హలో... రాంగ్ నెంబర్.! - 27

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 27

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

నాయర్ ప్రియంవద రాసిచ్చిన డిటైల్స్ చూస్తున్నాడు. అప్పుడే ఫోన్ వచ్చింది. అది ఇంటర్ కమ్ కాదు, డైరక్ట్ ఫోన్ కాల్. ఆ నెంబర్ చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు.

"నో టెన్షన్ డిటెక్టివ్ ఏజెన్సీ" రిసీవర్ లిఫ్ట్ చేసి అన్నాడు నాయర్.

"బాండ్ ...జేమ్స్ బాండ్ దిస్ సైడ్ సార్" అటువైపు నుంచి వినిపించింది.

"నువ్వా...నీ డిస్ మిస్ ఆర్డర్ టైప్ చేయమని ఇందాకే రిసెప్షన్ లో చెప్పాను. దానికింకా పదిహేను నిమిషాల టైం వుంది" అన్నాడు నాయర్.

"సారీ సర్...నాదిప్పుడు జాబ్ అండ్ డెత్ సమస్య కాదు. బిల్ అండ్ డెత్ సమస్య" అటు వైపు నుంచి జేమ్స్ బాండ్ చెప్పాడు.

"వ్వాట్"

"యస్సార్. నాకు సమోసా అన్నా, ఇరానీ ఛాయ్ అన్నా చాలా ఇష్టమని మీకు తెలుసు. కార్నర్ రెస్టారంట్ లో ఇరవై సమోసాలు, అయిదు ఛాయ్ లు తాగాను. జేబులో పర్సు సంగతి మరిచిపోయాను. అన్ ఫార్చ్యునేట్ లీ ఆ పర్సును ఎవడో పిక్ పాకేటర్ కొట్టేసాడు."

"ఏంటీ! కొత్త స్టోరీ రాస్తున్నావా?" అడిగాడు సీరియస్ గా నాయర్.

"ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సార్....నేనిప్పుడు మీతో జోకులేసే మూడ్ లో లేను. డామ్ ఇన్ స్టల్ జరిగిపోయింది. ఆ ఇరానీ కొట్టు ఓనర్ నన్ను జేమ్స్ బాండ్ అంటే నమ్మడం లేదు. మరో బ్యాడ్ లక్ నేను నా ఐడింటిటీ కార్డును ఉదయం విడిచిన షర్ట్ లో మరిచిపోయాను. దాంతో వాడు నన్నో మెంటల్ కేసు అనుకుంటున్నాడు."

"సో వాట్..." తాపీగా అడిగాడు నాయర్.

"సార్...నా మీద మీకు కోపముంటే ఆఫీసుకు వచ్చాక చూపించండి. ఫోన్ లో వద్దు. అతి కష్టమ్మీద ఫోన్ లాక్ ఊడబీకి మీతో మాట్లాడుతున్నాను. నేనిక్కడ స్టోర్ రూమ్ లో వున్నాను. బిల్లు కట్టలేదని హోటల్ వాడు 'బిల్లు కట్టే కదలమన్నాడు.' నాకు వళ్లు మండి రివాల్వర్ బయటకు తీసాను. దాంతో నన్ను వాడు ఐ ఎస్ ఐ ఏజెంట్ అనుకోని స్టోర్ రూమ్ లో బంధించాడు. మరో కొద్దిసేపట్లో వాడు పోలీసులతో వస్తాడు. అప్పుడు నన్ను పోటా కింద లోపలికి తోస్తారు. ప్లీజ్ సార్ సేవ్ మీ...మీకు కాదు, కూడదంటే నా స్టయిల్ లో బయటకు వస్తాను."

నాయర్ తల పట్టుకున్నాడు. "నీకసలు బుద్ధి వుందా? నీకు రివాల్వర్ లైసెన్స్ తీసుకోవడం నేను చేసిన పొరపాటు, ఓసారి పోలీస్ స్టేషన్ కు వెళ్ళు...బాగా తెలిసొస్తుంది."

"నా భయం పోలీస్ స్టేషన్ కు వెళ్ళడం గురించి కాదు సార్..."

"మరి..."

"నేను ఏదోలా బయటకు రాగల్ను. కానీ ఇన్ స్పెక్టర్ నన్ను అరెస్ట్ చేసాక అసలు విషయం తెలుస్తుంది. ఇరవై సమోసాలు...అయిదు ఛాయ్ లు తాగానన్న విషయం. అది ప్రెస్ కు తెలుస్తుంది. ఈ జేమ్స్ బాండ్ సీక్రెట్స్ బయటకు వెళ్ళకూడదు కదా..."

అంత కోపంలోనూ నవ్వొచ్చింది నాయర్ కు. జేమ్స్ బాండ్ బాధ పోలీసులొచ్చి అరెస్ట్ చేస్తారని కాదు తన తిండి గురించిన రహస్యం పత్రికల్లో వస్తుందని.

"ఆల్ రైట్...నేను పది నిమిషాల్లో వస్తాను"

"వన్ సెకన్ సార్...ఆ హోటల్ వాడు ఇన్స్పెక్టర్ తో వస్తున్నాడు. మీరు సరాసరి పోలీస్ స్టేషన్ కు వచ్చేయండి. ఆ ఇన్స్పెక్టర్ మన ప్రియమైన శత్రువు చండి" చెప్పాడు జేమ్స్ బాండ్ ఫోన్ పెట్టేస్తూ.

*               *                   *

పోలీస్ స్టేషన్.

సెల్ లో ఊచాలకు వీపు ఆన్చి నిలబడి వున్నాడు జేమ్స్ బాండ్. నాయర్ హడావిడిగా లాయర్ తో వచ్చాడు. వస్తూనే ఇన్స్పెక్టర్ చండి వైపు "గుడ్మార్నింగ్ యంగ్ లేడీ" అన్నాడు.

ఒక్కక్షణం నలభయ్యేళ్ళ ఆ ఇన్స్పెక్టర్ చండి మొహం ప్రసన్నంగా మారి, ఆ తర్వాత సీరియస్సయింది.

నాయర్ ఆమె మొహంలోని ఫీలింగ్స్ అబ్జర్వ్ చేస్తూ, వెంటనే తన దృష్టిని సెల్ వైపు సారించి....

"ఇన్స్పెక్టర్ దిసీజ్ టూ మచ్...ఓ డిటెక్టివ్ ని పట్టుకొని సెల్ లో వేస్తారా?"

"మిస్టర్ నాయర్...ఆ విషయం మీ డిటెక్టివ్ ని అడగండి. మర్యాదగా కుర్చీలో కూచోమంటే నో....నేను సెల్ లోనే వుంటానని పట్టుబట్టాడు. పైగా సెల్ లో జేబుదొంగ పక్కన వుండడం ప్రిస్టేజ్ యిష్యూ అని గోల చేస్తే భరించలేక, ఆ సెల్ లో వున్న వాళ్ళని ఆరుబయటకు కూచోబెట్టాం. ఇప్పుడు చెప్పండి. ఏది టూ మచ్..."

నాయర్ మోహంలో ప్రసన్నత కనిపించింది.