హలో... రాంగ్ నెంబర్.! - 64

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 64

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

"నేను ఓడిపోయినట్టు ఒప్పుకోవడమేంటి?" అడిగాడు శ్రీకర్.

"మీకు అమ్మాయిల వీక్నెస్ వుందని, 'ఆ' పరిచయాలు లేకుండా మీరు వుండలేరని.." తాపీగా చెప్పింది ప్రియంవద.

"చీ ఛీ చ్చి చ్చీ" అన్నాడు శ్రీకర్.

"ఏంటీ మీ మీద మీకే అసహ్యం వేస్తోందా?" అడిగింది ప్రియంవద.

"కాదు, నీ మీద అని అనడానికి నాకు మనసొప్పడం లేదు కాబట్టి" చెప్పి అటువైపు తిరిగి పడుకున్నాడు శ్రీకర్.

ఒక్కక్షణం ప్రియంవద మనసు విలవిల్లాడిపోయింది. సరదాకు కూడా తనను అసహ్యించుకోని మనిషి, తను మాత్రం మొగుడ్ని రెచ్చగొట్టే ప్రయత్నంలో ఎంతమాట అనేసింది? మరో పరిస్థితుల్లో అయితే, మొగుడి గుండెలో తలదాచుకునేది. పందెం గుర్తుకు వచ్చి నిభాయించుకుంది.

*            *            *

బద్ధకంగా కళ్ళు తెరిచాడు శ్రీకర్. టైం చూసుకున్నాడు. ఆరున్నర. ఇంకాసేపుపడుకుంటే పోలా...అనుకున్నాడు. ఓసారి ప్రియంవద వంక చూసాడు. నిద్రలో ముద్దొచ్చేంత అందంగా వుంది. ఫ్యాన్ గాలికి ఆమె ముంగురులు అటూ యిటూ కదులుతున్నాయి.

గులాబీరేకుల్లో ముంచినట్లున్నాయి పెదవులు. శ్రీకర్ ఒక్కక్షణం అలానే చూస్తుండిపోయాడు. మెల్లిగా ఆమె మీదికి వంగాడు. నుదురు మీద ముద్దుపెట్టుకున్నాడు. మూసిన ఆమె కళ్ళ మీద ముద్దుపెట్టుకున్నాడు. ఇంకా కిందికి వచ్చి పెదవుల మీద ముద్దుపెట్టుకుంటే,  మెలుకువ వచ్చి నాన్ స్టాప్ గా పందెం గురించి క్లాసు పీకుతుందన్న డౌట్ వచ్చి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు.

నిద్ర ఎగిరిపోయినట్టు అనిపించింది. లేచి బాత్రూంలోకి వెళ్ళాడు. శ్రీకర్ బాత్రూంలోకి వెళ్ళగానే కళ్ళు తెరిచింది ప్రియంవద. నుదురు మీద, కనుల మీద చేయి వేసుకొని నవ్వుకుంది. భర్త ముద్దు చేష్టలన్నీ  నిద్రపోయినట్టు నటించి గమనిస్తూనే వుంది.

*                  *                    *
శ్రీకర్ ఆఫీసుకు వెళ్ళగానే జేమ్స్ బాండ్ కు ఫోన్ చేసింది.


"డోంట్ వర్రీ మేడమ్. నేను మీ యింటి ఎదురుగా వుండే టీ బండీ దగ్గరే వున్నాను. శ్రీకర్ గారిని ఫాలో అవుతాను"

"వీలైతే ఫోటోగ్రాఫ్ తో ఎవిడెన్స్ ప్రిపేర్ చేయండి"


"తప్పకుండా..కోటుజేబులో కెమెరా కూడా వుంది. పూర్వాశ్రమంలో ఫోటోగ్రాఫర్ అనుభవం వుంది. కాకపోతే
జీవంలేని ఫోటోలు తీసేవాడిని"

"అంటే మీరు శవాల ఫోటోగ్రాఫరా?" అడిగింది కంగారుగా ప్రియంవద.

అటువైపు జేమ్స్ బాండ్ చిన్న నవ్వు నవ్వి.

"అవైతేనే చాలా సహజంగా వస్తాయి. మీరేం కంగారు పడకండి. నేను ఫోటోలు చాలా అద్భుతంగా తీస్తాను"

"సరే..అయితే..మధ్యాహ్నం ఓసారి ఫోన్ చేసి ప్రోగ్రెస్ చెప్పకూడదూ..."

"తప్పకుండా వుంటాను" చెప్పి ఫోన్ కట చేసాడు జేమ్స్ బాండ్.

ప్రియంవద జేమ్స్ బాండ్ ఫోన్ నెంబర్ ని ఎరేజ్ చేసింది.

*           *          *

శ్రీకర్ డ్రైవ్ చేస్తూనే ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఢిల్లీ నుంచి షాలిని. "ఆల్ ద బెస్ట్ షాలినీ..మళ్లీ మనం కలుసుకోకపోతేనే బావుంటుందేమో..." అన్నాడు శ్రీకర్.

"వాట్ శ్రీ...నేనేమైనా తప్పు చేసానా? ఐ లవ్ యు శ్రీ.." అటు వైపు నుంచి షాలిని కంఠం.

"పెళ్ళయిన నాకు, పెళ్ళికాని, మిస్ యూనివర్స్ కావాలని ప్రయత్నించే నీకు మధ్య ప్రేమ వుంటుందని నేను అనుకోవడం లేదు. జస్ట్ ఆకర్షణ...వ్యామోహం...అంతే..అదీ కాకపోతే కొద్దిపాటి యిష్టం."

"అంత నిష్కర్షగా ఎలా మాట్లాడగలరు. నేను చాలా హర్ట్ అవుతున్నాను తెలుసా" అంది షాలిని.

"మనకున్న కొద్ది టైంని బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేయడానికి ఉపయోగించమని నువ్వు చెప్పినప్పుడు నేను హర్ట్ అయ్యాను. తప్పదు షాలిని...ఎనీ హౌ మనం ఫ్రెండ్స్ గా వుందాం. బై" చెప్పి ఫోన్ కట్ చేసాడు శ్రీకర్.

ఢిల్లీలో వున్న షాలిని ఓ నిట్టూర్చి విడిచింది. 'తన ఫీలింగ్స్ బయటపెట్టకుండా శ్రీకర్ ని డబ్బు డ్రా చేసి తీసుకురమ్మని తొందరపెట్టకుండా వుండివుంటే బావుండేది. బంగారు బాతును ఒకేసారి చంపినట్టయింది' అనుకుంది షాలిని. ఆ క్షణమే మరో ఆలోచన కూడా వచ్చింది. ఇప్పుడు తనకు ఆర్థిక అవసరాలను తీర్చే మంచి పార్టీ కావాలి. ఈ క్షణం నుంచి తను ఆ పనిలో వుండాలి.

*            *       *