హలో... రాంగ్ నెంబర్.! - 16

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 16

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

"కాదు"

"మరేమిటి?"

ప్రియంవద ఓసారి బబ్లూ వస్తున్నాడా లేదా అని చూసి మెల్లిగా లోగొంతుతో చెప్పింది.

"రేపు పెరిగి పెద్దయ్యాక, ఈ పెద్ద వాళ్లు ఎలాగూ ప్రేమించి పెళ్లి చేసుకుంటామంటే ఒప్పుకోరు. మనం లేచిపోదామా...అని అడిగింది."

శ్రీకర్ తూలిపడబోయాడు. ఈలోగా బబ్లూ తల్లి కళ్లజోడు తీసుకువచ్చి తండ్రికిచ్చాడు.

"ఇది మమ్మీది కదా"

"అవును. మమ్మీ వేరు, నువ్వు వేరా డాడీ. ఇద్దరూ నాకు సమానమే. నీకో విషయం తెలుసా డాడీ? మా స్కూల్లో నా ఫ్రెండ్స్ అంతా మీకు కళ్లజోడు ఫ్యాక్టరీ వుందా? నీకు, మీ మమ్మీకి, డాడీకి అందరికీ కళ్లజోడు వుంటుంది కదా! అని అడిగారు" శ్రీకర్ ప్రియంవద కళ్లజోడు పెట్టుకుని ప్రోగ్రెస్ రిపోర్టు వంక చూసాడు.

మసక మసగ్గా కనిపిస్తున్నాయి అక్షరాలు.

"ప్రియా! ఈ అక్షరాలు నీకెలా కనిపిస్తున్నాయి? ఈ కళ్లజోడును ఎలా భరిస్తున్నావు?"

"అంతకన్నా మసగ్గా కనిపించే మిమ్మల్ని భరించడం లేదా/" వెంటనే రిటార్టిచ్చింది ప్రియంవద.

శ్రీకర్ మాట్లాడుతూనే సంతకం చేసేసి బాబ్లూకి ఇచ్చాడు.

"అరెరె...మార్కులు చూడండీ..." కంగారుగా అంది ప్రియంవద.

"అబ్బ...మీ ఆయన చూసాడు కదా" అని విసుగు నటిస్తూ ప్రోగ్రెస్ కార్డుని బ్యాగులోకి తోసేసి "పద డాడీ! మనం వెళ్దాం" అన్నాడు బబ్లూ. "ప్రియంవదా ! నువ్వేం వర్రీ అవ్వకు. వాడెవడు? నా కొడుకు!"

"అందుకే నాకు వర్రీ. చదువులో మీ మార్కుల సంగతి నాకు తెలియదూ" అంది ప్రియంవద.

శ్రీకర్ కు భార్య మాటలు మింగుడు పడలేదు. కోరి కొరివితో తలగోక్కోవడం ఎందుకన్న ఫిలాసఫీతో బయటకు నడిచాడు.

*               *               *

"డాడీ హాస్పిటల్ లో మల్లెపూలు వుంటాయా?" అడిగాడు బబ్లూ కారు డ్రైవ్ చేస్తోన్న తండ్రిని.

"హాస్పిటల్ లో మల్లెపువ్వులేమిటి?"

"పోనీ, నర్సు ఆంటీలు జడలో మల్లెపూలు పెట్టుకుంటారా?"

ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. ఏ నర్సూ మల్లెపూలు పెటుకున్న దృశ్యం కనిపించలేదు. అవును. నర్సులు మల్లెపూలు ఎందుకు పెట్టుకోరు?"

"డాడీ..."

"ఏమిటీ?"

"నేను చాలా టిపికల్ ప్రశ్నలు అడుగుతాను కదూ డాడీ..."

"అవునవును. కానీ నీకీ మల్లెపూల డౌట్ ఎనుడ్కు వచ్చింది?"

"నీ షర్ట్ లో నలిగిన మల్లెపూలు కనిపిస్తేనూ"

"ఏ షర్ట్ లో?"

"నువ్వు విడిచేసిన షర్టులో"

"మైగాడ్..." పైకే అనేసాడు. అవిగానీ ప్రియంవద చూసిందంటే...?

"డోంట్ వర్రీ డాడీ" అంటూ తన యూనిఫాంలో వున్న నలిగిన మల్లెలని తండ్రి చేతిలో పెట్టాడు. "ఒరే బబ్లూ...నువ్వు నిజంగా గ్రేట్ రా... నీకెంత మంచి ఐడియా వచ్చిందిరా"

"ఈ ఐడియా నాది కాదు డాడీ...మళ్లీ మళ్లీ పెళ్లి సీరియల్ డెబ్బయ్ నలుగు వందల తొంభై ఆరో ఎపిసోడ్ లో పిల్ల హిరోయిన్ ఇలానే చేస్తోంది.

"పిల్ల హీరోయినేమిటి?"

"ఆ పాప వయసు ఏడేళ్లే. అందుకే పిల్ల హీరోయిన్ అన్నాను."
 
కొడుకు టీవీ తెలివితేటలకు మురిసిపోతూ వుండగా సడన్ గా బ్రేకు వేయవయవలసి వచ్చింది. దానిక్కారణం తన కారు ఎదురుగా ఓ శాల్తీ ఉంది.

ఆ శాల్తీ లేడీ ఇన్స్పెక్టర్ !