హలో... రాంగ్ నెంబర్.! - 63

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 63

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

"లూసీ..నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు..నేను అమ్మాయిల వెంట పడతాను. అమ్మాయిలంటే నాకు యిష్టమే. కానీ వాళ్ళని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసో, వాళ్ళ నిస్సహాయతనో క్యాష్ చేసుకుని వుద్యోగం యిచ్చే వ్యక్తిలా కనిపిస్తున్నానా? నీ నిస్సహాయతను ఆధారం చేసుకొని, నిన్ను పొందాలని అనుకుంటున్నానని ఎలా అనుకుంటున్నావు? నా క్యారెక్టర్ అంత నీచస్థాయికి దిగజారిందన్న నిర్ణయానికి ఎలా వచ్చావు? నువ్వు పిలవగానే హోటల్ కు వచ్చాననా?" శ్రీకర్ అడిగాడు.

"సారీ..సర్..నా వుద్దేశం అది కాదు"

"మరేమిటి..చెప్పు లూసీ ...పచ్చిగా చెప్పాలంటే నువ్వు నా పక్కలో పడుకుంటేనే వుద్యోగం యిస్తానని అన్నానా?"

"ఛ...ఛ... అలాంటిదేమీ లేదు సార్"

"మరి..."

"ప్లీజ్ ట్రయ్ టు అండర్ స్టాండ్ సార్ మీకు ఏదో ఎర చూపి వుద్యోగం సంపాదించుకున్నాననే ఫీలింగ్ నాకు రాకూడదని..."

శ్రీకర్ లూసీ వంక చూసాడు. ఆమె ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. కొద్ది క్షణాల్లోనే సర్దుకున్నాడు.

"ఇట్సాల్ రైట్...నువ్వు రేపు వచ్చి జాయిన్ అవ్వచ్చు. అన్నట్టు నీ లగేజ్ ఎక్కడ?"

"ఒకే ఒక సూట్ కేస్...నా బట్టలు..అంతే"

"సరే...రేపు ఆఫీసు దగ్గర్లోనే ఏదైనా ప్లాట్ చూడమని బ్రోకర్ కు చెబుతాను. కావాల్సిన సామాను తీసుకో. ఆఫీసులో అడ్వాన్స్ తీసుకోవచ్చు. దీనిక్కూడా ఎలాంటి కండీషన్ లేదు. నేను ఏమీ ఆశించను...సరేనా?"

"అయామ్ ఎక్స్ ట్రీమ్ లీ సారీ సర్. మిమ్మల్ని బాధపెట్టినట్టున్నాను" అంది అపాలిజిటిక్ గా లూసీ.

"నో..నో..ఫ్రాంక్ గా నీ ఫీలింగ్స్ చెప్పావు. చాలా మందిలా ఏదో మభ్యపెట్టి వుద్యోగం సంపాదించుకోలేదు నువ్వు ...ఐ లైకిట్"

"థాంక్యూ సార్" అంది లూసీ.

ఓసారి వాచీ వంక చూసి "నేను వెళ్ళనా?" అని అడిగాడు.

"అలాగే" అన్నట్టు తలూపింది. ఆమె మనసులో మాత్రం ఇంకాసేపు శ్రీకర్ వుంటే బావుండునని వుంది. నిజానికి శ్రీకర్ ఫీలింగూ అలానే వుంది. షాలిని తాలూకు షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు.

శ్రీకర్ వెళ్ళిపోయాడు. లూసీ ఒంటరిగా ఆ గదిలో మిగిలింది. ఒక్కసారిగా ఆ గదిని, తన మదినీ శూన్యం ఆవహించిన ఫీలింగ్ కలిగింది.

*               *                 *   

శ్రీకర్ వెళ్ళగానే లూసీ మంచానికి అడ్డంగా పడుకుండిపోయింది. ఆమె చేతిలో అపాయింట్ మెంట్ ఆర్డర్ వున్న కవర్ వుంది. దాన్ని తన గుండెలకు ఆన్చుకుంది.

తన బ్రతుక్కి ఓ దారి దొరికింది. అనుకోకుండా ఇండియా వచ్చిన తనకు ఓ షెల్టర్ దొరికింది. అదీ శ్రీకర్ వల్ల. ఒకవేళ తనకు శ్రీకర్ పరిచయం కాకపోయి వుంటే...? ఆ ఫీలింగ్ ఆమె భరించలేకపోతోంది.

ఎప్పుడైతే ఆమె ఆలోచనల్లో శ్రీకర్ వచ్చి చేరాడో, ఆమె మనసులో చిన్నపాటి ఆహాదం అతిథిలా వచ్చింది.   ఆ ఫీలింగ్ ఆమెకు కొత్త ఉత్సాహాన్ని యిచ్చింది. ఆపాయింట్ మెంట్ ఆర్డర్  ని తన హ్యాండ్ బ్యాగులో పెట్టి బాత్రూం వైపు నడిచింది.

నైటీని విప్పి హేంగర్ కు తగిలించింది. షవర్ ఆన్ చేసింది. ఆమె అనాచ్చాదిత దేహం మీదుగా షవర్ జల్లుపడుతోంది. ఆమె తలమీదుగా, మెడమీదుగా, అలా...అలా...నీటి ధారలు జారిపోతూ వున్నాయి.

ఒక్కక్షణం అలానే కళ్లు మూసుకుంది. సింక్ పక్కనే వున్న సోప్ చేతిలోకి తీసుకుంది. ఆమె శరీరాన్ని సబ్బు నురగ స్పృశిస్తోంది. సోప్ ని శరీరానికి తాకిస్తూ వెళ్తోంది.

ఆమె చేయి ఆమె వీపుని రుద్దే ప్రయత్నం చేసింది.

"అమ్మా..." అంది అప్రయత్నంగా..పసిమి ఛాయతో మెరిసిపోయే ఆమె వీపు మీద....నల్లటి చారిక...బెల్ట్ దెబ్బ స్పష్టంగా కనిపిస్తోంది. ఆమెకు ఆ క్షణం విన్సెంట్ గుర్తొచ్చాడు.