హలో... రాంగ్ నెంబర్.! - 39

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 39

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

బద్దకంగా ఒళ్లు విరుచుకున్నాడు శ్రీకర్. అప్పుడే తెల్లారిపోవాలా? తనలో తను గొణుక్కని టైం చూసాడు. అయిదన్నర అయింది. గ్లాస్ డోర్ కర్టెన్స్ ఓపెన్ చేసాడు. సీత్రూ గ్లాసుల్లో నుంచి లాన్ అందంగా కనిపిస్తోంది.

ప్రియంవద అప్పటికే లేచింది. హాలులోకి వచ్చాడు. నైటీ మీదే సైక్లింగ్ చేస్తోంది. పై రెండు బటన్స్ పెట్టుకోకపోవడం వల్ల ఆమె ఎగిసెగిసి పడే గుండెల ఉధృతి తెలుస్తోంది. చాలా మందికి లావుగా వుంటే అందంగా ఉండమేమోనన్న భ్రమ ఉంటుంది. కానీ అతనికి లావుగా, బొద్దుగా వున్న ప్రియంవదను చూస్తే ముందు ముద్దొచి ఆపై మూడొస్తుంది.

ప్రియంవద సైక్లింగ్ చేస్తూనే భర్త వంక చూసింది. అతని చూపులు ఎక్కడున్నాయో గమనించింది. మామూలుగా అయితే అతడ్ని ఆట పట్టించడానికి టవల్ భుజం మీదుగా కప్పుకునేది. ఇప్పుడలా కాకుండా, మరో బటన్ తీసేసింది.

అదిరిపడ్డాడు శ్రీకర్. ప్రియంవద అదేమీ పట్టించుకోనట్టు సైక్లింగ్ ఆపి, పక్కనే వున్న స్కిప్పింగ్ రోప్ అందుకుని స్కిప్పింగ్ చేయడం మొదలెట్టింది.

నెలలో ఏ ఒక ట్రెండురోజులో చేస్తుందిలా...తనే ఎన్నిసార్లో తనతో వాకింగ్ కు రమ్మంటే కారులో అయితే వస్తాననేది. కారులో గ్రౌండ్ కు వచ్చి "మీరు వాకింగ్ చేయండి, నేను చూస్తాను" అనేది.

"వన్...టు..త్రీ హండ్రెడ్..ఫోర్ ట్వంటీ..." కౌంట్ చేస్తూ స్కిప్పింగ్ చేస్తోంది.

"అదేం కౌంటింగ్" శ్రీకర్ అడిగాడు.

వెంటనే మళ్ళీ మొదట్నుంచీ స్కిప్పింగ్ మొదలుపెట్టి.."ఫోర్ ట్వంటీ....ఫోర్ ట్వంటీ వన్...ఫోర్ ట్వంటీ టు..." అని మొదలెట్టింది.

"అదేంటి ఫోర్ ట్వంటీ నుంచి మొదలెట్టావ్?" శ్రీకర్ అడిగాడు.

"హు...నా మొగుడు ఫోర్ ట్వంటీ కాబట్టి కట్టుకున్న భార్యను మోసం చేసి అమ్మాయిల్తో తిరుగుతాడు" విసురుగా అంది.

శ్రీకర్ కు ప్రియంవద సెటైర్ అర్థమైంది. విషయాన్ని కదిలిస్తే మేటర్ సీరియస్ అవుతుందని అర్థమైందని. కామ్ గా బాత్రూం లోకి వెళ్ళాడు షేవింగ్ చేసుకోవడానికి.

క్రీమ్ అప్లయ్ చేసుకొని షేవింగ్ మొదలెట్టే సమయానికి...ప్రియంవద గట్టిగా అరిచింది "ఏ..మం...డీ" అంటూ.

శ్రీకర్ ఆ అరుపునకు కంగారుపడి పోయాడు. ఆరోజే ఓపెన్ చేసిన బ్లేడు తన పనితనం చూపించి సర్ ర్ మంటూ గడ్డం మీద స్కప్పయింది.

"అబ్బా" అన్నాడు చిన్నపాటి నొప్పితో. రక్తం బయటకు వచ్చింది. బాత్రూం డోర్ దగ్గర నిలబడ్డ ప్రియంవదని అడిగాడు కోపంగా.

