TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
హలో... రాంగ్ నెంబర్.! - 8
ముచ్చర్ల రజనీ శకుంతల
"జీవితంలో మనం సీరియస్ గా తీసుకోవాల్సింది ఒకటుంది. అది చావు. అది కూడా ఈజీగా తీసుకుంటే లైఫ్ జాలీగా వుంటుంది. లేకపోతే ఇతరులకు మన మీద జాలి కలుగుతుంది. నేను జాలిగా వుండడానికే ప్రయత్నిస్తాను. ప్చ్...ఇక్కడ కుదర్లేదు" లూసీ వంక చూస్తూ అన్నాడు.
అతను టాపిక్ ను ఎక్కడ్నుంచి మొదలుపెట్టినా తన దగ్గరికే తీసుకువస్తాడన్న విషయం అర్థమైంది. అయినా చిత్రంగా ఆమెకు కోపం లాంటి ఫీలింగ్ కలుగలేదు. బహుశా అతని ప్రెజెన్స్ తనక్కూడా ఆనందాన్ని ఇస్తూందేమో. సరిగ్గా అప్పుడొచ్చాడు హడావిడి పడుతూ విన్సెంట్.
"సారీ సర్...లేటైంది..." చెప్పాడు ఆయాసపడుతూ.
"ఫర్లేదు...లూసీ వుంటేటైమే తెలియదు." అన్నాడు శ్రీకర్.
విన్సెంట్ లూసీ వైపు చూశాడు. అతని దృష్టి ఆమె చేతిలో విన్న విజిటింగ్ కార్డు మీద పడింది. ఆ విషయాన్ని లూసీ గమనించింది. దాన్ని అలాగే నలిపేసి పక్కనే వున్న డస్ట్ బిన్ లో వేసింది శ్రీకర్ చూడకుండా, విన్సెంట్ చూసేలా.
* * *
ఇమ్రిగేషన్, సెక్యూర్టీ చెక్ అయ్యేవరకూ లూసీ, విన్సెంట్ వున్నారు శ్రీకర్ లోపలికి వెళ్ళిపోగానే ఏర్ పోర్ట్ నుంచి లూసీ, విన్సెంట్ బయటకు వచ్చారు. విన్సెంట్ పెద్ద పెద్ద అడుగులతో ముందుకు నడుస్తోంటే, లూసీ ఒక్కక్షణం కాఫీ షాప్ దగ్గర ఆగి...తననెవరూ గమనించడం లేదని కన్ ఫర్మ్ చేసుకొని, డస్ట్ బిన్ లో నుంచి జాగ్రత్తగా ఇందాక తాను నలిపేసిన విజిటింగ్ కార్డుని తీసి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంది.
* * *
ప్రియంవద ఓసారి అద్దంలోకి చూసింది. తన ప్రతిబింబం తనకే ముద్దొస్తున్నట్టు అనిపించింది. డ్రెస్సింగ్ మిర్రర్ మీద వున్న తన కళ్ళజోడు తీసుకొని పెట్టుకుంది.
ఒక్కక్షణం శ్రీకర్ తన వెనక నిలబడి, తన కంఠం చుట్టూ చేతులు వేసి "ప్రియా...నువ్వు కళ్ళజోడులో ఎంతందంగా వుంటావో తెలుసా...కళ్ళజోడు అమ్మాయిలకు అందాన్ని డబుల్ చేస్తుంది. నిజం చెప్పనా...డెడ్ బాడీనైనా బెడ్ మీదికి రప్పించే స్టన్నింగ్ స్ట్రక్చర్ నీది." అంటోన్న ఫీలింగ్.
పూలు జడలో తరుముకున్నాక, పెర్ ఫ్యూమ్ ని స్ప్రే చేసుకుంది. ఇంకో అరగంటలో శ్రీకర్ వచ్చేస్తాడు. ఈలోగా బబ్లూని నిద్రపుచ్చితే సరి. వయసు ఎనిమిదేళ్ళయినా ఇరవయ్యేళ్ళ ముదురు డైలాగ్స్ చెబుతాడు. వీడ్ని చూసే తెలుగు సినిమాల్లో పిల్లలకి ముదురు డైలాగ్స్ పెట్టారేమోనని అనిపిస్తోంది.
