హలో... రాంగ్ నెంబర్.! - 24

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 24

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

"మీరిప్పుడు థర్డ్ ఫ్లోర్ లో వున్నారు కదూ..." అడిగాడు నాయర్ అటువైపు నుంచి.

ఓసారి తలెత్తి చూసింది. థర్డ్ ఫ్లోర్.

"అవును. నేను థర్డ్ ఫ్లోర్ లో వున్న విషయం మీకెలా తెలుసు."

"టైమ్ కాలుక్యులేషన్. మొత్తం ముప్పయి ఆరు మెట్లు... లెఫ్ట్ కు తిరిగి చూడండి! మా బోర్డు కనిపిస్తుంది. మీ సమస్యలు అంతమయ్యే చోటు...నో టెన్షన్'' నవ్వుతూ చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసాడు నాయర్.

'నో టెన్షన్' అన్న బోర్డు చూసి స్ప్రింగ్ డోర్ ని పుష్ చేసింది. విశాలమైన హాలులో ఎడమవైపు 'రిసెప్షన్' అన్న బోర్డు వుంది. నాలుగైదు టేబుల్స్. వాటిపై కంప్యూటర్లు వున్నాయి. సీరియస్ గా కంప్యూటర్లు ముందు కూచుని వున్నారు కొందరు. రిసెప్షన్ కౌంటర్ దగ్గర ఓ ముప్పయి ఆరేళ్ళ లేడీ వుంది.

ప్రియంవద రిసెప్షన్ దగ్గరకి వెళ్ళింది. నాయర్ చెప్పింది గుర్తొచ్చి..మెల్లిగా చెప్పింది...'థర్టీ సిక్స్...' అని.

ఆ రిసెప్షనిస్ట్ 'వన్ సెకన్' అంటూ ఇంటర్ కమ్ నొక్కింది. ''సార్...మీకోసం 'థర్టీ సిక్స్' వచ్చారు" అని చెప్పింది. ఆ తర్వాత ప్రియంవద వైపు తిరిగి నవ్వుతూ చెప్పింది. "మీరు లోపలికి వెళ్ళండి మేడమ్...స్ట్రయిట్ గా వెళ్ళిపొండి. ఆల్ ద బెస్ట్"

*                            *                                     *

ఓ సారి ఆ గదిని పరికించి చూసింది. చిన్నగది. మధ్యలో టేబుల్, రివాల్వింగ్ చెయిర్, కంప్యూటర్. ఓ పక్కన పుస్తకాలు పెట్టుకునే రాక. గోడకు పాత ఇంగ్లీష్ సినిమాల్లోని డిటెక్టివ్ ల స్టిల్స్.

టేబుల్ మీద క్రయిమ్ డిటెక్టివ్ మేగజైన్స్. ఆవాళ్టి దినపత్రికలు.

"కూచోండి" అన్నాడు నాయర్ గంభీరంగా. అతడ్ని విష్ చేస్తూ ఎదురుగా వున్న కుర్చీలో కూచుంది.

మంచి రూమ్ స్ప్రే స్మెల్.

ప్రియంవద ఏదో మాట్లాడబోయింది. ఒక్క క్షణం ఆగమన్నట్టు వారించాడు. ఈలోగా బాయ్ కాఫీ తెచ్చాడు. రెండు కప్పులు టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. నాయర్ రాక్ లో ఓ మూల వున్న బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసాడు.

"ప్లీజ్ హెవిట్..." అన్నాడు.

ఓ బిస్కెట్ తీసుకొని కాఫీ కప్పు చేతిలోకి తీసుకుంది. ఫిల్టర్ కాఫీ వాసన చాలా బావుంది. ఓ వైపు ఏర్ కండీషనర్ తాలూకు చల్లదనం. రెండు నిమిషాల్లో కాఫీ తాగింది.

"ఇప్పుడు చెప్పండి. ఏమిటి మీ ప్రాబ్లెం..." అడిగాడు కాఫీ తాగడం పూర్తయ్యాక. ఆ ఖాళీ కప్పులను పక్క టేబుల్ మీద పెట్టి. ఎలా చెప్పాలో అర్థం కాలేదు ప్రియంవదకు అసలు ఎలా మొదలుపెట్టాలి?

నాయర్ కు ఆమె పరిస్థితి అర్థమైంది.

"మీకు పెళ్ళయింది కదా..." అడిగాడు ఆమెవంకే చూస్తూ.

"అయ్యింది. ఓ బాబు...ఆ విషయం నిన్న చెప్పాను కదా..."

"అఫ్ కోర్స్...మీ ప్రాబ్లెం మీవారు...ఐమీన్ ఆయనకు అమ్మాయిలతో వున్న పరిచయం...యామై కరెక్ట్?"

"అవును..సరిగ్గా ఇదే నా సమస్య అని మీకెలా తెలుసు?"

"సాధారణంగా పెళ్ళికాని అమాయిలైతే తమ బాయ్ ఫ్రెండ్స్ లేదా కాబోయే భర్తల గురించి ఎంక్వయిరీ చేయిస్తారు. పెళ్ళయిన స్త్రీలకు వుండే సమస్యలు రెండే రెండు. పెళ్లికి ముందు తను ప్రేమించిన వ్యక్తి బ్లాక్ మెయిల్ చేస్తూ వుండడం లేదా భర్త వేరే అమ్మాయిలతో తిరుగుతూ వున్నాడన్న అనుమానం కలగడం. మీ మొహంలో భయం కనిపించడం లేదు..అంటే మీది మొదటి సమస్య కాదు. రెండో సమస్య అని గెస్ చేసానంతే..."

"ఎగ్జాక్ట్ లీ...ఆయనకు అమ్మాయిలతో విపరీతమైన పరిచయాలున్నాయని నా వుద్దేశం"

"అంటే నమ్మకమా...అనుమానమా?"