్నారు.. ముందు మీ అండర్ వేర్... నడుముకి చుట్టుకున్న టవల్ సర్దుకోండి... కాస్త సంయమనం పాటించండి... మేమడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి...’ కాస్త మెల్లిగా చెప్పాడు ఓ విలేకరి. దాంతో షాకయిపోయాడు ఆ సెలబ్రెటీ....

‘ఇప్పుడు చెప్పండి సార్... అసలు మీరు ఎలా జారిపడ్డారు... మీకు మీరు కావాలనే జారిపడ్డారా...? ఈ పడడం వెనక ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయంటారా...? మీరంటే గిట్టని వాళ్ళు ఎవరైనా మీరు బాత్ రూంలోకి వెళ్ళడం చూసి వెనకనుండి ముందుకి తోసేశారంటారా... అలా పడడంలో మీ వెన్నుపూసలు ఏమైనా కదిలాయా... అలా వెన్ను పూసలు కదలడం వల్ల మీరు సంసారానికి పనికివస్తారా లేదా?.... చెప్పండి సార్..... ఈ విషయాలని తెలుసుకోవడానికి ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా, ఆనందంగా ఎదురుచూస్తున్నారు...’ అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. ‘అయ్యా... నాయనల్లారా... ముందు నన్ను పైకి లేపండి.... నా నడుములు విరిగిపోయాయి ఒళ్ళంతా నొప్పిగా ఉంది... వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాలి...’ ఏడవలేక, నవ్వలేక, ఏడుపు గొంతుతో నవ్వుతూ అన్నాడు ఆ సెలబ్రిటీ... ఆ మాటలు విన్న ఓ ప్రతినిధి వెంటనే తన సెల్ తీసాడు...

‘ఆ.... రోజు.... ఈ సెలబ్రెటీ గారు మరి కొద్దిసేపట్లో హాస్పిటల్ కి వెళ్ళడానికి సిద్దపడుతున్నారు... కాబట్టి సిటీలోని అన్ని ప్రధాన హాస్పిటల్స్ లో మన కెమెరామెన్ లని సిద్దంగా ఉండమని చెప్పు...’ అంటూ మెసేజ్ పాస్ చేసాడు.

ఆ సెలబ్రిటీ తాను సెలబ్రిటీని ఎందుకయ్యాన్రా భగవంతుడా...? అన్నంత విరక్తి వచ్చింది.

రాను రాను ఇలాంటి సీన్లు కూడా మీడియాలో చూడాల్సి వస్తుందో ఏమో... ఎందుకంటే సెలబ్రెటీల ప్రతీ అడుగుని మీడియా గమనిస్తూనే ఉంటుందిగా....! ప్రజలకి వార్తని అందించాలనే ఆశయం బాగానే ఉన్నా.......... అది ప్రజలకి, సెలబ్రిటీలకి కూడా అసహనం కలిగించేలా ప్రచారం చేయడం అవసరమా....? అన్నది మీడియా వారికే తెలియాలి.. ఒకప్పుడు బ్రిటిష్ యువరాణి చార్లెస్ డయానా మీడియా వారినుండి తప్పించుకోవాలనే ప్రయత్నంలోనే కారు యాక్సిడెంట్ లో చనిపోయింది. ఇక్కడ కూడా మీడియా బారిన పడి ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే గానీ.... ఇలాంటి ‘సన్నివేశాలు ఆగవేమో... ఏమో...!