హలో... రాంగ్ నెంబర్.! - 9

Get latest telugu famous comedy serials, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 9

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

కొడుకు వంక చూసింది సిగ్గుగా.

"డాడీ వచ్చేక సిగ్గుపడుదువుగానీ నువ్వు ముందు అన్నం తినిపించు. అన్నట్టు మమ్మీ...నిన్నొకటి అడగాలా?"

ఏమిటన్నట్టు కొడుకు వంక చూసింది.

"అన్నంలో మామిడిపండు, అరటిపండూ కాంబినేషన్ గా తింటారు కదూ.."

"తింటారు...అయితే"

"వెరైటీగా చాక్లెట్ తింటే ఎలా వుంటుంది?" ఒక్క క్షణం బిత్తరపోయింది.

"నీకన్నీ ఇలాంటి ఐడియాలు వస్తాయేమిట్రా?" కొడుకుని ముద్దుగా విసుక్కుంటూ అంది.

"నీ కొడుకుని కదా మమ్మీ...నాకన్నీ నీ బుద్ధులే" అన్నాడు బబ్లూ.

"ఏంటీ...నన్ను ఐస్ చేసి చాక్లెట్ కొట్టేద్దామనే...అదేం కుదర్దు. చాక్లెట్స్ ఎక్కువగా తింటే పళ్ళు పాడైపోతాయి. అప్పుడిక తినడానికి పళ్ళు కూడా వుండవు. పైగా బాగా లావెక్కుతారు." కొడుక్కి నచ్చచెబుతూ అన్నం తినిపించేసింది.

బబ్లూని పడుకోబెట్టి, బెడ్ షీట్ కప్పుతూ...హాలు వంక చూస్తోంది.

అప్పుడే హారన్ వినిపించింది. ఒక్కక్షణం ఆమె మొహం ఆనందంతో మెరిసిపోయింది. గబగబా హాలులోకి వచ్చింది.

లగేజీతో సహా హాలులోకి వచ్చేసాడు అప్పటికే శ్రీకర్.

*                      *                         *

ఫ్రెషప్ అయి వచ్చి...లుంగీ లోకి మారాక అడిగాడు శ్రీకర్.

"బబ్లూ నిద్రపోయాడా?"

"ఆ...వాడ్ని నిద్రపుచ్చేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది"

"అరే...నీకు తోకెప్పుడు పుట్టుకువచ్చింది?"

"ఇదిగో..ఈ సెటైర్లే వద్దు. ముందు భోజనం చేద్దురుగానీ రండి..."

"అబ్బ...ఇప్పుడా...ఇప్పుడేమీ వద్దు. ఒక్క నువ్వు తప్ప..." అన్నాడు ప్రియంవదని దగ్గరకు లాక్కుంటూ.

"అవునూ...దుబాయ్ నుంచి వచ్చే ఫ్లయిట్ ఎర్లీ మార్నింగ్ కదా రావలసింది...రాత్రి వచ్చారేమిటి?"

"ఏంటీ...ఏరిండియా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఎంక్వయిరీలు మొదలు పెట్టావు. చెన్నయ్ లో మన బ్రాంచీ పని కొంత మిగిలివుంటే అది పూర్తి చేసుకొని వచ్చానన్న మాట...అర్థం చేసుకోవూ..."

"మిమ్మల్ని అర్థం చేసుకోవడమా...ఏమో...మీరసలే గొప్ప గ్రంథసాంగులు కదా అని..." భర్త వంక చూస్తూ అంది.

"అబ్బ....నీకు అనుమానం ఫోబియా క్వింటాళ్ళ కొద్దీ పెరిగింది. నీకో విషయం తెలుసా. నేను ప్రతీ అమ్మాయిలోనే కాదు. అబ్బాయిల్లో కూడా నిన్నే చూస్తాను. ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తావు"

భర్త వంక పరిశీలనగా చూసింది.

"ఏంటీ....స్కానింగా?" అడిగాడు శ్రీకర్.

"కొత్త పెర్ ఫ్యూమ్ స్మెల్ వస్తూంది." అడిగింది చిన్న అనుమానంతో.

"అబ్బ...దుబాయ్ లో కొన్న పెర్ ఫ్యూమ్ లే...అన్నట్టు నీకోసం దుబాయ్ నుంచి మంచి చీరలు తెచ్చాను. మన బబ్లూ కోసం ప్లేస్టేషన్ టు తెచ్చాను. అవన్నీ రేపు చూపిస్తా. ఇప్పుడు నీ పని చూస్తా" అంటూ బెడ్ లైట్ స్విచాన్ చేసాడు.