కామన్ మ్యాన్ సెన్సాఫ్ హ్యూమర్

 

కామన్ మ్యాన్ సెన్సాఫ్ హ్యూమర్

 

 

 

 

 

 

 

సి. హెచ్. సంతోష్ కృష్ణ

"ఇచ్చట ఈ కిందివి నేర్పబడును" అని రాసున్న బోర్డును చూసిన సుబ్బారావు ఉలిక్కిపడ్డాడు. ఇచ్చట ఈ కిందివి నేర్పబడును - అని మాత్రం ఉంది. కానీ, ఆ కింద వివరాలు ఏమీ లేవు. ఏమీ లేకపోవడంతో అసలేముందో తెలుసుకోవాలనే గొప్ప ఆలోచన సుబ్బారావు మనసులో కదలగానే ముందు వెనకా, ఈ పక్కా ఆ పక్కా ఆలోచించి చటుక్కున ఆ బోర్డు ఉన్న ఆఫీసు లోనికి ఎంటరయ్యాడు.

అప్పటికే సుబ్బారావులా ఆలోచించి లోపలికి వచ్చినవాళ్ళ లైను చాంతాడంత ఉండటంతో సుబ్బారావు మళ్ళీ ఉలిక్కిపడ్డాడు. ఇదేదో ఖచ్చితంగా తెలుసుకునే యవ్వారంలాగా ఉందే అని మనసులోనే అనుకుని తాను కూడా ఆ లైనులో నిలబడ్డాడు.

అసలింతకీ వాళ్ళు ఏం నేర్పిస్తారబ్బా అనుకుంటూ ఉండబట్టలేక తన ముందు క్యూలో నిలుచున్న ఆయన్ని కదిపాడు సుబ్బారావు.

''సార్, ఇంతకీ వీరు ఏం నేర్పిస్తారు?'' అన్నాడు ఆత్రుతగా. ముందు నిలబడ్డాయన సీరియస్ గా వెనక్కి చూసి తన చేతిలో ఉన్న పాంప్లెట్ ఒకటి సుబ్బారావు చేతిలో పెట్టాడు.

అతనలా సేరియస్ గా చూస్తే చూడనీ కానీ చేతిలో మాత్రం పాంప్లెట్ పెట్టడంతో సుబ్బారావు ఆనందంగా దాన్ని అందుకున్నాడు. ఆ పాంప్లెట్ లో ఉన్న పదాలను కళ్ళతోనే గడ గడా చదివేశాడు.

ఇంతకీ పాంప్లెట్ లో ఏముందంటే... ''వెల్ కం టు ఎక్స్, పెక్స్, థూక్స్ రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ ఆఫ్ కామన్ మ్యాన్ కామన్సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి స్వాగతం.. సుస్వాగతం.. ఈ మా ఎక్స్, పెక్స్, థూక్స్ సంస్థ ద్వారా కామన్ మ్యాన్ కి ఎన్నో విషయాలు నేర్పిస్తాం.

ఆ విషయాలు కామన్ మ్యాన్ అనేవాడు ఖచ్చితంగా నేర్చుకుని తీరాలని మా ఉద్దేశం. ఎందుకంటే నేడు సమాజంలో కామన్ మ్యాన్ జీవించేందుకు కావలసిన ముడిసరుకు అంతా మేం మీకు అందిస్తాం. ముడి సరుకంటే తెగ ఎక్సర్సైజ్ చేయాలి కాబోలని బెదిరిపోకండి. ఇది చాలా తేలిక. జస్ట్ మీరు చూసి నేర్చుకోవడమే, అంతే. ఇంతకీ పాయింటుకు వద్దాం...

అసలు మేం మీకు నేర్పించేది ఏమిటంటే..

1. మీకు ఒకరిపై పీకల వరకూ కోపంగా ఉందనుకోండి.. మీ కోపం చల్లారేదాకా వారిని ఏ విధంగా తిట్టాలి..

2. మీరు, మీ ఎదుటివారిని తీవ్రంగా టెన్షన్ కి గురిచేసి మీలో ఉన్న శాడిజం శాటిస్ ఫై అయ్యేలా చేయడం ఎలా?

3. అతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూపించి గొడవలు సృష్టించడం ఎలా?

4. బుద్దిగా చదువుకునే పిల్లలకి సెక్స్ బొమ్మలు చూపిస్తూ వారిని ఉత్తేజపరిచి తప్పు దోవ పట్టించడం ఎలా?

5. సమాజంలో ఉన్న చీడని దులిపేస్తున్నామని చెబుతూ మరింత చీడని నెత్తిన రుద్దడం ఎలా?

6. టెర్రరిస్టులు, దొంగలు, రౌడీలు, రేపిస్టులకు వారి వారి యాక్టివిటీస్ లో మరింత యాక్టీవ్ గా పాల్గొనేలా చేయడం ఎలా?

ఆ లిస్టును చూడగానే సుబ్బారావు బుర్రకాయ్ బెలూన్ లా ఉబ్బిపోయింది. అప్పటివరకూ అసలు అలాంటి ఆలోచనలు చేయొచ్చని కూడా సుబ్బారవుకు తెలీదు. అందుకే అంతచేటు ఆనందం. సమాజానికి మంచి చేయడం అన్నది పక్కనపెడితే ఎదుటి మనిషిని పాడుచేసి తాను మాత్రం ఎదిగిపోవాలన్న ఓ ఆలోచన ప్రతి మనిషిలోనూ ఎక్కడో ఓ మూల ఉండే ఉంటుంది. కానీ మానవత్వం, మంచితనం ముందు అవి మరుగున పడిపోతాయి. కానీ, ఆ మరుగున పడిపోయిన దాన్ని వెలికితీసి మరీ మనిషిలోని మృగాన్ని నిద్రలేపే విద్య ఏమిటబ్బా అది..