"ప్రియా డార్లింగ్..."
డ్రెస్సింగ్ మిర్రర్ ముందు నిలబడ్డ ప్రియంవద ఆ మాటలకు అదిరిపోయింది. ఆ గొంతు శ్రీకర్ ది కాదు. మరి... అనుమానంగా వెనక్కి తిరిగింది.
ఎప్పుడొచ్చాడో...తన వెనకే నిలబడి తననే అబ్జర్వ్ చేస్తున్నాడు బబ్లూ.
"ఒరే బబ్లూ నువ్వా...."
"అబ్బే నేను కాదు మమ్మీ...సినిమాల్లో కండలు బాగా చూపించి, చొక్కాలు విప్పేసి తిరుగుతూంటాడు చూడు...ఎవరబ్బా....ఆ...తల్మాన్ ఖాన్...."
"తల్మాన్ ఖాన్ కాదు...సల్మాన్ ఖాన్...స..." చెప్పింది ప్రియంవద.
"ఇవి నీకు బాగానే గుర్తుంటాయి మమ్మీ...కానీ కన్నకొడుక్కి అన్నం పెట్టాలని గుర్తుండదా?"
"ఒరే బబ్లూ...నువ్వు రోజూ టీవీ సీరియల్స్ చూస్తే తన్నేస్తా...నిలబెట్టి కొట్టేస్తా నాలుగడుగుల్లేవ్...పెద్ద పెద్ద మాట లేమిటి?" అంది చూపుడు వేలితో బెదిరిస్తూ.
"సర్లే..ముందు కొడుకు సంగతి చూడు. అవతల మీ ఆయన వచ్చే టైమైంది. తొందరగా నాకు అన్నం తినిపించి, నన్ను పడుకోబెట్టు.."
గతుక్కుమంది ప్రియంవద. సినిమాలు, టీవీ సీరియల్స్ చూసే పిల్లలు ఇలా తయారవుతున్నారా?" వీళ్ళని చూసి సినిమాల్లో, సీరియల్స్ లో ఇలాంటి పాత్రలు పెడుతున్నారా...అన్న డౌటూ వచ్చింది ప్రియంవదకు.
ఓసారి కొడుకు వంక చూసింది.
"ఏంటీ మమ్మీ అదే పనిగా చూస్తున్నావు. నేను బాగా ముద్దోస్తున్నానా? నాకిప్పుడు ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇవ్వాలని అనిపిస్తోందా?" అడిగాడు బబ్లూ.
వెంటనే బొద్దుగా, గుండ్రంగా వున్న కొడుకు వంక చూసింది. బాబు ఉండాల్సిన వెయిట్ కన్నా అయిదారు కేజీలు ఎక్కువే వున్నాడన్న, డాక్టర్ చెప్పిన విషయం గుర్తొచ్చింది. ఓ నిట్టూర్పు విడుస్తూ కిచెన్ వైపు నడుస్తూంటే కళ్ళు మసగ్గా అనిపించినట్టు అనిపించింది.
"మమ్మీ...కళ్ళు మసగ్గా వున్నాయా?" అడిగాడు బబ్లూ.
"ఏం...ఎందుకు అడిగావు?"
"నా కళ్ళజోడు నువ్వు పెట్టుకుంటే అలానే అనిపిస్తుందిలే. నాకూ అలానే వుంది..." అంటూ తను పెట్టుకున్న కళ్ళజోడు తీసి తల్లికి ఇచ్చాడు.
బబ్లూకి అన్నం తినిపిస్తూ చెప్పింది ప్రియంవద.
"ఒరే బబ్లూ...అన్నం తినడం నేర్చుకోరా. ఇంత వయసొచ్చినా మీ అబ్బాయికి మీరు అన్నం తినిపించడమేమిటి? అని అంతా ఎగతాళి చేస్తున్నారు."
"మీ ఆయనకు తినిపిస్తుంటే ఎగతాళి చేయలేదా?" అడిగాడు వెంటనే రిట్టార్టిస్తూ బబ్లూ.
|
|