హలో... రాంగ్ నెంబర్.! - 15

 Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 15

 

ముచ్చర్ల రజనీ శకుంతల


"డాడీ స్టోరీ సూపర్బ్" స్నానం చేసాక ఫ్రెష్ గా అనిపించింది శ్రీకర్ కు. బబ్లూ స్కూల్ కు తయారవుతున్నాడు. బుక్స్ సర్దుకుంటుంటే గుర్తొచ్చింది ప్రోగ్రెస్ రిపోర్టు. బ్యాగులో నుంచి ప్రోగ్రెస్ రిపోర్టు తీసి మార్కులు చూసుకున్నాడు. ముప్పయి - నలభైల మధ్య వుంది అతని మార్కుల ప్రోగ్రెస్. టేబుల్ మీద తండ్రి కళ్లజోడు వుంది. పక్కనే తల్లిది. ఆ పక్కనే తనది. ఓసారి బుర్ర గోక్కొని ఆలోచించాడు. మెల్లిగా తండ్రి కళ్లజోడు తీసి టేబుల్ కిందకు తోసేసాడు.

"ప్రియా...టిఫిన్ రెడీనా?" అడిగాడు శూష్ వేసుకుంటూ శ్రీకర్.

"డైనింగ్ టేబుల్ కిచెన్ లో నుంచే చెప్పింది ప్రియంవద.

"ఒరే బబ్లూ...నువ్వు కూడా త్వరగా వచ్చేయ్. నిన్ను స్కూల్లో డ్రాప్ చేసి వెళ్తాను." బబ్లూ మెల్లిగా తండ్రి దగ్గరకు వచ్చాడు.

తన పక్కనే బుద్ధిగా నిలబడ్డ కొడుకుని చూసి "అరె..నివ్వింత బుద్ధిగా నిలబడ్డావేమిటి? కొంపదీసి ప్లేస్టేషన్ ని పాడుచేసావా?"

"డాడీ...నేనలాంటి పాడు పనులు చేయను"

"మరేమిటి? నువ్వు చేతులు కట్టుకుని నిలబడ్డావంటే ఏదో వెన్నుపోటు ప్రోగ్రామ్ వున్నట్టే."

"డాడీ...రాత్రంతా నీ గురించే ఆలోచించాను. మా కోసం, మన కుటుంబం కోసం నువ్వు గానుగెద్దులా కష్టపడుతున్నావు."

బెదిరిపోయి కొడుకు మొహంలోకి చూసాడు శ్రీకర్.

"ఒరేయ్ బబ్లూ...నీకేమైందిరా? తెలుగు డైలీ సీరియల్స్ ఏమైనా చూసావా?"

"లేదు డాడీ! రాత్రంతా జీవితాన్ని చదివాను"

టిఫిన్లు టేబుల్ మీద సర్దుతోన్న భార్య వైపు శ్రీకర్ చూసి "ప్రియా! వీడ్ని టీవీలో డైలీ సీరియల్స్ చూడనివ్వకు. హెవీ డైలాగులు చెబుతున్నాడు. పైగా నన్ను గానుగెద్దుతో పోల్చాడు. వీడు తిడుతున్నాడో పొగుడుతున్నాడో అర్థం కావడం లేదు"

"బుద్ధిగా పెందరాళే మీరు ఇంటికి వస్తే వాడు హాయిగా మీతోనే కాలక్షేపం చేస్తాడు. మీరెప్పుడో అర్థరాత్రి వస్తే బోర్ కొట్టి టీవీ సీరియల్స్ చూడక ఏం చేస్తాడు?"

అటూ ఇటూ తిప్పి టాపిక్ తన మీదికే వచ్చేసరికి బుద్ధిగా టిఫిన్ చేయడం మొదలు పెట్టాడు శ్రీకర్.

"డాడీ అర్జంటుగా ఆఫీసుకు వెళ్లాలా?" అడిగాడు బబ్లూ, తండ్రి టిఫిన్ చేసే విధానాన్ని పరిశీలించి.

"అవును. ఎందుకలా అడిగావు?"

"మీరు బిజీ కదా. అందుకని..." అంటూ మెల్లిగా వెనక్కి పెట్టిన చేతుల్లో వున్న ప్రోగ్రెస్ రిపోర్టు డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు.

"ప్రోగ్రెస్ రిపోర్టా? నాకెందుకు చూపించలేదు?" కోపంగా అడిగింది ప్రియంవద.

"ఇవన్నీ మగవాళ్ల విషయాలు మమ్మీ..." బబ్లూ అన్నాడు.

ప్రియంవద బబ్లూ వంక కోపంగా చూసి అంది "పెద్ద ఆరిందా మాటలు మాట్లాడకు." అంటూ భర్తవైపు తిరిగి " ఆ రిపోర్టు చూసి సంతకం చేయకండి"

నా కళ్లజోడు ఎక్కడా?" అంటూ బబ్లూ వైపు తిరిగి "బబ్లూ! నా కళ్లజోడు ఎక్కడుందో చూసి తీసుకురా"

"ముందు సంతకం చేయ్ డాడీ. తర్వాత తీసుకొస్తాను"

"నీ వాయిస్ లో నాకేదో డిఫరెంట్ రింగ్ వినిపిస్తోంది" కొడుకు వైపు చూసి అన్నాడు శ్రీకర్.

"కన్న కొడుకుని నమ్మకపోతే ఎలా డాడీ" అంటూ కళ్లజోడు తీసుకురావడానికి వెళ్లాడు.

"ప్రియంవదా! వాడ్ని టీవీ సీరియల్స్ చూడనివ్వకు. బాగా చెడిపోయాడు." చెప్పాడు శ్రీకర్.

"మన బబ్లూ చాలా నయం. పక్కింటి రావు గారి పాప...ఎనిమిదేళ్లు కూడా వుండవు...మన బబ్లూని ఒకటడిగింది"

"ఏంటీ ముద్దా?" భయపడుతూనే అడిగాడు.