అలా ఆలోచించిన సుబ్బారావుకి అదేమిటో తెలుసుకోవాలన్న బలమైన కోరిక కలగడంతో ఆ క్యూలైన్ లో స్థిరంగా నిలబడిపోయాడు.

ఆ క్యూ లైను ముందు ఓ వ్యక్తీ అందరి దగ్గరా డబ్బులు కలెక్టు చేస్తున్నాడు. అతనికి వెనుకగా ఓ పది క్యాబిన్లు కనిపిస్తున్నాయి.

డబ్బులు కలెక్ట్ చేసిన వారిని ఒక్కొక్కరినీ ఒక్కో క్యాబిన్ లోకి పంపిస్తున్నారు. సుబ్బారావుకి చాలా ఆత్రంగా ఉంది. ఆ క్యాబిన్ లోకి దూరిపోయి ఇంతకీ వారు ఎలా కోచింగ్ ఇస్తున్నారో తెలుసుకోవాలనే ఆరాటం అతనిది. చివరికి ఓ రెండు గంటలు గడిచాక గానీ సుబ్బారావు వంతు రాలేదు.

సుబ్బారావు డబ్బులు కలెక్ట్ చేస్తున్న అతని దగ్గరికి రాగానే అతను సుబ్బారావుని చూసి ''సార్, ఏది సెలెక్ట్ చేసుకున్నారు?'' అని అడిగాడు.

''సెలెక్ట్ చేసుకోవడం ఏంటి?'' అతను సుబ్బారావును ఎగాదిగా చూసి

''అదేనండీ, మీ చేతిలో ఆ పాంప్లెట్ ఉంది కదా.. అందులో కేటగిరీలు ఉన్నాయి కదా.. వాటిల్లో మీకు ఎ కేటగిరీ నచ్చితే ఆ కేటగిరీలోకి మిమ్మల్ని పంపిస్తామన్నమాట.. మీకు అందులో ఉన్న మొత్తం కేటగిరీలు కావాలన్జుకుంటే దానికి సెపరేట్ రేటు ఉంటుంది..''

''సరే, అయితే నాకు చిన్న పిల్లలకు సెక్స్ బొమ్మలు చూపిస్తూ వారిని తప్పుదోవ పట్టించడం అనే కేటగిరీ ఉంది చూశారూ, అది కావాలి..''

''ఓస్, అదా, అయితే ఓ అయిదొందలు ఇవ్వండి..'' అతను అడిగినట్టుగానే అయిదు వందలు ఇవ్వగా సుబ్బారావును ఓ క్యాబిన్ లోకి పంపించాడు అతను.

ఆ క్యాబిన్ లోకి వెళ్ళి ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసిన సుబ్బారావు కళ్ళు గిరగిరా తిరిగాయి. అతని ఎదురుగా ఓ టి.వి. ఉంది. ఓ న్యూస్ చానెల్ లో వచ్చిన ప్రోగ్రామ్లు వస్తున్నాయి. సినిమావాళ్ళకి సంబంధించిన ఎఫైర్స్ గురించి, హీరోయిన్లు నగ్నంగా నటించిన చిత్రాల గురించి (నగ్నంగా ఉన్న ఫోటోలతో సహా) ఏ హీరోయిన్ ఏ హీరోతో డేటింగ్ చేస్తోంది అన్న అంశాలు, (బెడ్ రూం సీన్లతో సహా) ఓ క్యారెక్టర్ నటి మరో యువ హీరోతో దొంగచాటుగా నడుపుతున్న యవ్వారం అంటూ (వారు శృంగారంలో పాల్గొన్న సీన్లతో సహా) ఓ వ్యాంప్ ఆర్టిస్టు వ్యభిచారం చేస్తూ పోలీసులకు చిక్కిన యవ్వారం (ఆ ఆర్టిస్టు వ్యభిచారం చేస్తున్నప్పుడు తీసిన ఫోటోలను యధాతధంగా చూపిస్తూ)

సుబ్బారావుకి ఆ ప్రోగ్రామ్లు వరుసగా చూసేసరికి మతి పోయింది.

ఆ మిగతా క్యాబిన్ లలో కూడా ఆయా న్యూస్ చానల్స్ లో వచ్చిన ప్రోగ్రామ్ల నుండి కేటగిరీలుగా విడగొట్టి వాటిని సేకరించి ఎక్స్, పెక్స్, థూక్స్ రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ ఆఫ్ కామన్ మ్యాన్ అనే సంస్థ ఏర్పాటు చేసి కామన్సెన్స్ ఆఫ్ హ్యూమర్ ను పెంపొదిస్తుందన్నమాట.

అవును మరి.. మెరుగైన సమాజం కోసం ఏర్పాటు కాబడిన న్యూస్ చానల్స్ లో వచ్చే ప్రోగ్రామ్లను ముందు ముందు ఎలా కామన్ మ్యాన్ కామన్సెన్స్ ఆఫ్ హ్యూమర్ ను పెంచేందుకు ఇలాంటి సంస్థలు కూడా రావచ్చు.. ఏమో, ఎవరు చెప్పగలరు?!