హలో... రాంగ్ నెంబర్.! - 18

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and   latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 18

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

"ఫర్లేదు..రండి..హాస్పిటల్ కు వెళ్దాం" అన్నాడు శ్రీకర్.

"నాకు ఆఫీసుకు టైమయింది. టెన్ థర్టీకల్లా రిజిష్టర్ లో సంతకం పెట్టాలి" అంది రిస్ట్ వాచీ వంక చూసుకుంటూ.

"ఇప్పుడు నైన్ థర్టీ అయింది. సరిగ్గా టెన్ థర్టీ కల్లా మిమ్మల్ని ఆఫీసులో దిగబెట్టే పూచీ నాది..." చెప్పాడు శ్రీకర్.

ఆ అమ్మాయి వినకుండా కెనటిక్ హోండా స్టార్ట్ చేసింది.

బండి స్టార్ట్ కాలేదు. మళ్ళీ కిక్ కొట్టింది. అయినా స్టార్ట్ కాలేదు.

"షిట్..." అనుకుంది విసుగ్గా.

"చూడండి..విసుగు అనేది పొదుపుగా వాడుకోవాలి. ఒక్కసారి విసుగును ప్రదర్శిస్తే నాలుగు కాలరీలు అనవసరంగా ఖర్చయిపోతాయిట. దాని  బదులు ఒక్కసారి మీరు నవ్వండి...కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి. మొహం అందంతా కనిపిస్తుంది అసలే మీది కాల్గేట్ ఫేస్..."

అంత విసుగులోనూ నవ్వొచ్చింది అతని మాటలకు.

"పోనీ...ముందు నా కారులో మీ ఆఫీసుకు పదండి. నేను డ్రాప్ చేస్తాను. ఈ వెహికల్ ని సాయంత్రం మీ ఆఫీసు అయిపోయేలోగా, మీ ఆఫీసు పార్కింగ్ ప్లేస్ లో ఉంచే బాధ్యత నాది..నన్ను నమ్మండి. నేనసలే గిల్టీ ఫీలింగ్ తో చితికిపోతున్నాను."

ఆ అమ్మాయి ఓసారి కెనటిక్ హోండాని కసిగా కాలితో తన్ని కారెక్కింది.

*               *             *

'ఈ మారుతీవాళ్ళు అంబాసిడర్ వాళ్ళలా ఒకే పెద్ద సీటు పెట్టొచ్చుకదా' మనసులో అనుకుంటూ కారు స్టార్ట్ చేసాడు.

కారు డ్రైవ్ చేస్తూనే ఓరకంటితో ఆమెని గమనించాడు. మంచి స్ట్రక్చర్. ముఖ్యంగా చీరకట్టులో వున్న ఆమెలో అతనికి నచ్చింది ఆమె నడుం ఒంపు. చిన్న మెలికలాంటిది ఆ ఒంపు.

"బైదిబై...అయామ్ శ్రీకర్..ఎట్ యువర్ సర్వీస్ చైర్మన్ ని" అన్నాడు తనని తను పరిచయం చేసుకుంటూ.

"మీరు...ఎట్ యువర్ సర్వీస్ చైర్మెనా?" అడిగింది ఆశ్చర్యంగా ఆ అమ్మాయి.

"ఏం...ఆ కంపెనీ ప్యూన్ లా కనిపిస్తున్నానా?" నవ్వుతూ అన్నాడు శ్రీకర్.

"ఛ....ఛ...నా వుద్దేశం అది కాదు. ఎట్ యువర్ సర్వీసు గురించి విన్నాను. ఆమధ్య మా ఫ్రెండ్ చెన్నయ్ నుంచి వచ్చినప్పుడు నేను ఊళ్ళో లేను. మీ సంస్థకు ఫోన్ చేసి సిటీ మొత్తం చూసిందట. మీ సర్వీసెస్ చాలా బావున్నాయని చెప్పింది."

"ఆ అమ్మాయి పేరేమిటన్నారు?" అడిగాడు శ్రీకర్.

"నేనేమీ అన్లేదండీ..."

"మీరేమీ అనకపోయినా ఫర్లేదుకానీ మీ పేరేమిటో చెప్పనే లేదు."

"ఓహ్..సారీ...అక్షిత...గుడ్ లింక్స్ లో అకౌంట్స్ సెక్షన్ లో పనిచేస్తున్నాను."

"వెరీనైస్...మీకెప్పుడైనా మా సంస్థతో అవసరం పడితే, మా సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు." ఏం మాట్లాడాలో అర్థంగాక అన్నాడు శ్రీకర్.

"థాంక్యూ...మీరు ఆ పక్కన కారాపితే నేను దిగి మా ఆఫీసుకు వెళ్తాను" అంది అక్షిత.

శ్రీకర్ కారును గుడ్ లింక్స్ ఆఫీసు ముందు ఆపాడు.