"ఎందుకూ అరిచావు..నా బుగా తెగి రక్తం వచ్చింది"

"మామూలు రక్తం వస్తేనే మీకంత మండిపోతోందా? మరి మీరు చేసిన పనికి నాకు ఒంట్లో రక్తం సలసలా మరుగుతోందో. అదెవ్వర్తి...సన్నగా, మెరుపు తీగ అక్కలా వుంది. దాని చేతిలో చేయివేసి, ఎంత సేపిచ్చారు షేక్ హ్యాండ్. నాకెప్పుడైనా షేక్ హ్యాండ్ యిచ్చారా?"

శ్రీకర్ కు తల తిరిగిపోయింది.

"పోనీ...ఇప్పుడిస్తాను" అంటూ ఏడుపుగొంతుతో ప్రియంవద చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.

"వెధవ షేక్ హ్యాండ్ నాకేం అక్కర్లేదు" అంటూ తన చేతిలో వున్న ఆఫ్టర్ షేవ్ లోషన్ ని శ్రీకర్ చేతిలో పెట్టి "రక్తం కారిన చోట రుద్దుకోండి" అంది.

"అదేంటి...గడ్డం తెగుతుందని, రక్తం వస్తుందని నీకెలా తెలుసు"

"బుగ్గ తెగాలనే అరిచాను. సెప్టిక్ కాకుండా లోషన్ తెచ్చాను. మీకేమైనా అయితే మా గతేంకాను"

శ్రీకర్ పిచ్చి చూపులు చూసాడు.

"త్వరగా షేవ్ చేసుకోండి. నీళ్ళు వేడెక్కి పొర్లుపోతున్నాయి." అంటూ లోషన్ బాటిల్ మొగుడి చేతిలో పెట్టి జడను ఓసారి తిప్పి ముందుకు కదిలింది. ఆ జడ చివర్లు శ్రీకర్ మొహానికి తగిలాయి.

*             *          *

బకెట్ తో వేడినీళ్ళు తెచ్చి, బాత్రూంలో పెట్టింది. పంప్ ఓపెన్ చేసింది చల్లటి నీళ్ళకోసం.

బాత్రూం డోర్ పెట్టుకొని, టవల్ విప్పి హ్యాంగర్ కు తగిలించి, మగ్గుతో నీళ్ళు తల మీదుగా పోసుకొని ఒక్కక్షణం ఖంగుతిన్నాడు.

"ప్రియా...ప్రియంవదా..." కేకేసాడు.

"అంతగా కేక వేయక్కర్లేదు. ఇక్కడే తలుపు దగ్గరే వున్నాను"

"ఇక్కడేం చేస్తున్నావు? తలుపు సందుల్లో నుంచి నేను స్నానం చేస్తుంటే చూస్తున్నావా?"

"ఆ...మీరో జగదేకవీరులు...మీది హోర్కూలెస్ బాడీ, సూపర్ మెన్ పర్సనాలిటీ అని..."

"సెటైర్లాపు...నీళ్ళేంటి...మురుగు కంపు..."

"నీకెలా తెలుసు?"

"వేడి నీళ్ళలో ఫినాయిల్ కలిపింది నేనే" కంగారులో బకెట్ తన్నబోయాడు.

"అదేంటి...ఫినాయిల్ నీళ్ళలో స్నానం చేయడం ఏమిటి?"

"వేరే అమ్మాయిలను ముట్టుకున్న చేత్తో నన్నెలా తాకుతారు. అందుకే ఆమ్మాయిల కంపు పోవాలని ఫినాయిల్ ని వేడి నీళ్ళలో కలిపాను. ఆ నీళ్ళతో స్నానం అయ్యాక చెప్పండి. ఇంకో బకెట్ వేడి నీళ్ళు ఇక్కడే బాత్రూం తలుపు దగ్గరపెట్టాను."

శ్రీకర్ బాత్రూంలో వున్న అద్దంలో తన మొహం చూసుకున్నాడు. తన మొహం తనకే మసగ్గా కనిపించింది. రాత్రి ప్రియంవద అన్న మాటల్లోని పవర్ ఇప్పుడు అర్థమైంది.

*         *           *