హలో... రాంగ్ నెంబర్.! - 41

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 41

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

"ఇప్పుడా స్టోరీ అవసరం అంటావా?" అడిగాడు కొడుకుని.

"మంచి నావెల్టీ వున్న స్టోరీ డాడీ"

"సరే, మూడు ముక్కల్లో చెప్పు" అన్నాడు శ్రీకర్.

"భలే ఇన్సిడెంట్ డాడీ...నా కథకు మూడుకూ లింకు వుంది. ఒక హీరోయిన్ డాడీ"

"తర్వాత"

"ఆమెకు పెళ్ళవుతుంది డాడీ"

"ఆ తర్వాత చెప్పు"

"ఆమెకు మళ్లీ పెళ్ళవుతుంది డాడీ"

"అదేంటి..ఇందాకే పెళ్ళవుతుందని చెప్పావుగా"

"అవును డాడీ...ఇది రెండో పెళ్ళన్నమాట"

"అంటే ఆ మొగుడికి డైవోర్స్ యిస్తుందా?"

"పూర్ డాడీ....మొగుడు ఇంట్లోనే ఉంటాడు. బలీయమైన విధి డాడీ. ఆ బలీయమైన విధి వల్ల మళ్లీ ఆ హీరోయిన్ కు పెళ్ళవుతుంది"

"ఇద్దరు మొగుళ్ళుంటే చట్టం ఒప్పుకోదురా. నువ్వింకా చిన్నపిల్లాడివి"

"అబ్బ...ఒప్పుకుంటుందిలే డాడీ...నేను చూసే సీరియల్ లో ముగ్గురు పెళ్ళా,లుంటారు."

"సరే చెప్పు...హీరోయిన్ కు మళ్లీ పెళ్లవుతుంది...ఆ తర్వాత..." నీరసంగా అన్నాడు.

"ఆ హీరోయిన్ కు మళ్లీ పెళ్ళవుతుంది"

"చెప్పిందే ఎన్నిసార్లు చెబుతావు, మళ్లీ పెళ్ళవుతుందని యిందాకే చెప్పావు కదా"

"అబ్బ...నన్ను కన్ ఫ్యూజ్ చేయొద్దు డాడీ. నేను మళ్లీ అన్నది ఒక్కసారి. మళ్ళీమళ్ళీ అన్నది రెండుసార్లు. అంటే హీరోయిన్ కు మూడుసార్లు పెళ్ళవుతుందన్న మాట...నావెల్టీ డాడీ"

"అంటే హీరోయిన్ కు మొగుళ్ళా?"

"అవును డాడీ...టైటిల్ ఏంటో తెలుసా? మళ్లీ మళ్లీ మళ్లీ పెళ్ళాడుతా"

"బావుందిరా....ఇంతకీ ఏ ప్రొడ్యూసర్ కు చెబుతావు?"

"నారేంజ్ కు ఏక్తాకపూర్ అయితే బెటర్. అన్ని భాషల్లో తీసేస్తుంది"

"బబ్లూ...నువ్వు రోజూ టీవీ సీరియల్స్ చూడ్డం మానేయ్. నీ బుర్రనిండా మట్టి పేరుకుపోతూంది" సలహా యిచ్చాడు కొడుక్కి.

"డాడీ కారాపు" సడన్ గా అరిచాడు బబ్లూ.

కారాపి కొడుకు వంక చూసి "ఎందుకురా కారాపు అని అరిచావ్" అని అడిగాడు.

బబ్లూ కారు డోర్ ఓపెన్ చేసాడు. ఓ పక్కన లేడీ ఇన్స్పెక్టర్ వుంది. ఆరోజు కారాపి, ఫైన్ వేసిన ఇన్స్పెక్టర్ ...ఆమెను చూడగానే మళ్ళీ ఏదో లీలగా డైలమా...తనెక్కడ చూసాడు?

బబ్లూ ఇన్స్పెక్టర్ దగ్గరకి వెళ్ళి "గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్ ఆంటీ" అంటూ విష్ చేసాడు.

ఇన్స్పెక్టర్ బబ్లూ వంక చూసి గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ

"నువ్వూ..."

"నేనే అంటీ...ఎంత ముద్దొస్తున్నావ్ అని ఆరోజు నా బుగ్గలు గిల్లి ముద్దు పెట్టుకున్నారు చూడండి...బబ్లూ"

ఇన్స్పెక్టర్ కు గుర్తొచ్చింది. "మైడియర్ స్వీట్ బాయ్...నువ్వా..రారా" అంటూ దగ్గరకు తీసుకుంది.

"ఇదిగోండి ఆంటీ...చాక్లెట్...ది సీజ్ ఫర్ యు. మీరు చాక్లెట్ లా డ్రస్ లో ముద్దొస్తున్నారు ఆంటీ" అన్నాడు.

ఇన్స్పెక్టర్ సిగ్గుపడిపోయింది. ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి.

"యూ నాటీ బాయ్" అంది అతని బుగ్గలు గిల్లుతూ.

ఈలోగా శ్రీకర్ కారు దిగి వచ్చాడు. ఇన్స్పెక్టర్ శ్రీకర్ వంక చూసి "మీ అబ్బాయి వెరీస్మార్ట్...అందరితో ఇట్టే కలిసిపోతాడులా వుంది. ఈ వయసు పిల్లలు పోలీసు డ్రెస్ చూస్తేనే భయపడిపోతారు" అంది.

ఓ చిన్న నవ్వు నవ్వాడు శ్రీకర్.

"అవునూ..మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తూంది. ఎక్కడ చూసానో గుర్తుకు రావడం లేదు" అంది శ్రీకర్ వంక పరిశీలనగా చూస్తూ.

"నాదీ అదే ప్రాబ్లెం...మిమ్మల్ని ఎక్కడో చూసాను" అన్నాడు శ్రీకర్.

"జన్మజన్మల బంధము డాడీ" బబ్లూ మెల్లిగా తండ్రికి మాత్రమే వినిపించేలా అడిగాడు.

శ్రీకర్ బబ్లూ నోరు మూసాడు.

"బై ఆంటీ...నాకు స్కూల్ టైమవుతూంది" అన్నాడు బబ్లూ.

"బై...బబ్లూ...బై" అంది ఇన్స్పెక్టర్.

బబ్లూను స్కూల్ దగ్గర దింపి ఆఫీసుకు వెళ్తోంటే అదే ఆలోచన....తను ఆ ఇన్స్పెక్టర్ ను ఎక్కడ చూసాడు?

ఎక్కడ చూసాడో మీకేమైనా తెలుసా