అక్షిత కారు దిగి, డోర్ వేస్తూ "థాంక్యూ... మరచిపోకుండా నా వెహికల్..."

"ఈవినింగ్ ఫైవ్ థర్టీకి మీ ఆఫీసు ముందు వుంటుంది." అన్నాడు కెనటిక్ కీస్ తీసుకుంటూ.

అక్షిత వెళ్ళబోతూంటే ఎక్స్ క్యూజ్ మీ" అంటూ పిలిచి, పర్సులో నుంచి తన విజిటింగ్ కార్డు తీసి, ఆమెకిచ్చి "ఎట్ యువర్ సర్వీస్....56374677....... ఎప్పుడైనా...ఎక్కడైనా...ఎలాగైనా...మోస్ట్ వెల్ కమ్" అన్నాడు చిర్నవ్వుతో.

ఆ విజిటింగ్ కార్డు వంక, అతని వంకా చూసి "థాంక్స్'' అంది తన హ్యాండ్ బ్యాగ్ లో ఆ విజిటింగ్ కార్డుని పెట్టుకుంటూ.


*                        *                    *

ఈవినింగ్ ఫైవ్ థర్టీ.

ఆఫీసులో నుంచి బయటకు వచ్చింది అక్షిత. ఆమెకు టెన్షన్ గా వుంది. తన కెనటిక్ బాగుచేయించాడా? నిజంగా బాగు చేయించి తీసుకువస్తాడా? కొంపదీసి ఆ వెహికల్ తో ఉడాయించడు కదా...ఛ...ఛ...చూస్తే  జంటిల్మెన్ లా వున్నాడు. పైగా పెద్ద సంస్థ  చైర్మన్...

రకరకాలుగా ఆలోచిస్తూ, పార్కింగ్ ప్లేసు దగ్గరికి వచ్చింది. ఒక్కక్షణం షాకైంది. తన వెహికల్...కొత్త వెహికల్ లా...తళతళలాడుతూ కనిపిస్తోంది.

వెహికల్ ని సర్వీసింగ్ చేయించారు. అద్దంలా మెరిసిపోతోంది. అంతేకాదు....వెహికల్ ముందుభాగంలో, అక్షిత అని ఇంగ్లీష్ లో పెయింట్ చేయించబడి వుంది. ఇప్పుడే కొన్న బండిలా వుంది. ఎప్పట్నుంచో బండిని సర్వీసుకు ఇవ్వాలనుకుంటోంది. అయినా కుదర్లేదు. ఉదయం పెట్రోలు కూడా పోయించలేదన్న విషయం గుర్తొచ్చి, టాంక్ ఓపెన్ చేసి చూసి మరోసారి షాకైంది. టాంకునిండా పెట్రోలు. వెంటనే ఫోన్ చేసి శ్రీకర్ కు థాంక్స్ చెప్పాలనిపించింది. తన బండిని ఎవరు ఇక్కడ తెచ్చిపెట్టారు...అతనే తెచ్చిపెట్టాడా, పాపం...! తను థాంక్స్ కూడా చెప్పలేదు...పక్కనే వున్న టెలిఫోన్ బూత్ దగ్గరికి నడిచింది. ఉదయం శ్రీకర్ ఇచ్చిన విజిటింగ్ కార్డు తీసి 56374677కు డయల్ చేసింది.

"శ్రీకర్...ఎట్ యువర్ సర్వీస్" అటు నుంచి లవ్ లీగా వినిపించింది.

"థాంక్యూ సర్...నా పాత వెహికల్ తీసుకెళ్ళి కొత్త వెహికల్ లా చేసిచ్చారు. థాంక్యూ వెరీమచ్" ఎక్సయిట్ అయిపోతూ అంది అక్షిత.

"వోన్లీ థాంక్సేనా? కనీసం కప్పు కాఫీ కూడా ఆఫర్ చేయరా?" అడిగాడు శ్రీకర్.

"అయ్యో..." నొచ్చుకున్నట్టుగా అంటూ, "మీరు ఎప్పుడంటే అప్పుడు.."

"పోనీ ఇప్పుడైతే....?"

"ఇప్పుడా...ఇప్పుడెక్కడున్నారు...మీరు వచ్చేసరికి ఎంత టైమవుతుందో..."

"పోనీ...వెంటనే వచ్చేస్తే..."

"రాగలరా?" అడిగింది అక్షిత.

"మీలాంటి అందమైన అమ్మాయి కాఫీకి ఇన్వయిట్ చేస్తే రాలేనా? మీరు ఫోన్ పెట్టేసి, రైట్ కు తిరిగి చూడండి."

అక్షిత ఫోన్ పెట్టేసి, కుడివైపు తిరిగి చూసి మరో షాకైంది.

శ్రీకర్ కారుకు ఆనుకుని నిలబడి మాట్లాడుతున్నాడు. చాలా మ్యాన్లీగా అనిపించాడా క్షణంలో పెళ్ళి కాని ఆమెకు.

*            *           *