హలో... రాంగ్ నెంబర్.! - 48

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 48

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

దిగ్గున లేచింది ప్రియంవద.

మంచం మీదినుంచి స్లిప్పయి కార్పెట్ మీద పడ్డ శ్రీకర్ అయోమయంగా ప్రియంవద వైపు చూస్తూ...

"నీకివ్వాళ్ళ ఏమైందే..వర్మ 'భూత' గానీ అవహించిందా?" అడిగాడు నడుము కలుక్కుమన్న ఫీలింగ్ ని మొహంలో ఎక్స్ ప్రెస్ చేస్తూ.

"ఊహూ...మనం వేసుకున్న పందెం పూనింది" చెప్పింది ప్రియంవద.

"అదేంటి పందేమింకా నువ్వు మరిచిపోలేదా?"

"మరచిపోవడమా...నో..నెవ్వర్. పందెం ఈజ్ పందెమే"

"అంటే పందెం విషయంలో నువ్వు అంత సీరియస్సా?"

"డబుల్ సీరియస్" అంది ప్రియంవద బ్లాంకెట్ ని మెడమీదుగా నిండుగా కప్పుకుంటూ.

"ఏంటీ చలేస్తుందా? నేను దగ్గరకొస్తే వెచ్చగా వుంటుంది" చిన్నపాటి ఆశతో అడిగాడు.

"నువ్వు దగ్గరకు రాకుండా వుండాలనే ఈ ఏర్పాటు" అంది ప్రియంవద.

భార్య మొహంలో సీరియస్ నెస్ అర్థమైంది. తనెంత మెలోడ్రామా ప్లే చేసినా వర్కవుట్ అవ్వదన్న విషయం స్పష్టమైంది. లేచి, తిరిగి మంచమ్మీద పడుకునే ఓపిక కూడా లేక అలానే కార్పెట్ మీద పడుకున్నాడు.

ప్రియంవద కార్పెట్ మీదే పడుకున్న మొగుడి వంక చూసి "దిండు కావాలా?" అని అడిగింది.

"హు...నీకు మొగుడంటే ఎంత ప్రేమే" అన్నాడు ఓ సరసమైన నవ్వునవ్వి.

*           *             *

ఉదయమే బద్ధకంగా కళ్ళు తెరిచి, తనెక్కడున్నదీ చూసుకున్నాడు. కార్పెట్ మీదే వున్నాడు. ప్రియంవద అప్పటికే లేచి స్నానం చేసొచ్చింది.

"గుడ్ మానింగోయ్" అన్నాడు భార్య వంక చూసి చిన్న స్మయిల్ తో శ్రీకర్.

"గుడ్ మానింగ్ రా" అంది ప్రియంవద. షాక్ తిన్నట్టు చూసాడు.

"అదేమిటి...నన్ను 'రా' అంటావా?"

"పందెం మొదలయ్యాక ముగిసే వరకూ నో మర్యాద" అంది ప్రియంవద.

తన మీద సహాయ నిరాకరణ ఆపరేషన్ మొదలైందని అర్థమైంది శ్రీకర్ కు. మెల్లిగా లేచి బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు.

*              *           *

ప్లేటులో వేడి వేడి ఇడ్లీ, చట్నీ పెట్టింది. బబ్లూ బుద్ధిగా టిఫిన్ చేసి, స్కూల్ ఆటోలో స్కూల్ కు వెళ్ళిపోయాడు.

ప్రియంవద మొగుడికి కాఫీ యిస్తూ ఓ స్లిప్ యిచ్చింది.

"ఏమిటిది..కొంపదీసి తిన్న టిఫిన్ కు, కాఫీకి బిల్లుగానీ కాదు కదా" అనుమానంగా అడిగాడు శ్రీకర్.

"చూడండి మీకే తెలుస్తుంది" అంది ప్రియంవద. స్లిప్ మీద 'మూడు వందల అరవై నాలుగు' అని రాసి వుంది.

"ఇదేమిటి...జైలులో ఖైదీలకు ఇచ్చినట్టు నాకు నెంబరిచ్చావా?"

"కాదు..ఇంకా మన పందెం గడువు మూడు వందల అరవై నాలుగు రోజులుంది."

తల పట్టుకున్నాడు శ్రీకర్. భార్య ఈ విషయంలో చాలా సీరియస్ గా వుందని అర్థమైంది.

*              *                  *

కారు డ్రైవ్ చేస్తూ కూడా శ్రీకర్ ప్రియంవద గురించే ఆలోచించాడు. ప్రియంవద ఇప్పుడేం చేస్తుంది? తను అమ్మాయిలతో తిరిగిన విషయం ఎలా తెలుసుకుంటోంది? పందెం అయితే కాసింది గానీ దానినెలా ఎదుర్కొంటుంది? కొన్నాళ్ళు పోతే మరిచిపోతుంది. తను ఎవ్వరితోనూ తిరగడం లేదని చెబితే సరి...ఈ ఆలోచన అతనికి భేషుగ్గా అనిపించింది. తన ఆలోచన తప్పని అతనికి తెలియలేదు.

*                 *            *